Fake News, Telugu
 

‘2014 ఎన్నికల్లో గెలవడానికి మేము తప్పుడు వాగ్దానాలు చేశాం’ అని నితిన్ గడ్కరీ అనలేదు

0

ఒక టీవీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ “2014లో బీజేపీ అధికారంలోకి రాదు అనుకొని పెద్ద పెద్ద తప్పుడు హామీలిచ్చాం” అని అన్నారు అని చెప్తూ ఉన్న పలు పోస్టులు (ఇక్కడ, & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే విషయాన్ని చెప్తూ 2018లో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ టీవీ కార్యక్రమం వీడియో క్లిప్‌ని తమ అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది (ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఒక టీవీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ “2014లో బీజేపీ అధికారంలోకి రాదు అనుకొని పెద్ద పెద్ద తప్పుడు హామీలిచ్చాం” అని అన్నారు.

ఫాక్ట్(నిజం): 2018లో ఇదే విషయాన్ని చెప్తూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తమ అధికారిక ట్విట్టర్ నందు ఈ టీవీ కార్యక్రమం వీడియో క్లిప్‌ని షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. అంతేకాకుండా పలు జాతీయ మీడియా సంస్థలు కూడా నితిన్ గడ్కరీ మోదీ ప్రభుత్వాన్ని ఉదేశిస్తూ వ్యాఖ్యలు చేసినట్లు 2018లో రిపోర్ట్ చేసాయి. అయితే,10 అక్టోబరు 2018లో జరిగిన విలేకరుల సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ ఈ వార్తా కథనాలను ఖండించారు, అవి నిరాధారమైనవి అని చెప్పారు. తాను ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోదీని గానీ, బీజేపీని గానీ ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించలేదని గడ్కరీ అన్నారు., ఈ టీవీ కార్యక్రమం యొక్క పూర్తి వీడియోని పరిశీలిస్తే వాస్తవంగా గడ్కరీ 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ క్లెయిమ్ గురించి మరింత సమాచరం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, పలు రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ & ఇక్కడ), ఈ రిపోర్ట్స్ ప్రకారం, ఓ టీవీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ 2014లో బీజేపీ అధికారంలోకి రాదు అనుకొని పెద్ద పెద్ద తప్పుడు హామీలిచ్చాం అని చెప్తున్నా వీడియో క్లిప్‌ని 2018లో కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ తమ అధికారిక ట్విట్టర్ నందు షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి, అంతేకాకుండా పలు జాతీయ మీడియా సంస్థలు కూడా నితిన్ గడ్కరీ మోదీని ఉదేశిస్తూ వ్యాఖ్యలు చేసినట్లు 2018లో రిపోర్ట్ చేసాయి (ఇక్కడ , ఇక్కడ & ఇక్కడ). అయితే, ఈ వీడియో క్లిప్ మరియు ఈ వార్తలు గురించి 10 అక్టోబరు 2018లో జరిగిన విలేకరుల సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ ఆ వార్తా కథనాలను ఖండించారు, అవి నిరాధారమైనవి అని అన్నారు. తాను ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోదీని గానీ, బీజేపీని గానీ ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించలేదని గడ్కరీ అన్నారు. అలాగే, 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, రాష్ట్ర రహదారిపై టోల్ ఎత్తివేతపై హామీ ఇవ్వొద్దని తాను సూచించినప్పుడు, దేవేంద్ర ఫడ్నవీస్, దివంగత గోపీనాథ్ ముండే బీజేపీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారా అని సరదాగా అడిగారని ఆయన స్పష్టం చేసారు. సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ఇంటర్వ్యూ యొక్క మొత్తం వీడియోను చూడాలని గడ్కరీ పాత్రికేయులను కోరారు.అలాగే, కార్యక్రమం మరాఠీలో ఉంది, రాహుల్‌కి మరాఠీని ఎప్పటి నుండి అర్థం చేసుకోవడం ప్రారంభించాడో నేను ఆశ్చర్యపోతున్నాను అని ఆయన అన్నారు.

తదుపరి మేము ఇంటర్నెట్‌లో “అస్సల్ పవ్హానే, ఇర్సల్ నామూనే” అనే  ఈ కార్యక్రమం యొక్క పూర్తి వీడియో కోసం వెతకి పరిశీలించగా, ఈ షోలో రెండు భాగాలు ఉన్నాయి, రెండూ 40 నిమిషాలకు పైగా ఉన్నాయి అని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన వైరల్ క్లిప్ మొదటి భాగంలో టైంస్టాంప్ వద్ద  మొదలై 39:56 నుండి 40:30 ముగుస్తుంది అని తెలుస్తుంది. వాస్తవంగా, గడ్కరీ 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతుంది. గడ్కరీ  మాట్లాడుతూ “2014 ఎన్నికల సమయంలో, దేవేంద్ర ఫడ్నవీస్ మరియు దివంగత గోపీనాథ్ ముండే ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించారు. రాష్ట్ర రహదారిపై టోల్ ఎత్తివేతపై బిజెపి హామీ ఇవ్వొద్దని తాను సూచించినప్పుడు, దేవేంద్ర ఫడ్నవీస్ మరియు ముండే బిజెపి అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారా అని నవ్వుతూ అన్నారు, మేము ఎప్పటికీ అధికారంలోకి రాలేమని మాకు చాలా నమ్మకం ఉంది. కాబట్టి మా వాళ్ళు  పెద్ద పెద్ద వాగ్దానాలు చేయాలని సూచించారు. మేం అధికారంలోకి రాకపోతే ఎలాగూ బాధ్యత వహించము! ఇప్పుడు సమస్య ఏమిటంటే ప్రజలు మమ్మల్ని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు ప్రజలు తేదీలతో పాటు మా వాగ్దానాలను గుర్తు చేస్తున్నారు” అని అన్నారు(తెలుగు అనువాదం).

చివరగా, ‘2014 ఎన్నికల్లో గెలవడానికి మేము తప్పుడు వాగ్దానాలు చేశాం’ అని నితిన్ గడ్కరీ అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll