Fake News, Telugu
 

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0 పథకం ఎల్‌పీజీ కనెక్షన్ ఉన్నవారి కోసం కాదు

0

ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0 స్కీంను తీసుకొచ్చిందని ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతుంది. ఈ పథకం ద్వారా ఎనిమిది కోట్లమంది మహిళలకు గ్యాస్ సిలిండర్ ఉచితంగా వస్తుందని వీడియోలో అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ వీడియో యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: ఎల్‌పీజీ సిలిండర్ ఉన్నవారి కోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0 పథకం.

ఫాక్ట్: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0, ఎల్‌పీజీ కనెక్షన్ లేని వారికి మాత్రమే. 18 ఏండ్లు నిండిన మహిళలకు, అది కూడా కేవలం ఎస్సీ, ఎస్టీ, మరి కొన్ని వెనకబడిన వర్గాలకు సంబంధించిన వారికే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. 2016లో ప్రారంభించిన ఉజ్వల యోజన 1.0 కింద ఎనిమిది కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్‌ల లక్ష్యం ఏడు నెలల ముందే చేరుకుంది. మార్చ్ 2020కి చేరాల్సిన లక్ష్యాన్ని ఆగష్టు 2019లోనే సాధించింది. 2021లో వచ్చిన ఉజ్వల యోజన 2.0లో మరో కోటి మందికి కనెక్షన్స్ ఇవ్వాలని నిర్ణయించారు; ఇంకా వలసదారుల నమోదు ప్రక్రియను సులభం చేసి వారికి ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.        

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0 గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైటులోనే, ఈ పథకం కేవలం ఎల్‌పీజీ కనెక్షన్ కొత్తగా తీసుకునే వారికేనని తెలిపారు.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0 అందరికీ దరఖాస్తు చేసుకునే వీలుండదు. 18 ఏండ్లు నిండిన మహిళలకు, అది కూడా కేవలం ఎస్సీ, ఎస్టీ, మరి కొన్ని వెనకబడిన వర్గాలకు సంబంధించిన వారికే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (1.0) 2016లో ప్రారంభించారు. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ పథకం గ్రామీణ కుటుంబాలకు ఎల్‌పీజీ కనెక్షన్ అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020 మార్చి నాటికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (బిపిఎల్) కుటుంబాలకు చెందిన 50 మిలియన్ మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్లను అందించాలని లక్ష్యంగా ఉండేది. ఈ పథకం యొక్క లక్ష్యాన్ని తరువాత 80 మిలియన్ ఎల్‌పీజీ కనెక్షన్లకు సవరించారు. దాని లక్ష్యమయిన ఎనిమిది కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్ లను ఏడు నెలల ముందే చేరుకుంది. మార్చ్ 2020కి చేరాల్సిన లక్ష్యాన్ని ఆగష్టు 2019లోనే సాధించింది.

2021లో వచ్చిన ఉజ్వల యోజన 2.0లో మరో కోటి మందికి కనెక్షన్స్ ఇవ్వాలని నిర్ణయించారు; మరియు వలసదారుల నమోదు ప్రక్రియను సులభం చేసారు.

ఎల్‌పీజీ సిలిండర్ ప్రమాదాలకు సంబంధించి ప్రత్యేకంగా కొత్త భీమా అంటూ ఉజ్వల యోజన 2.0లో లేదు. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెబ్సైటులో ఎల్‌పీజీ సిలిండర్ ప్రమాదాలకు సంబంధించి ఒక భీమా డాక్యుమెంట్ ఉంది. కానీ, అది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0 కింద కొత్తగా వచ్చింది కాదు.  

చివరగా, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0 పథకం ఎల్‌పీజీ కనెక్షన్ ఉన్నవారి కోసం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll