Fact Check, Fake News, Telugu
 

పంచాయతీల్లో అందుబాటులో ఉండే అధికారుల సంఖ్య రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు బదలాయించిన అధికారాలపై ఆధారపడి ఉంటుంది

0

సగటున ఒక గ్రామంలో ఎంత మంది ప్రభుత్వ అధికారులు పని చేస్తారో, ఏయే డిపార్టుమెంట్‌లు పని చేస్తాయో, ఇవి పారదర్శకంగా పని చేయడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఒక గ్రామంలో వివిధ శాఖలకు చెందిన సుమారు 50 మంది పనిచేస్తారని, వీళ్ళంతా ప్రతి రోజు గ్రామ సచివాలయంలో సంతకాలు పెట్టి, వారి విధుల్లోకి పోవాలని, ఇవి పారదర్శకంగా పని చేసేలా ఉండడానికి సిటిజన్ చార్టర్లు ఉండాలంటూ ఈ సమాచారం ద్వారా చెప్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సగటున ఒక గ్రామంలో వివిధ శాఖలకు చెందిన సుమారు 50 ప్రభుత్వ అధికారులు పని చేస్తారు, వీళ్ళంతా ప్రతి రోజు గ్రామ సచివాలయంలో సంతకాలు పెట్టి, వారి విధుల్లోకి పోవాలి, వీరు పారదర్శకంగా పని చేయడానికి సిటిజన్ చార్టర్లు ఉండాలి.

ఫాక్ట్(నిజం): పంచాయతీల జనాభా ఆధారంగా వార్డుల విభజన జరుగుతుంది గానీ అన్ని గ్రామాల్లో ఒకే సంఖ్యలో వార్డు సభ్యులు ఉండరు. అలాగే గ్రామాల్లో ఉండే అధికారులు అందుబాటులో ఉండాలనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల  నిర్ణయం. పాలనా వికేంద్రీకరణలో భాగంగా పంచాయాతీలకు బదలాయించిన అధికారాలపై ఈ సంఖ్య ఆధారపడి ఉంటుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పంచాయతీల్లో ఉండే ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ప్రస్తుతం షేర్ చేస్తున్న సమాచారం మంచి ఉద్దేశంతోనే షేర్ చేసిందే అయినా ఈ సమాచారంలో చెప్తున్నట్టు అన్ని గ్రామాల్లో కచ్చితంగా వైరల్ పోస్టులో ప్రస్తావించిన వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉండాలని రూల్ లేదు. గ్రామాల్లో ఉండే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు కింద చూద్దాం.

ముందుగా ఒక గ్రామంలోని జనాభా ప్రాతిపదికన ఆ గ్రామంలో వార్డుల విభజన జరుగుతుంది. ప్రతీ వార్డులో ఇంచుమించు సమాన సంఖ్యలో ఓటర్లు ఉండేలా వార్డులను విభజిస్తారు. ఐతే ఒక్కో గ్రామంలో ఒక జనాభా ఉంటుంది కాబట్టి అన్ని గ్రామాల్లో ఒకే సంఖ్యలో వార్డు సభ్యులు ఉండరు. ప్రతీ గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్ కచ్చితంగా ఉన్నప్పటికీ, వార్డు సభ్యుల సంఖ్యలో మాత్రం వ్యత్యాసం ఉంటుంది.

పంచాయతీల్లో ప్రభుత్వ అధికారులు:

అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గ్రామాల్లో ఎంతమంది అధికారులు అందుబాటులో ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయం. సాధారణంగా ప్రభుత్వం పంచాయతీలకు బదలాయించే అధికారాలపై ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఆధారపడి ఉంటుంది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా పంచాయాతీల పరిధి, అధికారాలు పెంచినప్పుడు గ్రామాల్లో వివిధ ప్రభుత్వ శాఖలు పని చేస్తాయి, అప్పుడు గ్రామ స్థాయిలో పని చేసే అధికారులు సంఖ్య పెరుగుతుంది. కాబట్టి గ్రామ స్థాయిలో ఎంత మంది అధికారులు ఉంటారనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.

ఉదాహారణకు తెలంగాణ ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన పంచాయత్ రాజ్ చట్టం ప్రకారం ఒక గ్రామ స్థాయిలో వివిధ డిపార్ట్‌మెంట్‌లకు చెందిన 17 మంది కార్యనిర్వాహకులు ఉండాలని పేర్కొంది. ఈ 17లో VRO, VRA కూడా ఉన్నారు. కాని ఆ తర్వాతి కాలంలో ఈ వ్యవస్థలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది.

అదే విధంగా గతంలో చేసిన పలు అధ్యయనాల ప్రకారం కేరళ రాష్ట్రంలో సగటున ప్రతీ గ్రామ పంచాయతీల్లో 15 నుండి 22 మంది అధికారులు పని చేస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). దీన్నిబట్టి పంచాయతీల్లో ఉండే సిబ్బంది అనేది ఆయా ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అని స్పష్టమవుతుంది.

కాగా వైరల్ పోస్టులో చెప్తున్నట్టు ఈ అధికారులందరు ప్రతీ రోజు గ్రామ సచివాలయంలో సంతకాలు చేయాలన్న నిబంధన ఏదీ లేదు. అధికారులు వారి వారి శాఖలకు రిపోర్ట్ చేస్తారు తప్ప, గ్రామ సచివాలయంలో కాదు. పైన పేర్కొన్న తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టంలో ఐతే ఇలాంటి నిబందనేది లేదు. కాకపోతే తెలంగాణ చట్టం ప్రకారం ఈ అధికారులు అందరు గ్రామ సభలో పాల్గొనాలి.

సిటిజన్ చార్టర్‌:

ఇకపోతే ప్రభుత్వ వ్యవస్థల మరియు ప్రజల మధ్య సమన్వయం ఏర్పాటు చేసి, పారదర్శకత పెంచడానికి భారత ప్రభుత్వం 1997లోనే సిటిజన్ చార్టర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఆ తర్వాతి క్రమంలో పరిపాలనా సంస్కరణలలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో దీనిని అమలు చేసారు. వివిధ హోదాలో ఉన్న ఉద్యోగుల వివరాలు, కార్యాలయంలో జరిగే పనులు, సంబంధిచిన అధికారుల వివరాలు, టైం టేబుల్, మొదలైన వివరాలతో ఒక సిటిజన్ చార్టర్‌ను ప్రతీ కార్యాలయంలో ఏర్పాటు చేసారు. ఈ సిటిజెన్ చార్టర్‌లకు చట్టబద్ధత లేనప్పటికీ, ఇవి అన్నీ ప్రభుత్వ కార్యాలయాలలో ఉంటాయి. ఇవి రెగ్యులర్‌గా అధికారులు లేదా టైంటేబుల్ మారినప్పుడు అప్డేట్ చేస్తారో లేదో అన్న విషయంపై సరైన సమాచారం అందుబాటులో లేదు. కానీ సిటిజన్ చార్టర్‌ అనేవి అన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటాయి.

చివరగా, పంచాయతీల్లో అందుబాటులో ఉండే అధికారుల సంఖ్య రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు బదలాయించిన అధికారాలపై ఆధారపడి ఉంటుంది

Share.

About Author

Comments are closed.

scroll