రిషి సునాక్ ఇటీవల బ్రిటన్ దేశానికి కొత్త ప్రధానిగా నియమితులయిన నేపథ్యంలో, ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా షేర్ అవుతున్నాయి. ఆ పోస్టులలో చేస్తున్న క్లెయింలలో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.
క్లెయిమ్: బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వెంటనే రిషి సునాక్ ఇస్కాన్ శ్రీ కృష్ణ మందిరాన్ని సందర్శించిన దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, 2022 ఆగస్టు నెలలో జన్మాష్టమి పండగ సందర్భంగా రిషి సునాక్ తన భార్య అక్షతతో కలిసి భక్తివేదాంత మనోర్ (బ్రిటన్లోని ఒక హరే కృష్ణ మందిరం) దేవాలయాన్ని సందర్శించిన దృశ్యాలని చూపిస్తుంది. ఈ వీడియో రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవకముందు తీసినది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే, ఇదే విడియోని ఇటీవల కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “రిషి సునాక్ తన భార్య అక్షతతో కలిసి భక్తివేదాంత మనోర్ మందిరాన్ని సందర్శించారు”, అని వివరణలో తెలిపినట్టు తెలిసింది. ఈ వివరాల ఆధారంగా వీడియోకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం వెతికితే, 2022 ఆగస్టు నెలలో, జన్మాష్టమి పండగ సందర్భంగా తాను భక్తివేదాంత మనోర్ మందిరాన్ని సందర్శించిన విషయాన్ని రిషి సునాక్ ఒక ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా పంచుకున్నట్టు తెలిసింది. భక్తివేదాంత మనోర్ అనేది బ్రిటన్లోని ఒక హరే కృష్ణ మందిరం. రిషి సునాక్ భక్తివేదాంత మనోర్ మందిరాన్ని సందర్శించినప్పుడు తీసిన ఫోటోలని భక్తివేదాంత మనోర్ ఫేస్‌బుక్ పేజీ కూడా షేర్ చేసింది. పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు, ఈ ఫోటోలలో అవే వస్త్రాలతో కనిపిస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు.
కొందరు యూసర్లు ఇదే వీడియోని, “రిషి సునాక్ 10 డౌనింగ్ స్ట్రీట్ లో గృహ ప్రవేశం వేడుక దృశ్యాలు”, అని కూడా తప్పుగా షేర్ చేస్తున్నారు. పోస్టులో షేర్ చేసిన వీడియో, రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవకముందు తీసినదని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.
క్లెయిమ్: రిషి సునాక్ వేద మంత్రాలతో బ్రిటన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోని కూడా 2022 ఆగస్టు నెలలో, రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా నియమితులు కాకముందు తీసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియోని జాగ్రత్తగా గమనిస్తే, బ్యాక్ గ్రౌండ్లో, ‘The Conservative Friends of India’ అని రాసి ఉన్న బ్యానర్ కనిపిస్తుండటాన్ని మనం చూడవచ్చు. ఈ వీడియోకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, 2022 ఆగస్టు నెలలో రిషి సునాక్‌కు సంబంధించి ‘The Conservative Friends of India’ ఫేస్‌బుక్ పేజీ పెట్టిన పోస్ట్ దొరికింది. పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు, ‘The Conservative Friends of India’ ఫేస్‌బుక్ పోస్టులో షేర్ చేసిన ఫోటోలలో అవే వస్త్రాలతో కనిపిస్తున్న దృశ్యాలని మనం చూడవచ్చు. అంతేకాదు, రిషి సునాక్ అధికారిక ప్రచార ట్విట్టర్ హ్యాండిల్ ‘Ready4Rishi’ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను 2022 ఆగస్టు నెలలో ట్వీట్ చేసింది. పోస్టులో షేర్ చేసిన వీడియో ఇటీవల రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయిన తరువాత తీసినది కాదని పై వివరాల ఆధారంగా చెప్పవచ్చు.
క్లెయిమ్: బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ ఇటీవల 11 డౌనింగ్ స్ట్రీట్లోని తన ఇంటిముందు దీపాలను వెలిగిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): 2020లో బ్రిటన్ ఛాన్స్‌లర్ ఆఫ్ ఎక్స్‌చెకర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించిన రిషి సునాక్, దీపావళి పండగ సందర్భంగా అప్పుడు తన ఇంటిముందు దీపాలను వెలిగించిన దృశ్యాన్ని పోస్టులో షేర్ చేసిన ఫోటో చూపిస్తుంది. 11 డౌనింగ్ స్ట్రీట్ బ్రిటన్ ఛాన్స్‌లర్ ఆఫ్ ఎక్స్‌చెకర్ యొక్క అధికారిక నివాసం. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
‘ఇండియా TV’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ‘Reuters’ వార్తా సంస్థ 2020 నవంబర్ నెలలో తమ వెబ్సైట్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. దీపావళి పండగ సందర్భంగా బ్రిటన్ ఛాన్స్‌లర్ ఆఫ్ ఎక్స్‌చెకర్ రిషి సునాక్, డౌనింగ్ స్ట్రీట్లోని తన నివాసం ఎదుట దీపాలు వెలిగిస్తున్న చిత్రాలంటూ ‘Reuters’ రిపోర్ట్ చేసింది. ఇవే దృశ్యాలని రిషి సునాక్ 2020లో పెట్టిన ఒక ట్వీట్లో కూడా చూడవచ్చు. 11 డౌనింగ్ స్ట్రీట్ బ్రిటన్ ఛాన్స్‌లర్ ఆఫ్ ఎక్స్‌చెకర్ యొక్క అధికారిక నివాసం. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, సంబంధం లేని పాత ఫోటోలు మరియు వీడియోలను రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయిన తరువాత దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.