Fake News, Telugu
 

వైరల్ అవుతున్న ఈ వీడియోలో రాహుల్ గాంధీ హిందూ మతం గురించి తప్పుగా మాట్లాడలేదు

0

విదేశాల్లో హిందూ ధర్మం గురించి నీచంగా మాట్లాడుతున్న రాహుల్ ఖాన్ ” అని చెప్తూ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ వీడియో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రాహుల్ గాంధీ హిందూ ధర్మం గురించి ఈ వీడియోలో తప్పుగా మాట్లాడారు.

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియోలో రాహుల్ గాంధీ బీజేపీని విమర్శించారు. ఆయన అనేక హిందూ పుస్తకాలు చదివారని, బీజేపీ వ్యవహారశైలిలో హిందూ అనేది లేనే లేదు అని ఆయన అన్నారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ అవుతున్న వీడియోలో ‘SciencesPo’ అనే వాటర్ మార్క్ గమనించి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ వీడియో రాహుల్ గాంధీ SciencesPo యూనివర్సిటీ(పారిస్)లో ఒక చర్చలో పాల్గొన్నప్పుడు తీసిన వీడియోలోని ఒక చిన్న క్లిప్ అని మాకు అర్థం అయ్యింది.  సెప్టెంబర్ 2023లో జరిగిన ఈ చర్చ యొక్క పూర్తి వీడియోని మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఈ చర్చలో SciencesPo యూనివర్సిటీ విద్యార్థులు, ఫ్యాకల్టీ అడిగిన ప్రశ్నలకు రాహుల్ సమాధానాలు ఇచ్చారు. వైరల్ వీడియోలో కనిపిస్తున్న భాగం మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఒక మాస్టర్స్ విద్యార్థి రాహుల్ గాంధీని ప్రశ్న అడుగుతూ, భారతదేశంలో తన స్నేహితులు, కుటుంబ సభ్యులుపై హిందూ జాతీయవాదం(nationalism) యొక్క ప్రభావాన్ని తను గమనించాడని, ఒకవేళ INDI కూటమి ఎన్నికల్లో గెలిస్తే హిందూ మతం యొక్క పాత్ర ఎంత ఉండబోతుంది అని అడిగాడు. 

దీనికి రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానమే వైరల్ వీడియోలో కనిపిస్తుంది. దానికి జవాబుగా, తను గీత, ఉపనిషత్తులు, అనేక హిందూ ధర్మానికి చెందిన పుస్తకాలు చదివాను అని, బీజేపీ వ్యవహారశైలి(చేసే పనుల్లో) హిందూ అనేది లేనే లేదు అని అన్నారు(There is nothing Hindu about what BJP does.) ఏ ఒక్క హిందూ ధర్మ పుస్తకంలో కానీ, హిందూ విజ్ఞాని దగ్గర నుంచి కానీ, మనకంటే బలహీనులని మనం హింస పెట్టాలి అని అనడాన్ని అతను వినలేదు అని చెప్పారు. 

కాబట్టి, బీజేపీ వారు హిందూ జాతీయవాదులు కాదని, వారు కేవలం అధికారం పొందడమే లక్ష్యంగా ఉన్నారని, అది పొందడానికి ఏమైనా చేస్తారు అని చెప్పారు. ఈ చర్చలో ఎక్కడ కూడా రాహుల్ హిందూ మతాన్ని విమర్శించలేదు, లేదా వైరల్ వీడియోలో చెప్తున్నట్లు నీచంగా మాట్లాడలేదు. తను కేవలం బీజేపీని విమర్శించారు. ఈ విషయాన్ని మనం వైరల్ అవుతున్న వీడియోలో కూడా స్పష్టంగా చూడవచ్చు.

ఈ వ్యాఖ్యల గురించి సెప్టెంబర్ 2023లో పలు మీడియా సంస్థలు వార్తా కథాలు(ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) ప్రచురించాయి.

కావున, ఈ వీడియోలో రాహుల్ గాంధీ హిందూ మతం గురించి తప్పుగా మాట్లాడలేదు, బీజేపీని  విమర్శించారు. 

Share.

About Author

Comments are closed.

scroll