పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో TMC పార్టీ కార్యకర్తలు పోలీసులు పై దాడి చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలోని పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో TMC పార్టీ కార్యకర్తలు పోలీసులు పై దాడి చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలోని భద్రక్ జిల్లాలో జనవరి 2021లో జరిగింది. భద్రక్ జిల్లా హతురి గ్రామానికి చెందిన ఒక యువకుడు పోలీసు విచారణకి భయపడి ఆత్మహత్య చేసుకున్నాడనే కారణంతో అక్కడి గ్రామస్థులు ఇలా పోలీసు వాహనం పై దాడి చేసినట్టు పలు న్యూస్ సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ వీడియో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన ఘటనలకు సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని కీ పదాలు వాడి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, వీడియోలో కనిపిస్తున్న అదే పోలీసు వాహనం యొక్క ఫోటోని షేర్ చేస్తూ జనవరి 2021 లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయినట్టు తెలిసింది. ఈ ఫోటోలో పోలీస్ వాహనం సమీపంలో ఉన్న గ్రామస్థులు, వీడియోలో కనిపిస్తున్న అల్లరి మూకలు ఒక్కరే అని గమనించవచ్చు. ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలోని భద్రక్ జిల్లాలో జరిగినట్టు ఈ ఆర్టికల్ తెలిపింది. భద్రక్ జిల్లా హతురి గ్రామానికి చెందిన బాపి మహాలిక్ అనే యువకుడు, పోలీసు విచారణకు భయపడి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు ఈ ఆర్టికల్ తెలిపింది. ఆ యువకుడి చావుకి కారణమైన పోలీసుల మీద ఆగ్రహంతో, హతురి గ్రామస్థులు ఇలా పోలీసు వాహనం పై దాడి చేసినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు.
ఈ వివరాల ఆధారంగా ఆ ఘటనకి సంబంధించి మరింత సమాచారం కోసం వెతకగా, ఒడిషా రాష్ట్రం హతురి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పబ్లిష్ చేసిన యూట్యూబ్ వీడియో దొరికింది. ఈ వీడియోలో కాలిపోతున్న పోలీసు వాహనం చుట్టూ కనిపిస్తున్న పరిసరాలు, పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్న పరిసరాలు ఒక్కటే అని మనం గమనించవచ్చు. ఈ వీడియోని ‘Locals Torch Police Van Over Detainee’s Death In Bhadrak’ అనే టైటిల్ తో యూట్యూబ్ లో పబ్లిష్ చేసారు.
ఒడిషా రాష్ట్రం హతురి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్, వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఆ రాష్ట్రంలోని పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్టు పలు న్యూస్ సంస్థలు రిపోర్ట్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. BJP కార్యకర్తలపై TMC కార్యకర్తలు ప్రతీకార దాడులు చేస్తున్నారని BJP ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తమ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకి నిరసనగా, BJP 05 May 2021 నాడు దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తామని ప్రకటించింది. గ్యాంగ్ రేప్ కు సంబంధించిన ఒక ఫేక్ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుందని ట్వీట్ చేయడం తప్పితే, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హింసా ఘటనల పై పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇంకా వివరణాత్మక ప్రకటన ఏది చెయ్యలేదు.
చివరగా, ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన పాత వీడియోని చూపిస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో TMC పార్టీ కార్యకర్తలు పోలీసులు పై దాడి చేస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.