14 నవంబర్ 2025న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని NDA కూటమి రాష్ట్రంలోని 243 స్థానాలకు గాను 202 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, ఆర్‌జేడీ, ఇతర పార్టీల కూటమి అయిన MGB కూటమి 35 సీట్లు గెలుపొందింది. ఇతరులు 5 స్థానాల్లో గెలిచారు.
ఈ నేపథ్యంలో, భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకటించిన 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ బీహార్ ప్రజలు భారీ నిరసనలు నిర్వహిస్తున్నారు అని చెప్తూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 14 నవంబర్ 2025న ECI ప్రకటించిన 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ బీహార్ ప్రజలు భారీ నిరసనలు నిర్వహిస్తున్నారు.
ఫాక్ట్(నిజం): 14 నవంబర్ 2025న ECI ప్రకటించిన 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ బీహార్ ప్రజలు భారీగా నిరసనలు చేసినట్లు ఎటువంటి రిపోర్ట్స్/ఆధారాలు లేవు. అలాగే, ఈ వైరల్ వీడియోలు కూడా 2025న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించక ముందు నుండే ఇంటర్నెట్‌లో ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా, వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, 14 నవంబర్ 2025న ECI ప్రకటించిన 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ బీహార్ ప్రజలు భారీగా నిరసనలు నిర్వహిస్తున్నారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ క్లెయింను సమర్థించే విశ్వసనీయ రిపోర్ట్స్/ఆధారలు లభించలేదు. ఒకవేళ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ బీహార్ ప్రజలు భారీగా నిరసనలు చేపట్టి ఉంటే, ఆ విషయాన్ని పలు మీడియా సంస్థలు ఖచ్చితంగా రిపోర్ట్ చేసి ఉండేవి.
తదుపరి మొదటి వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో 14 నవంబర్ 2025న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించక ముందే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉందని తెలిసింది. ఇవే దృశ్యాలను సెప్టెంబర్ 2025లో పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, సెప్టెంబర్ 2025లో మరణించిన ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ అంతిమయాత్రకు సంబంధించినవి అని పేర్కొన్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). నాగాలాండ్ పర్యాటక, ఉన్నత విద్యాశాఖ మంత్రి కూడా జుబీన్ గార్గ్ కు నివాళులర్పిస్తూ ఇదే వీడియోను షేర్ చేశారు. జుబీన్ గార్గ్ 19 సెప్టెంబర్ 2025న సింగపూర్‌లో మరణించారు.

అలాగే మొదటి వీడియోలో మనం ఇద్దరు వ్యక్తులు ‘ఓట్ చోరీ’ గురించి మాట్లాడాం మనం చూడవచ్చు. ఈ దృశ్యాలు కూడా 2025న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించక ముందు నుండే (కనీసం 09 నవంబర్ 2025 నుంచే) ఇంటర్నెట్‌లో ఉన్నాయి.

రెండో వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో కూడా 14 నవంబర్ 2025న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించక ముందు నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉందని తెలిసింది.

ఈ వీడియో RJD అభ్యర్థి కేసరి లాల్ యాదవ్ 09 నవంబర్ 2025న బీహార్‌లోని నహాస్ రూపౌలిలోని ఖంగ్రైత హై స్కూల్ సమీపంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు సంబంధించింది అంటూ పలువురు సోషల్ మీడియాలో పేర్కొన్నారు (ఇక్కడ, ఇక్కడ) పేర్కొన్నారు. అలాగే ఈ ఈ వీడియోలో RJD పార్టీ జెండాలను మనం చూడవచ్చు. అయితే, మేము ఈ వీడియో కేసరి లాల్ యాదవ్ ఎన్నికల సభకు సంబంధించినదా, లేదా అని మేము స్వతంత్రంగా ధృవీకరించలేము.
చివరగా, 14 నవంబర్ 2025న ECI ప్రకటించిన 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా బీహార్ ప్రజలు భారీ నిరసనలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ సంబంధం లేని వీడియోలను షేర్ చేస్తున్నారు.


