Fake News, Telugu
 

రాజోలు పరిసరాల్లో పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా తిరుగుతుందనే వదంతులు అవాస్తవం అని పోలీసులు తెలిపారు

0

“రాజోలు పరిసర ప్రాంతాలలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఇతను పిల్లలని కిడ్నాప్ చేసే వాడిగా అనుమానించి స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఇటీవల పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా రాష్ట్రంలో తిరుగుతుంది అని  వైరల్ అవుతున్న వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి” అని చెప్తున్న ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: రాజోలు పరిసర ప్రాంతాలలో పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ తిరుగుతుంది.

ఫాక్ట్: అయినవిల్లి పోలీసులు ఇచ్చిన మీడియా ప్రకటనలో గత కొంత కాలంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు పిల్లల్ని ఎత్తుకు పోతున్నారు అనే తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది అని, ఇటువంటి వదంతులని నమ్మవద్దు అని తెలిపారు. అదే విధంగా, ఇతర జిల్లాలకు చెందిన పోలీసులు కూడా ఈ పుకార్లను ఖండించారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ముందుగా ఇదే విషయం గురించి స్థానిక వార్తా పత్రికలను వెతకగా,  ఈనాడు దినపత్రికలో అక్టోబర్ 24న వచ్చిన కథనం ప్రకారం, గత కొంత కాలంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు పిల్లల్ని ఎత్తుకు పోతున్నారు అనే తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది అని, ఇటువంటి వదంతులని నమ్మ వద్దు అని అయినవిల్లి ఎస్సై నాగేశ్వర రావు తెలిపారు.

ఇక ఇవే పుకార్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వ్యాపించినప్పుడు స్థానిక పోలీసు అధికారులు వీటిని ఖండించారు. కర్నూలు పట్టణ డీఎస్పీ కెవి మహేష్ మీడియాతో మాట్లాడుతూ, కర్నూల్ పట్టణంలో పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగులు ఉన్నాయంటూ వస్తున్న పుకార్లని నమ్మవద్దని, ఎవరిపైనా అనుమానం వస్తే పోలీసులని వెంటనే సంప్రదించాలని చెప్పారు.

పీలేరులో కూడా ఇటువంటి పుకార్ల కారణంగా స్థానికులు కొందరు వ్యక్తులపై అక్టోబర్ 18న దాడిచేశారు. అయితే పోలీసు విచారణలో వారు ఒడిషా నుంచి భవన నిర్మాణ కూలి పని కోసం వచ్చారు అని, వారు పిల్లల్ని కిడ్నాప్ చేసే వారు కాదు అని తేలింది.

ఇక బద్వేల్ పోలిసే స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన అయిదు మిస్సింగ్ కేసులలో కూడా వ్యక్తిగత కారణాలు వల్ల అలా జరిగినది అని, ఎవరు కూడా వీళ్ళని బలవంతంగా కిడ్నాప్ చేయలేదని, కిడ్నాప్ గ్యాంగ్ గురించి వస్తున్న వదంతులను నమ్మవద్దు అని అక్కడి పోలీసులు మీడియాకు తెలిపారు.

చివరిగా, రాజోలు పరిసరాల్లో పిల్లల్ని అపహరించే ముఠా తిరుగుతుందనే  పుకార్లలో వాస్తవం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll