Fake News, Telugu
 

2018లో క్రొయేషియాలో జరిగిన ఈవెంట్ వీడియోను అమెరికన్లు వైట్ హౌస్‌లో ‘శ్రీ రుద్రం స్తోత్రం’ పఠిస్తున్నారంటూ షేర్ చేస్తున్నారు

0

వైట్‌హౌస్‌లో అమెరికన్ల బృందం వేద మంత్రాలు పఠిస్తున్నారంటూ ఒక వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఈ పోస్టులో ఎంత నిజం ఉందో చూద్దాం.

క్లెయిమ్: అమెరికాలోని వైట్ హౌస్‌లో అమెరికన్లు ‘శ్రీ రుద్రం స్తోత్రం’ పఠించారు.

ఫాక్ట్ (నిజం): ఇది 2018లో క్రొయేషియాలోని జాగ్రెబ్‌లో యూరోపియన్ వేదిక్ యూనియన్ నిర్వహించిన రుద్రం 11 ఈవెంట్‌కి సంబంధించిన వీడియో. ఇలాంటి కార్యాక్రమం ఒకటి అమెరికాలోని వైట్ హౌస్‌లో జరిగినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు. కాబట్టి, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించేవిధంగా ఉంది.

వీడియో యొక్క కీ ఫ్రేమ్‌లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించినప్పుడు, ఈ ఈవెంట్ 2018లో క్రొయేషియాలో జరిగినట్లు తెలిసింది (ఇక్కడ మరియు ఇక్కడ). యూట్యూబ్ వీడియో యొక్క వివరణలో ‘క్రొయేషియాలో 400+ యూరోపియన్లు ప్రదర్శించిన రుద్రం మరియు చమకం. ప్రపంచ శాంతి కోసం ఐరోపాలోని అనేక ప్రదేశాలలో యూరోపియన్ వేద సంఘం దీనిని ప్రదర్శిస్తుంది’ అని తేలిపారు.

ఈ సంఘం గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో వెతికితే, వేద యూనియన్ అనే నెట్‌వర్క్ ద్వారా ఈవెంట్‌ను నిర్వహించినట్లు తెలిసింది. ఈ సంగం, వేద మంత్రోచ్ఛారణ సమూహాలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తుందని, 2018లో క్రొయేషియాలోని జాగ్రెబ్‌లో జరిగిన రుద్రం 11 అందులో భాగమని తెలిసింది. యూనియన్ వ్యవస్థాపకులు, వోజ్కో కెర్కాన్, బ్రానిమిర్ గోనాన్‌లు వైరల్ వీడియోలో స్తోత్రం చెప్పడం చూడవచ్చు. రుద్రం 11కు సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, 2018లో క్రొయేషియాలో జరిగిన ఈవెంట్ వీడియోను అమెరికన్లు వైట్ హౌస్‌లో ‘శ్రీ రుద్రం స్తోత్రం’ పఠిస్తున్నారంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll