ఆయుధాన్ని పరీక్షిస్తున్నప్పుడు ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు తనను తాను కాల్చుకున్న వీడియోను తాలిబన్లకు సంబంధించినదిగా ఒక పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. అమెరికన్ గన్ ఎలా పనిచేస్తుందని పరీక్షించే సమయంలో తనను తాను కాల్చుకున్న ఒక తాలిబన్ అని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఇటీవల అఫ్గానిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టిన తాలిబన్లు అమెరికా, ఆఫ్ఘన్ సైన్యం వదిలేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు కథనాలు ఉన్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అమెరికన్ గన్‌ను పరీక్షిస్తూ తనను తాను కాల్చుకున్న ఒక తాలిబన్ యొక్క వీడియో.
ఫాక్ట్: ఈ వీడియో 2019లో పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో జరిగిన సంఘటనది, అఫ్గానిస్తాన్ లో కాదు. ఒక వివాహ వేడుకకు ముందు తుపాకీ కాల్పుల సమయంలో ఒక వ్యక్తి అనుకోకుండా తనను తాను కాల్చుకున్నాడు. అప్పట్లో అనేక వార్తా కధనాలు ఈ సంఘటనను ప్రచురించాయి. ఈ వీడియోతో తాలిబన్లకు గాని అఫ్గానిస్తాన్‌కు గాని సంబంధంలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఇదే వీడియోను పోస్ట్ చేసారు. అతని ట్వీట్ తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతుంది.
ఈ వీడియో రెండు సంవత్సరాల క్రితం నుండే ఇంటర్నెట్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేసినప్పుడు, 2019లో ప్రచురించిన పాకిస్తానీ ఆర్టికల్ ఒకటి లభించింది, అయితే ఈ ఆర్టికల్‌లో మరొక కోణం (angle) నుండి చిత్రీకరించిన అదే వీడియో ఉంది. ఈ ఆర్టికల్‌లో ‘అబొటాబాద్‌కు చె౦దిన ఒక వ్యక్తి వివాహ వేడుకకు ము౦దు కాల్పుల సమయ౦లో పొరపాటున తలపై కాల్చుకున్న తర్వాత చనిపోయాడు,’ అని తెలిపారు.
2019లో ఈ సంఘటనను గురించి కొన్ని ఇతర పాకిస్తాన్ వార్త సంస్థలు కూడా కథనాలు ప్రచురించాయి. అవి ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ వార్తా కథనాలను చూస్తే, ఆ వీడియో కనీస౦ రె౦డు స౦వత్సరాల క్రితం తీసిందని, తాలిబన్లతో గానీ, అఫ్గానిస్తాన్‌తో గానీ సంబంధం లేదని స్పష్టమవుతో౦ది.
చివరగా, 2019లో పాకిస్తాన్‌లో జరిగిన ఒక సంఘటన వీడియోను పట్టుకొని అమెరికన్ గన్‌ను పరీక్షిస్తూ తనను తాను కాల్చుకున్న ఒక తాలిబన్ అంటున్నారు.