ఆఫ్రికా ఖండంలోని ఎరిట్రియా దేశంలో పురుషులు రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైలు శిక్ష తప్పదని ఆ దేశంలో ఒక చట్టం ఉన్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేస్తున్నారు. అనేక ప్రముఖ మీడియా ఛానళ్ల వారు కూడా ఈ వార్తపై సామాజిక మాధ్యమాల్లో వీడియో కథనాలు ప్రసారించారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొందాం.
క్లెయిమ్: ఎరిట్రియాలో బహుభార్యాత్వం చట్టబద్ధం, రెండు పెళ్లిళ్లు చేసుకోని మగవారికి జైలు శిక్ష తప్పదు.
నిజం (ఫాక్ట్): ఇది 2016లో ఒక గాసిప్ వెబ్‌సైట్ ద్వారా మొదలైన కల్పిత కథ. అప్పుడు, ఎరిట్రియా ప్రభుత్వం ఈ విషయంపై స్పందిస్తూ, ఈ కథ కల్పితమని చెప్పింది. ఎరిట్రియా దేశ పీనల్ కోడ్ ప్రకారం అక్కడ బహుభార్యత్వం చట్టవిరుద్ధం. అందువల్ల పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
పోస్టులోని విషయాన్ని గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, అదే విషయంపై ప్రముఖ తెలుగు మీడియా ఛానెల్స్ ఎరిట్రియా దేశంలో పురుషులు రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైలు శిక్ష తప్పదని ఆ దేశంలో చట్టం ఉన్నట్లు ప్రచురించిన కథనాలు లభించాయి [ఏబిఎన్ డిజిటల్ ఎక్సక్లూసివ్ , 10టీవీ డిజిటల్ (10టీవీ ఫేస్బుక్ పోస్ట్ ), టీవీ 9 డిజిటల్.]
ఇవే కాకుండా, ఆంధ్రజ్యోతి మరియు న్యూస్ 18 తెలుగు వెబ్సైటులలో ప్రచురించిన కథనాలు కూడా లభించాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.
ఈ వార్తలో నిజానిజాలను తెలుసుకోవడం కోసం ఇంటర్నెట్‌లో వెతికితే, 2016లో ప్రచురించిన కొన్ని మీడియా కథనాలకు లభించాయి. BBC యొక్క రిపోర్ట్ ప్రకారం, ఈ కథ మొదట క్రేజీ మండే అనే కెన్యా దేశానికి చెందిన ఒక వ్యంగ్యపు ఆర్టికల్స్ రాసే కాలమ్ ద్వారా ప్రచురించబడింది. ఈ కథ అప్పట్లో చాలా రోజులు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ కథనంపై కొన్ని ఇతర మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు.
ఎరిట్రియన్ ప్రభుత్వం యొక్క ప్రతిస్పందన
దీనిపై 2016లో ఎరిట్రియా సమాచార మంత్రి యెమనే జి. మెస్కెల్ తన స్పందన ట్వీట్ ద్వారా తెలియచేస్తూ, ‘తప్పనిసరిగా ఇద్దరు లేదా ఎక్కువ మహిళలను పెళ్లి చేసుకోవాలన్న ఒక ముఫ్తీ ఊహాజనిత ఆదేశం గురించిన అసంబద్ధమైన, కల్పిత కథ గురుంచి మీడియా ఇలా నిజమైనదిగా ప్రచారం చేయడం చాలా తప్పు’ (‘Media frenzy to parrot this ludicrous, fabricated & trite story of the Mufti’s presumed religious decree on mandatory polygamy is appalling..’) అని అన్నారు. అస్మారాలో [ఎరిట్రియన్ రాజధాని] ఒక పిచ్చివాడు కూడా ఈ కథని నమ్మడు అని మరొక ఎరిట్రియా అధికారి BBCకి చెప్పారు.
ఎరిట్రియా పీనల్ కోడ్ ప్రకారం బహుభార్యత్వం చట్టవిరుద్ధం. ఈ ఆధారాలను బట్టి ఇది ఈ ఏడాది మళ్ళీ తెరపైకి వచ్చిన ఒక పాత కల్పిత కథనం అని, మరియు ఎరిట్రియాలో బహుభార్యాత్వం చట్టబద్ధం అని పోస్ట్‌లో చెప్తున్న విషయం తప్పు అని నిర్ధారించవచ్చు.
చివరిగా, ఎరిట్రియాలో బహుభార్యత్వం చట్టబద్ధం కాలేదు; ఇది ఒక కల్పిత కథ.