విజయవాడలో ఎండతీవ్రతకు ట్రాఫిక్ లైట్లు కరిగిపోయిన దృశ్యమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: విజయవాడలో ఎండతీవ్రతకు ఇటీవల ట్రాఫిక్ లైట్లు కరిగిపోయిన దృశ్యం.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో ఇటలీ దేశం మిలాన్ నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్ లైట్‌ను చూపిస్తుంది. 2022 జులై నెలలో మిలాన్ నగరంలోని వియా బెర్గామో మరియు వియాలే రేజీనా మార్గేరీటా వీధులను కలిపే జంక్షన్ దగ్గర ఒక స్కూటర్ అగ్ని ప్రమాదానికి గురవడంతో పక్కనే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ లైట్ మంటలకు కరిగిపోయింది. పోస్టులో షేర్ చేసిన ఫోటోకి విజయవాడ నగరంతో ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఈ ఫోటో 2022 ఆగస్టు నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నట్టు తెలిసింది. కరిగిపోయిన ట్రాఫిక్ సిగ్నల్ లైట్ చిత్రాన్ని చూపిస్తున్న ఈ ఫోటోని కొందరు టర్కి దేశానికి సంబంధించిందని, మరికొందరు గ్రీస్ దేశంలోని యుననిస్తాన్ నగరంలో తీశారని 2022లో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ 2022లో పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌ను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
అయితే, పోస్టులో షేర్ చేసిన అదే ట్రాఫిక్ సిగ్నల్ లైట్‌తో పోలి ఉన్న చిత్రాన్ని ఒక ఫేస్‌బుక్ యూసర్ 2022 జులై నెలలో షేర్ చేస్తూ, ఇటలీ దేశం మిలాన్ నగరంలో ఎండల దాటికి ట్రాఫిక్ సిగ్నల్ లైట్ కరిగిపోయిన దృశ్యామని తెలిపారు. అయితే, ఈ పోస్టుకి సంబంధించి ఇటలీ ఫాక్ట్-చెకింగ్ సంస్థ ‘Open’ ఆర్టికల్ పబ్లిష్ చేస్తూ, ఈ ఫోటోలో కనిపిస్తున్న ట్రాఫిక్ లైట్ మిలాన్ నగరంలోని వియా బెర్గామో మరియు వియాలే రేజీనా మార్గేరీటా వీధులను కలిపే జంక్షన్ దగ్గర ఉందని తెలిపారు. 2022 జులై నెలలో ఈ జంక్షన్ దగ్గర ఒక స్కూటర్ అగ్ని ప్రమాదానికి గురికావడంతో పక్కనే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ లైట్ మంటలను తాకి కరిగిపోయిందని నగర ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తమకు స్పష్టం చేశారని ఈ ఆర్టికల్‌లో తెలిపారు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోలోని దృశ్యాలని, గూగుల్ మ్యాప్స్‌లో వియా బెర్గామో మరియు వియాలే రేజీనా మార్గేరీటా విధులలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ లైట్ దృశ్యాలతో పోలి చూడగా, పోస్టులో షేర్ చేసిన ఫోటో మిలాన్ నగరానికి సంబంధించినదే అని స్పష్టమయ్యింది. విజయవాడలో ఇటీవల ఎండల తీవ్రతకు ట్రాఫిక్ లైట్లు కరిగిపోయినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ ఇటీవల రిపోర్ట్ చేయలేదు.
చివరగా, ఇటలీ దేశం మిలాన్ నగరానికి సంబంధించిన పాత ఫోటోని ఇటీవల విజయవాడలో ఎండాల దాటికి ట్రాఫిక్ సిగ్నల్ లైట్ కరిగిపోయిన దృశ్యమంటూ షేర్ చేస్తున్నారు.