“తిరుపతి నుంచి వేంకటేశ్వర స్వామి స్వయంగా గొడ్డు మాంసంతో చేసిన లడ్డు తన భక్తులకు పంపాడు అని వీడియో చేసినందుకు స్థానిక హిందూ యువకులు అతనిపై దాడి చేసారు” అంటూ కొంతమంది పియూష్ మనుష్/పియూష్ సేథియాను కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవమేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: తిరుపతి నుంచి వేంకటేశ్వర స్వామి స్వయంగా గొడ్డు మాంసంతో చేసిన లడ్డు తన భక్తులకు పంపాడు అని వీడియో చేసినందుకు స్థానిక హిందూ యువకులు పియూష్ మనుష్ అనే వ్యక్తిపై తమిళనాడులో దాడి చేసారు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో ఆగస్ట్ 2019లో తమిళనాడులోని సేలంలోని బీజేపీ కార్యాలయంలో తీవ్ర వాగ్వాదం జరగడంతో బీజేపీ కార్యకర్తలు పియూష్ మానుష్‌పై దాడి చేసిన సందర్భంలోది. సంబంధం లేని పాత వీడియోను తిరుమల లడ్డు వివాదం సందర్బంగా షేర్ చేస్తున్నారు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో ఆగస్టు 2019 నాటిది. తమిళనాడులోని సేలంలోని బీజేపీ కార్యాలయంలో తీవ్ర వాగ్వాదం జరగడంతో పియూష్ మానుష్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన సందర్భంలోది ఈ వీడియో. 19 సెప్టెంబర్ 2024న తిరుపతి లడ్డూల వివాదంపై మనుష్ ఒక వీడియోను పోస్ట్ చేస్తూ, “పెరుమాళ్ స్వయంగా హిందువులందరికీ బీఫ్ లడ్డూ పంపిణీ చేసారు” అంటూ పోస్టు చేసిన నేపథ్యంలో ఈ వీడియో షేర్ చేస్తున్నారు.
వైరల్ క్లిప్‌లో “NewsGlitz Tamil” ఛానెల్ యొక్క వాటర్‌మార్క్ మరియు లోగోలను ఆధారంగా తీసుకొని తగిన కీ వర్డ్స ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, 28 ఆగస్టు 2019న NewsGlitz Tamil YouTube ఛానెల్‌లో పూర్తి వీడియోను “Salem Piyush Manush Assaulted At BJP Office” అనే శీర్షికతో అప్లోడ్ చేసినట్టు మేము గమనించాం.
దీని గురించి మరింత వెతికితే, వివిధ మీడియా రిపోర్ట్స్ (ఇక్కడ మరియు ఇక్కడ)ద్వారా బీజేపీ కార్యకర్త నుండి బెదిరింపులు మరియు జమ్మూ మరియు కాశ్మీర్‌లో ఆర్టికల్ 370పై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సహా పలు సమస్యలపై రెండు పార్టీలు వాదించుకుంటున్న సమయంలో సేలంలోని తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో మనుష్‌పై బీజేపీ సభ్యులు దాడి చేశారు. దీంతో తనను కొట్టినందుకు బీజేపీ కార్యకర్తలపై పియూష్ సేలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు అని తెలుసుకున్నాం.
పైగా, తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ 2019లో రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పియూష్ పై జరిగిన దాడిని తన అధికారిక X పేజీలో బహిరంగంగా ఖండించారు.
ఈ వీడియో 2019 నాటిది అని మనుష్ వైరల్ వీడియోలో పోస్ట్ చేస్తూ, “సోంకీ మోంకీలు 2019 నుండి ఒక వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారు. నేను కాశ్మీర్ గురించి ప్రశ్నించడానికి బీజేపీ కార్యాలయానికి వెళ్లాను. ఫలితంగా 30 మంది బీజేపీ కార్యకర్తలు నాపై దాడి చేశారు. ఏమైనప్పటికీ, సోంకీ మోంకీ వారు ఐదు సంవత్సరాల క్రితం ఒక స్క్రాచ్ వేసినందుకు సంతోషిస్తున్నారు (అనువదించబడింది)” అని తెలిపారు.
చివరిగా, తమిళనాడు పర్యావరణ కార్యకర్త పియూష్ మనుష్‌పై దాడికి సంబంధించిన పాత 2019 వీడియోను ఇప్పుడు షేర్ చేస్తున్నారు.