‘బీజేపీ పూరి జగన్నాథ్ ఆలయం ఆస్తులు అమ్ముతుంది’, అని చెప్తూ ఒక న్యూస్ ఆర్టికల్ ఫోటోని సోషల్ మీడియాలో కొంతమంది షేర్ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ ఆలయ 35 వేల ఎకరాల భూమి అమ్మబోతున్నారని ఆ ఆర్టికల్ టైటిల్ లో చదవొచ్చు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బీజేపీ ఒడిశా లోని పూరీ జగన్నాథ్ ఆలయం ఆస్తులు అమ్ముతుంది. దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ ఫోటో.
ఫాక్ట్: ఒడిశా న్యాయశాఖ మంత్రి అసెంబ్లీ లో బీజేపీ ఎంఎల్ఏ అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ,పూరీ జగన్నాథ్ ఆలయం కి సంబంధించిన సుమారు 35 వేల ఎకరాలను అమ్మేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపినట్టు పోస్ట్ చేసిన ఆర్టికల్ లో చదవొచ్చు. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని, ఆలయ భూమి కేటాయింపు గురించి నిర్ణయాలు జగన్నాథ్ ఆలయ కమిటీ తీసుకుంటుందని జగన్నాథ్ ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాదు, ప్రస్తుతం ఒడిశా లో ఉన్నది బీజేడీ ప్రభుత్వం; బీజేపీ ఉన్నది ప్రతిపక్షంలో. కావున పోస్ట్ లో పూరి జగన్నాథ్ ఆలయం ఆస్తులను బీజేపీ అమ్మేస్తుందని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్ లోని వార్త గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఫోటోలోని ఆర్టికల్ ని ‘ఒరిస్సా పోస్ట్’ వార్తాసంస్థ 17 మార్చి 2021 న ప్రచురించినట్టు తెలిసింది. ఆ ఆర్టికల్ కి సంబంధించిన ఈ-పేపర్ ని ఇక్కడ (ఆర్కైవ్డ్) చదవొచ్చు.
ఆర్టికల్ లో బీజేపీ ఆలయం ఆస్తులు అమ్ముతుందని ఎక్కడా లేదు. పూరీ జగన్నాథ్ ఆలయం పై బీజేపీ ఎంఎల్ఏ అడిగిన ఒక ప్రశ్నకు ఒడిశా న్యాయశాఖ మంత్రి బదులిస్తూ, ‘బీడీ శర్మ కమిటీ సూచనలు మేరకు సుమారు 35 వేల ఎకరాలను ‘Uniform Policy’ కింద అమ్మడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాము’, అని తెలిపారు.
అయితే, ఈ వార్తా వైరల్ అవ్వడంతో, పూరీ జగన్నాథ్ ఆలయ భూముల గురించి ప్రచారం అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని జగన్నాథ్ ఆలయ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ తెలిపారు. చాలా కాలం నుండి వివిధ వ్యక్తుల ఆధీనంలో ఉన్న లేదా స్వాధీనం చేసుకున్న జగన్నాథ్ ఆలయ భూములను ‘Uniform Policy’ (2003) ప్రకారం ఆలయ కమిటీ పరిష్కరిస్తుందని, ప్రజా ప్రయోజన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వానికి లేదా ఇతరులకు భూమిని కేటాయించడం గురించి నిర్ణయాలు జగన్నాథ్ ఆలయ కమిటీ తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయం పై పూరీ జగన్నాథ్ ఆలయ అధికారిక ట్విట్టర్ అకౌంట్ చేసిన ట్వీట్లను ఇక్కడ చూడవొచ్చు.
2003 లో ‘Uniform Policy’ వచ్చినప్పుడు బీజేడీ-బీజేపీ పొత్తుగా ప్రభుత్వంలో ఉన్నారు. కానీ, ఆ పొత్తు ఇప్పుడు లేదు. ఒకవేల నిజంగానే ఒడిశా ప్రభుత్వం ఆలయ భూములు అమ్మాలనుకున్నా, ప్రస్తుతం ఒడిశా లో ఉన్నది బీజేడీ ప్రభుత్వం; బీజేపీ ఉన్నది ప్రతిపక్షంలో. అంతేకాదు, జగన్నాథ్ ఆలయ భూముల అమ్మకాన్ని ప్రతిపక్ష నాయకుడు మరియు బీజేపీ లీడర్ ప్రదీప్త కుమార్ వ్యతిరేకించారు.
చివరగా, ఫోటోలో ఉన్న జగన్నాథ్ ఆలయ భూముల అమ్మకం వార్తకీ, ఒడిశా బీజేపీ కి సంబంధంలేదు.