Fake News, Telugu
 

భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు

0

‘మాకు అవార్డులు, రివార్డులు అక్కర్లేదు దేశానికి అన్నంపెట్టే రైతుల గోడు వినండి. రైతు గొంతుకొసే రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దుచేయండి.’ అని భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ అన్నారని ఒక పోస్ట్ షేర్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డును కూడా తను తిరస్కరించారని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: వ్యవసాయ చట్టాలను రద్దుచేయమని కోరుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డును తిరస్కరించిన హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్.

ఫాక్ట్: మన్‌ప్రీత్ సింగ్ వ్యవసాయ చట్టాల గురించి అలా అన్నట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒలింపిక్స్‌లో హాకీ జట్టు ప్రదర్శనపై కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి అవార్డును మన్‌ప్రీత్ సింగ్ నిరాకరించినట్లు మీడియా రిపోర్ట్స్ లేవు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు భారత హాకీ జట్టుకు ఎటువంటి అవార్డు కూడా ప్రకటించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి, మన్‌ప్రీత్ సింగ్‌తో సహా భారత పురుషుల హాకీ జట్టులో భాగమైన 8 మంది ఆటగాళ్లకు పంజాబ్ ప్రభుత్వం ₹1 కోటి రివార్డును ప్రకటించింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ వ్యవసాయ చట్టాలను గురించి అలా అన్నట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, వార్తాపత్రికలు దీని గురించి ప్రచురించేవి.

ఒలింపిక్స్‌లో హాకీ జట్టు ప్రదర్శనపై ప్రధాని నరేంద్ర మోదీ నుండి ఎటువంటి అవార్డును మన్‌ప్రీత్ సింగ్ నిరాకరించినట్లు మీడియా రిపోర్ట్స్ లేవు. ఈ విషయంపై ఇంటర్నెట్‌లో వెతకగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు భారత హాకీ జట్టుకు ఎటువంటి అవార్డులను ప్రకటించలేదని తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే తమ రాష్ట్రాలకు సంబంధించిన వారికి (టోక్యో ఒలింపిక్స్ హాకీలో మెడల్ పొందిన వారికి) నగదు రివార్డులను అందజేస్తాయని ప్రకటించాయి. అదేవిధంగా మన్‌ప్రీత్ సింగ్‌తో సహా భారత పురుషుల హాకీ జట్టులో భాగమైన 8 మంది ఆటగాళ్లకు పంజాబ్ ప్రభుత్వం ₹1 కోటి చొప్పున రివార్డును ప్రకటించింది. దీనికి సంబంధించి ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

టోక్యో ఒలింపిక్స్‌లో తన నాయకత్వానికి ప్రధాని మోదీ అభినందనలు తెలియజేయడంపై మన్‌ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు, “మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు, నాకు మరియు జట్టుకు ఎన్నడూ లేని మద్దతు ఇచ్చినందుకు – ఇది చివరిది కాదు, దేశానికి మరింత కీర్తిని తీసుకురావడానికి మరింత కష్టపడతాము! జై హింద్!” ఇక్కడ కూడా వ్యవసాయ చట్టాలను గురించి గాని, రివార్డులను నిరాకరించటం గురించి గాని తాను ఏమి చెప్పలేదు.

మన్‌ప్రీత్ సింగ్ వ్యవసాయ నేపధ్యం నుండి వచ్చిన వ్యక్తి. పంజాబ్‌లోని జలంధర్‌లో ఒక రైతుకు పుట్టిన బిడ్డ. తన సోదరులు అనేక హాకీ టోర్నమెంట్ల నుండి ఇంటికి బహుమతులను తీసుకురావడం చూసి మన్‌ప్రీత్ సింగ్ ఈ క్రీడను చేపట్టాడు. తన మొదటి హీరో ఒకప్పటి భారత ఒలింపిక్స్ హాకీ జట్టు కెప్టెన్ పర్గత్ సింగ్ అని మన్‌ప్రీత్ అన్నాడు.

చివరగా, హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ వ్యవసాయ చట్టాలను రద్దుచేయమని కోరినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll