ఓ వ్యక్తి గ్లాసులో నీళ్లు నింపి అందులో ఉమ్మి వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ముస్లిం అని, ఈ ఘటన ఇటీవల అలీగఢ్ కోర్టులోని న్యాయమూర్తికి తన ప్యూన్ నీటిని అందిస్తున్న వీడియో అని షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత వాస్తవం ఉందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: ఈ వీడియో అలీఘర్ కోర్టులో ఒక న్యాయమూర్తి సేవించే నీటిలో, తన కింద పని చేసే ముస్లిం ప్యూన్ ఉమ్మివేస్తున్న ఘటనను చూపిస్తుంది.
ఫాక్ట్ (నిజం): ఇది 2018లో అలీఘర్ కోర్టులో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో. వార్తా కథనాల ప్రకారం, వీడియోలోని వ్యక్తి పేరు వికాస్ గుప్తా. ఇతను కోర్టులో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్. ఈ ఘటన జరిగిన వెంటనే అతడిని అధికారులు సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, దీనికి సంబంధించి పలు వార్తా కథనాలు ప్రచురించబడ్డట్టు మేము గమనించాం (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ సంఘటన అలీఘర్‌లోని ఒక కోర్టులో 22 మే 2018లో జరిగింది. ఒక ప్యూన్, ఒక మహిళా సివిల్ జడ్జికి ఉమ్మివేసిన నీటిని అందిస్తున్నట్లు ఈ రిపోర్ట్స్ వెల్లడించాయి.
అంతే కాకుండా, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు వికాస్ గుప్తా అని, ఈ ఘటన తర్వాత గుప్తాను సస్పెండ్ చేశారని మరియు అలీఘర్ జిల్లా మరియు సెషన్స్ జడ్జి ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు అని ఈ కథనాలు తెలిపాయి.
ఈ కథనాల ప్రకారం, 4th క్లాస్ ఎంప్లాయిస్ సంఘం అధ్యక్షుడు, ఉమా శంకర్ యాదవ్ ఈ చర్య పూర్తిగా “తప్పు” మరియు “ఆమోదించలేనిది” అని తెలిపారు. పైగా, ‘రెండు నెలలుగా వేధింపులకు గురవ్వటంతో గుప్తా యొక్క మానసిక పరిస్థితి సరిగ్గా లేదు’ అని తెలిపారు.
ఆ వ్యక్తిని వికాస్ గుప్తాగా గుర్తించి, ఈ సంఘటన 2018లో జరిగిందని నిర్ధారించే అనేక ఇతర వార్తా కథనాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఇదే వీడియోను ఓ ట్విటర్ యూజర్ షేర్ చేయడంతో, అలీగఢ్ పోలీసులు ఆ ట్వీట్‌పై స్పందిస్తూ, ఇది పాత వీడియో అని, నిందితుడిపై తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
చివరిగా, యూపీ కోర్టులో గ్లాసు నీళ్లలో ఉమ్మివేస్తున్న ప్యూన్ యొక్క పాత వీడియోను ఇప్పుడు మతపరమైన వాదనతో షేర్ చేస్తున్నారు.