Fake News, Telugu
 

వర్గీకరణకు వ్యతిరేకంగా ఉత్తర భారత దేశంలో నిరసనలు జరుగుతున్నాయి అంటూ పాత ఫోటోలు షేర్ చేస్తున్నారు

0

ఇటీవల 01 ఆగస్ట్ 2024న SC/ST రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వర్గీకరణకు వ్యతిరేకంగా ఉత్తర భారత దేశంలో నిరసనలు జరుగుతున్నాయి అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా ఆ ఫోటోలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: SC/ST రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా ఉత్తర భారత దేశంలో జరుగుతున్న నిరసనలకు సంబంధించిన ఫోటోలు.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటోలు 2018 నుండే అందుబాటులో ఉన్నాయి. SC/ST అట్రాసిటీ చట్టం దుర్వినియోగాయానికి సంబంధించి 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు సంబంధించినవి అంటూ అప్పట్లో వీటిని షేర్ చేసారు. ప్రస్తుతం వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా ఉత్తర భారత దేశంలో నిరసనలు జరుగుతున్నప్పటికీ, ఈ ఫోటోలు ఆ నిరసనలకు సంబంధించినవి కావు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని చెప్తూ  SC/ST రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును వెలువరించింది. ఐతే ఈ తీర్పును పలు వర్గాలు/రాజకీయ పార్టీలు స్వాగతించగా, పలు వర్గాలు పలు వర్గాలు/రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఉత్తర భారత దేశంలో వర్గీకరణను వ్యతిరేకిస్తున్న కొన్ని సంఘాలు నిరసనలు కూడా చేస్తున్నాయి. ఈ నిరసనలకు సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ప్రస్తుతం షేర్ చేస్తున్న ఫోటోలకు వర్గీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు ఎటువంటి సంబంధం లేదు, ఇవి పాత ఫోటోలు.

ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ ఫోటో కొలాజ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే కొలాజ్ 2018లో షేర్ చేసిన సోషల్ మీడియా పోస్టులు/ బ్లాగ్స్ మాకు కనిపించాయి (ఇక్కడ & ఇక్కడ). ఏప్రిల్ 2018లో SC/ST అట్రాసిటీ చట్టం దుర్వినియోగం కావడం పట్ల సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసి, ఈ కేసుల్లో తక్షణ అరెస్టు కూడదని స్పష్టం చేసిన సందర్భంలో జరిగిన నిరసనలకు సంబంధించిన ఫోటోలు అంటూ వీటిని షేర్ చేసారు.

మార్చ్ 2018లో సుప్రీంకోర్టు అభిప్రాయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగినట్టు వార్తా కథనాలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని బట్టి ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటోలు ఏ సందర్భానికి సంబంధించినవో కచ్చితంగా తెలియనప్పటికీ, ఈ ఫోటోలు మాత్రం ఇప్పుడు జరుగుతున్న వర్గీకరణ వ్యతిరేక నిరసనలకు సంబంధించినవి కావని స్పష్టమవుతుంది.

చివరగా, వర్గీకరణకు వ్యతిరేకంగా ఉత్తర భారత దేశంలో నిరసనలు జరుగుతున్నాయి అంటూ పాత ఫోటోలు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll