Fake News, Telugu
 

ATMలలో 2,000 రూపాయల నోట్లు అందుబాటులో ఉంచవద్దని RBI ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు

0

2000 నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈరోజు నుండి కొత్త నియమాలను అమలులోకి తీసుకు వస్తోంది అని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘బ్యాంకులు ఈరోజు నుండి 2000 రూపాయల నోట్లు స్వీకరించగలుగుతాయి గానీ, మళ్లీ కస్టమర్లకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 2,000 రూపాయల నోట్లని ఇవ్వకూడదు. అలాగే ఈ రోజు నుండి ATM మెషిన్లలలో కూడా రూ. 2,000 రూపాయల నోట్లు లోడ్ చెయ్యొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది’ అని కూడా ఈ పోస్టులో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్న విషయాలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘బ్యాంకులు ఈరోజు నుండి కస్టమర్లకు 2000 రూపాయల నోట్లని ఇవ్వకూడదు. అలాగే ఈ రోజు నుండి ATM మెషిన్లలలో కూడా రూ. 2,000 రూపాయల నోట్లు లోడ్ చెయ్యొద్దని RBI బ్యాంకులను ఆదేశించింది’.

ఫాక్ట్ (నిజం):  ఇదే వార్త చాలా సంవత్సరాల నుండి చక్కర్లు కొడుతోంది. నిజానికి ప్రభుత్వం 2000 రూపాయల నోట్ల ముద్రణ 2019 నుండే ఆపేసినప్పటికీ, వీటి చలామణి మాత్రం ఇప్పటికి జరుగుతూనే ఉంది. 2000 రూపాయల నోట్ల ఉపసంహారణ చేయట్లేదని కేంద్ర ప్రభుత్వం మరియు RBI పలు సందర్భాల్లో స్పష్టం చేసాయి. మార్చ్ 2022 చివరి నాటికి మొత్తం 214 కోట్లకు పైచిలుకు 2000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

RBI నిజంగా ఈ ఆదేశాలు ఇచ్చిందా?

బ్యాంక్ కస్టమర్లకు 2000 రూపాయల నోట్లని ఇవ్వకూడదని గానీ, ATM మెషిన్లలలో 2,000 రూపాయల నోట్లు లోడ్ చెయ్యొద్దని గానీ RBI ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఇప్పుడే కాదు, గతంలో కూడా RBI బ్యాంకులకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అటువంటి ఆదేశాలేవీ RBI వెబ్సైటులో లేవు.

RBI 2000 రూపాయల నోట్ల ముద్రణ ఆపివేసింది

RBI 2019 నుండి 2,000 రూపాయల నోట్లు ముద్రించట్లేదు. అసలు 2000 డినామినేషన్ బ్యాంక్ నోట్లను ముద్రించడానికి ప్రింటింగ్ ప్రెస్‌లకు ఎలాంటి ఇండెంట్ అందించలేదు. ఈ సంవత్సరాలకు సంబంధించి RBI వార్షిక రిపోర్ట్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

ఐతే 2022 వార్షిక రిపోర్ట్ ప్రకారం మార్చ్ 2022 చివరి నాటికి మొత్తం 214 కోట్లకు పైచిలుకు 2000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి మొత్తం విలువ 4,28,394 కోట్లు.

2000 రూపాయల నోట్లు ఉపసంహారించే ఉద్దేశం లేదు

సాధారణంగా నోట్ల ముద్రణ అనేది కేంద్ర ప్రభుత్వం RBIతో సంప్రదించి తీసుకునే నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం కూడా పలు సందర్భాల్లో పార్లమెంట్‌లో 2019 నుండి 2,000 రూపాయల నోట్లు ముద్రణ తగ్గిందని చెప్పింది. ఐతే 2,000 రూపాయల నోట్లను ఉపసంహారించే ఉద్దేశం లేదని కూడా స్పష్టం చేసింది (ఇక్కడ మరియు ఇక్కడ).

ఐతే ప్రజలు 2,000 రూపాయల నోట్లను మార్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ బ్యాంక్ తమ ATMలో ఎక్కువగా తమ 500 మరియు 200 రూపాయల నోట్లు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఐతే 2,000 రూపాయల నోట్లను ఉపసంహారించే ఉద్దేశం లేదని మరొక్కసారి స్పష్టం చేసింది (ఇక్కడ మరియు ఇక్కడ).

ఈ వార్త చాలా సంవత్సరల నుండి చక్కర్లు కొడుతోంది

2019 నుండి 2000 రూపాయల నోట్ల ముద్రణ జరగలేదని ఒక RTI ద్వారా వెలుగులోకి రావడంతో 2000 రూపాయల నోట్లకు సంబంధించి తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ). అలాగే పైన చెప్పినట్టు పలు బ్యాంకులు తమ ATMలో 500 మరియు 200 రూపాయల నోట్లు ఎక్కువగా అందుబాటులోకి తేవడం వల్ల ఈ వార్తలు ఎక్కువయ్యాయి. ఐతే ఈ వార్తలలో వాస్తవం లేదని RBI మరియు PIB (ఇక్కడ మరియు ఇక్కడ) గతంలోనే పలు సార్లు కొట్టి పడేశాయి.

చివరగా, ATMలలో 2,000 రూపాయల నోట్లు అందుబాటులో ఉంచవద్దని RBI ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. వీటి చలామణిలో ప్రస్తుతం ఎటువంటి మార్పు లేదు.

Share.

About Author

Comments are closed.

scroll