కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నెం.4 పై గల ఒక దుకాణ (స్టాల్) యజమాని స్టాల్ పై ఉన్న ప్రధాని ప్రధానమంత్రి మోదీ ఫోటో కనిపించకుండా కాగితం అతికించాడు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). దీనికి మద్దతుగా ఓ రైల్వే స్టేషన్‌లోని స్టాల్‌పై ఉన్న హోర్డింగ్‌లో మోదీ ఫోటో కనిపించకుండా కాగితంతో కప్పబడిన దృశ్యాలను చూపిస్తున్న ఫోటో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో మోదీ ఫోటోలు పెట్టడానికి అనుమతి లేదు, అందుచేత రైల్వే స్టేషన్‌లో ఉన్న ఓ దుకాణం హోర్డింగ్‌లో ఉన్న మోదీ ఫోటో కనిపించకుండా కాగితంతో కవర్ చేశారు, అందుకు సంబంధించిన ఫోటో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటో మార్చి 2024 నాటిది. ఫోటోలో కనిపిస్తున్న దుకాణం ‘OSOP స్టాల్’ అని, 2024 లోకసభ ఎన్నికల సమయంలో అమలులో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎన్నికల నియమావళి) కారణంగా కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో ‘OSOP స్టాల్’పై ఉన్న ప్రధాని మోదీ ఫోటో కవర్ చేయబడింది అని పాలక్కాడ్ రైల్వే డివిజన్ అధికారులు స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోను ఇదే క్లెయిమ్‌తో షేర్ చేసిన పలు X(ట్విట్టర్) పోస్టులు లభించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ వైరల్ పోస్టులో ఒకదానిపై 17ఫిబ్రవరి 2025న దక్షిణ రైల్వే, పాలక్కాడ్ డివిజన్ రైల్వే శాఖ స్పందిస్తూ (ఆర్కైవ్డ్), “2024లోకసభ ఎన్నికల సమయంలో అమలులో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) అమలులో ఉన్న కారణంగా స్టాల్‌పై ఉన్న ప్రధానమంత్రి మోదీ ఫోటోను తాత్కాలికంగా కవర్ చేశారని. అయితే, ప్రస్తుతం అదే స్టాల్ బోర్డుపై ‘OSOP స్టాల్’ మార్గదర్శకాల ప్రకారం ప్రధానమంత్రి ఫోటోను ప్రదర్శిస్తున్నారు” అని పేర్కొన్నారు (ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువదించగా). అలాగే ఈ పోస్టుతో పాటు ఆ ‘OSOP స్టాల్’ యొక్క ప్రస్తుత ఫోటోను కూడా షేర్ చేశారు.
ఈ క్రమంలోనే మేము ఈ ఫోటోను ఇదే క్లెయిమ్‌తో మార్చి 2024లో మొదటగా షేర్ చేసినట్లు గుర్తించాము. అప్పుడు కూడా ఇలాంటి పోస్టులపై దక్షిణ రైల్వే, పాలక్కాడ్ డివిజన్ స్పందిస్తూ, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) అమలులో ఉన్నందున భారత ఎన్నికల సంఘం (ECI) ఆదేశానికి అనుగుణంగా ‘OSOP స్టాల్’ పై ఉన్న ప్రధాని మోదీ ఫొటోను కవర్ చేసినట్లు పేర్కొంది. గతంలో కూడా పలుమార్లు ఈ ఫోటో ఇదే క్లెయిమ్‌తో వైరల్ కాగా, వాటిపై స్పందిస్తూ రైల్వే అధికారాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు (ఇక్కడ).
మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC):
ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు, నేతలు చేయాల్సినవి, చేయకూడనవి ఏంటనేది ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) నిర్దేశిస్తుంది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు గాను ఎన్నికల సంఘం కొన్ని నియమాలను రూపొందించింది. ఎన్నికల ప్రచారం మొదలుకొని, పోలింగ్ తేదీ వరకు పార్టీలు, నేతలు ఈ నియామవళికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకటించిన తేదీ మొదలు, ఫలితాలు వెలువడే వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుంది. MCC నియమాలను క్రింద చూడవచ్చు.
- కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల ప్రచారంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఓటర్లను ప్రభావితం చేసేలా విధానపరమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు, స్కీములు ప్రకటించకూడదు.
- ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో ఉన్న మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ఫోటోలు, రాజకీయ పార్టీల ప్రస్తావనలు మొదలైనవన్నీ తొలగించాల్సి ఉంటుంది. ఎటువంటి నియామకాలు కూడా చేపట్టకూడదు.
- అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజాధనాన్ని వినియోగించకూడదు. పత్రికల్లో గానీ, ఇతర మాధ్యమాల్లో గానీ ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు.
- మంత్రులు ఎన్నికల ప్రచారంలో అధికారిక వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఆ పర్యటనల్లో వారు ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉండటానికి వీల్లేదు. బీకన్ లైట్లు కలిగి ఉన్న పైలట్ కార్లు (బుగ్గ కార్లు), తమ ఉనికిని తెలిపేలా సైరన్ ఉన్న వాహనాలను కూడా వాడకూడదు.
- రాజకీయ నేతలు ప్రత్యర్థి పనితీరుపై విమర్శలు చేయొచ్చు. కానీ, వ్యక్తిగత దూషణలకు దిగకూడదు. అలాగే, కులం, మతం పేరుతో దూషించి ఎన్నికల్లో లబ్ధి పొందడం నియామావళికి వ్యతిరేకం.
- దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇలా ఏ ప్రార్ధనా మందిరాన్ని కూడా ఎన్నికల ప్రచారం కోసం వినియోగించకూడదు. ఓటర్లను ప్రలోభం పెట్టడం, వారిని బెదిరించడం వంటివి కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయి.
- రాజ్యాంగంలోని ఆదర్శాలకు విరుద్ధంగా మ్యానిఫెస్టో ఉండకూడదు. పార్టీలు ఇచ్చే హామీల్లో హేతుబద్ధత ఉండాలి.
- ఎన్నికల పోలింగ్ 48 గంటల ముందు తమకు ఓటేయాలంటూ ప్రచారం నిర్వహించకూడదు. పోలింగ్ ముందు ఓటర్లను ప్రభావితం చేయూడదన్న ఉద్దేశంతో ఈసీ ఈ నిబంధన విధించింది.
- పోలింగ్ తేదీ రోజు 100 మీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం కూడా నేరంగా పరిగణిస్తారు. పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్లకు సొంత వాహనాల్లో ఓటర్లను తరలించకూడదు.

మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.
భారత ఎన్నికల సంఘం (ECI) ఆదేశాల ప్రకారం, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) 16 మార్చి 2024 నుండి అమల్లోకి వచ్చింది.
MCC మార్గదర్శకాల ప్రకారం, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో ఉన్న మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ఫోటోలు, రాజకీయ పార్టీల ప్రస్తావనలు మొదలైనవన్నీ అలాగే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని స్కీములు, ఇతర ప్రకటనలలో ఉన్న రాజకీయ నాయకుల ఫోటోలు కూడా తొలగించాల్సి ఉంటుంది.
భారతీయ రైల్వే MCC మార్గదర్శకాలకు కట్టుబడి రైల్వే స్టేషన్లలో ఉన్న మోదీ చిత్రాలను కవర్ చేయడాన్ని మార్చ్ 2024లో పలు వార్తా కథనాలు రిపోర్ట్ చేశాయి (ఇక్కడ & ఇక్కడ). ఇది పాలక్కాడ్ అధికారుల ట్వీట్‌కు మద్దతు ఇస్తుంది, స్టాల్‌పై ఉన్న మోడీ చిత్రం MCC మార్గదర్శకాలను అనుసరించి కవర్ చేయబడిందని సూచిస్తుంది. దీన్ని బట్టి మనం పాలక్కాడ్ అధికారుల OSOP స్టాల్‌పై ఉన్న మోదీ ఫోటోను MCC మార్గదర్శకాలను అనుసరించి కవర్ చేశారని నిర్ధారించవచ్చు.
పాలక్కాడ్ డివిజన్ రైల్వే అధికారుల ఈ వైరల్ ఫోటోపై వివరణ ఇస్తూ చేసిన ట్వీట్‌లో షేర్ చేసిన ఫోటోలో ఉన్న స్టాల్ వైరల్ ఫోటోలో ఉన్న స్టాల్‌తో పోలిస్తే భిన్నమైన ఉత్పత్తులను విక్రయిస్తుందని కావున రెండు ఫోటోలు ఒకే స్టాల్‌ను చూపించడం లేదని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు సందేహాలను లేవనెత్తారు. అయితే, వైరల్ ఫోటోలో ఉన్న స్టాల్‌పై ‘One Station One Product’ అని రాసి ఉండటం మనం గమనించవచ్చు.
‘One Station One Product’ (OSOP) స్టాల్:
2022-23 బడ్జెట్‌లో, కేంద్ర ప్రభుత్వం ‘One Station One Product’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, భారతీయ రైల్వే దేశీయ, స్థానిక ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి, వాటికి అధిక ప్రచారం అందించడానికి అవుట్‌లెట్‌లు, స్టాళ్లు, కియోస్క్‌లను ఏర్పాటు చేస్తుంది.
OSOP పథకం నియమాల ప్రకారం, ఈ స్టాల్స్‌ను తాత్కాలికంగా స్థానిక విక్రేతలకు 15 రోజుల పాటు కేటాయిస్తారు. స్టాల్ కోసం దరఖాస్తు చేసుకున్న అందరికి (విక్రేతలకు) ప్రాధాన్యత జాబితా ఆధారంగా స్టాల్ కేటాయింపు జరుగుతుంది, ప్రతి విక్రేతకు ఒకసారి గరిష్టంగా 15 రోజుల మాత్రమే స్టాల్ కేటాయింపు చేయబడుతుంది. ప్రాధాన్యత జాబితాలోని అందరు దరఖాస్తుదారులకు ఒకరి తర్వాత ఒకరికి స్టాల్స్‌ను కేటాయించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది (ఇక్కడ).

కావున వైరల్ ఫోటోతో పోలిస్తే పాలక్కాడ్ రైల్వే డివిజన్ అధికారుల షేర్ చేసిన ప్రస్తుత స్టాల్‌లో వేరే ఉత్పత్తులు ఉండటం సహజమే, ఎందుకంటే OSOP స్టాల్ ప్రతి 15 రోజులకు వేరే వ్యక్తికి కేటాయించబడుతుంది.
చివరగా, 2024 లోకసభ ఎన్నికల సమయంలో అమలులో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) కారణంగా కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో ‘OSOP స్టాల్’పై ఉన్న ప్రధాని మోదీ ఫోటో కవర్ చేయబడింది.