Update (15 May 2024):
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి జాతీయ మీడియా సంస్థల పేరుతో ఎగ్జిట్ పోల్స్ కూడా షేర్ అవుతున్నాయి. ఈ ప్రధాన సంస్థలు కూడా ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని అంచనా వేసాయని అంటూ వీటిని చేస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో వైసీపీ గెలువబోతుందని, చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతున్నారని ETV ఒక వార్త ప్రచురించినట్టు ఒక వీడియో కూడా షేర్ అవుతుంది.
ఐతే ఇంతకుముందు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏ సంస్థ కూడా ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయలేదు. ప్రస్తుతం ఇంకా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై ఇంకా నిషేధం కొనసాగుతూనే ఉంది. చివరి దశ ఎన్నికలు ముగిసేవరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్‌కు అనుమతి లేదు. కావున ప్రస్తుతం షేర్ అవుతున్నది ఫేక్ ఎగ్జిట్ పోల్స్ అని అర్ధం చేసుకోవచ్చు. అలాగే ETV పేరుతో షేర్ అవుతుంది కూడా ఒక ఫేక్ వీడియో. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలువబోతుందని ETV ఎలాంటి వార్తను రిపోర్ట్ చేయలేదు.
Published (14 May 2024):
13 మే 2024న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని 175 స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలోనే NTV టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ముందజలో ఉన్నట్లు, TV5 News వైసీపీ ముందజలో ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేశాయి అని చెప్తూ పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి NTV, TV5 14 మే 2024 నాటికి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి.
ఫాక్ట్(నిజం): భారత ఎన్నికల సంఘం (ECI) 19 ఏప్రిల్ 2024 నుండి ఉదయం 7 గంటల నుండి 01 జూన్ 2024 సాయంత్రం 6:30 గంటల వరకు ఎలాంటి ఎన్నికల సర్వే ఫలితాలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రసారం చేయడాన్ని నిషేధించింది. అంతేకాకుండా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 14 మే 2024 నాటికి NTV, TV5 ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఎగ్జిట్ పోల్స్ ప్రచురణకు సంబంధించిన నియమాలు THE REPRESENTATION OF THE PEOPLE ACT, 1951 యొక్క సెక్షన్ 126A లో పొందుపరిచారు. దీనిలో ఉన్న నిబంధనల ప్రకారంగా, ఎన్నికల సంఘం వారు నోటిఫై చేసిన సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం కానీ వాటి ఫలితాలని బహిర్గతం చేయడం కానీ నిషిద్ధం అని తెలుస్తుంది.
పైన పేర్కొన్న చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా, ECI అన్ని రాష్ట్రాల్లో చివరి దశకు ఎన్నికలు ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రచురించడాన్ని నిషేధించింది. 16 మార్చి 2024న ECI విడుదల చేసిన 2024 లోక్ సభ మరియు ఆంధ్రప్రదేశ్ సహా మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం, “ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126A, నిర్ధిష్ట కాలంలో ఎగ్జిట్ పోల్ నిర్వహించడాన్ని మరియు దాని ఫలితాలను ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసారం చేయడాన్ని నిషేధిస్తుంది, అనగా. , మొదటి దశలో పోలింగ్ ప్రారంభానికి నిర్ణయించిన గంట నుండి అన్ని రాష్ట్రాల్లో చివరి దశ ఎన్నికల ముగింపు సమయం తర్వాత అరగంట వరకు. RP చట్టం, 1951లోని సెక్షన్ 126A యొక్క ఏదైనా ఉల్లంఘన రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించబడుతుంది.”
ECI (ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా) నిబంధనల ప్రకారం దేశంలోని అన్ని లోక్ సభ స్థానాలకు పోలింగ్ ముగేసేవరకి ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి వీలులేదు, అనగా 01 జూన్ 2024 సాయత్రం 06.30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి వీలులేదు. వార్తా పత్రికలు కూడా భారతదేశ ఎన్నికల సంఘం (ECI ) 19 ఏప్రిల్ 2024 ఉదయం 7 గంటల నుండి 01 జూన్ 2024 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధించడాన్ని గురుంచి రిపోర్ట్ చేసాయి (ఇక్కడ & ఇక్కడ).
అంతేకాకుండా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 14 మే 2024 నాటికి ఈ వైరల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు NTV, TV5 సంస్థలు విడుదల చేశాయా? అని NTV, TV5 సంస్థలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ లో వెతకగా, NTV( వెబ్సైటు, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇంస్టాగ్రామ్) , TV5 (వెబ్సైటు, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇంస్టాగ్రామ్) సంస్థలు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినట్లు మాకు కనిపించలేదు.
చివరగా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 14 మే 2024 నాటికి NTV, TV5 ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు, ఈ వైరల్ స్క్రీన్ షాట్స్ ఫేక్.