అసలు చట్టంలో లేని రూల్ గురించి మాట్లాడుతూ ఎన్నికల అధికారులు ఓటర్లతో ఇప్పటి నుండే దొంగ ఓట్లు వేయిస్తున్నారని సోషల్ మీడియాలో ఒక వీడియోని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: లేని రూల్ గురించి చెప్తూ ఓటర్లతో ఇప్పటి నుండే దొంగ ఓట్లను వేయిస్తున్న ఎన్నికల అధికారులు.
ఫాక్ట్: 80 ఏళ్ళు పైబడిన ఓటర్లకు, వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తూ అక్టోబర్ 2019 లోనే రూల్స్ (‘Conduct of Elections (Amendment) Rules, 2019’) ని తీసుకొని వచ్చారు. ఆ రూల్స్ ఆధారంగా 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్నికల కమిషన్ వారు అర్హులకు ఈ సౌకర్యం అందించారు. 19 జూన్ 2020న కోవిడ్- 19 క్వారంటైన్ లో ఉన్నవారికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తూ కొత్త రూల్స్ (‘Conduct of Elections (Amendment) Rules, 2020’) ని తీసుకొని వచ్చారు. ఈ రూల్స్ తాజాగా సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరుగుతున్న అన్నీ రాష్ట్రాల్లో వర్తిస్తాయి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
వీడియోలో మహిళ మాట్లాడుతూ, ‘కోవిడ్ సమయంలో వాళ్ళు పోలింగ్ స్టేషన్ కి వచ్చి వేయలేరు కాబట్టి నేషనల్ లోనే ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాం జరగడం’ అని ప్రజలకు చెప్పడం వినొచ్చు. కావున, ఆ సమాచారంతో ఇంటర్నెట్ లో వెతకగా, సెప్టెంబర్ 2020 నెలలో వివిధ రాష్ట్రల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) లకు భారత ఎన్నికల కమిషన్ పంపించిన లేఖ మాకు దొరికింది. వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో 80 ఏళ్ళు పైబడిన ఓటర్లకు, వికలాంగులకు, కోవిడ్- 19 క్వారంటైన్ లో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించమని చెప్తూ, దానికి సంబంధించిన వివరాలు ఆ లేఖలో రాసినట్టు చూడవొచ్చు. కావున, వీడియోలో చెప్తున్న రూల్ కేవలం దుబ్బాక ఎన్నికలకే పరిమితం కాదు, మిగితా రాష్ట్రాల ఎన్నికల్లో కూడా వర్తిస్తుంది. ఇదే విషయం కోవిడ్-19 సమయంలో నిర్వహిస్తున్న ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసిన మార్గదర్శకాలల్లో కూడా చూడవొచ్చు.
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఎలా పొందాలనే వివరాలు కూడా ఆ లేఖలోనే ఉన్నాయి. ప్రజలు నిర్దారిత సమయంలోపు తమ నియోజికవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ కి ఫారం-12డీ మరియు ఇతర వివరాలు పంపించాలని, తనకి వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హుల లిస్టుని రిటర్నింగ్ ఆఫీసర్ తయారు చేస్తారని తెలిసింది. పోస్టల్ బ్యాలెట్ కి అర్హులైన వారి పేర్ల పక్కన ఓటర్ లిస్టులో ‘పీబీ’ ( పోస్టల్ బ్యాలెట్) అని రిటర్నింగ్ ఆఫీసర్ సూచిస్తారు. పోస్టల్ బ్యాలెట్ కి అర్హులైన వారు పోలింగ్ స్టేషన్ కి వచ్చి ఓటు వేయకుండా కూడా రిటర్నింగ్ ఆఫీసర్ చూస్తారు. ఇదే విషయం ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసిన ‘ఓటర్ గైడ్’ లో కూడా చూడవొచ్చు.
ఫారం-12D లో ఓటర్ ఇచ్చిన అడ్రెస్ కి ఎన్నికల అధికారులు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిపిస్తారు. తాము వచ్చే తేదీ, సమయం ముందుగానే ఓటర్ కి అధికారులు తెలియజేస్తారు. ఒకవేల ఆ సమయంలో ఓటర్ ఆ అడ్రెస్ లో లేకుంటే, మరొక్కసారి అధికారులు వెళ్తారు. రెండోసారి కూడా లేకుంటే, తిరిగి అధికారులు వెళ్లరు. ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్న సమయాలను అభ్యర్థులకు తెలియజేస్తారు, వారు తమ ప్రతినిధులను ఈ ప్రక్రియ చూడటానికి నియమించవొచ్చు. ఎలాంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ఓటర్ ఓటు వేసేలా చూసే బాధ్యత పోలింగ్ అధికారిది. ఈ ప్రక్రియ అంతా వీడియో తీయబడుతుంది. ఎన్నికలకు ఒక రోజు ముందే ఈ ప్రక్రియ ముగిసేలా చూస్తారు. మరిన్ని వివరాలు ఇక్కడ చదవొచ్చు.
80 ఏళ్ళు పై బడిన ఓటర్లకు, వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తూ 22 అక్టోబర్ 2019 లోనే రిలీజ్ చేసిన రూల్స్ (‘Conduct of Elections (Amendment) Rules, 2019’) ని ఇక్కడ చూడవొచ్చు. ఆ రూల్స్ ఆధారంగా 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్నికల కమిషన్ అర్హులకు ఈ సౌకర్యం అందించారు. అయితే, 19 జూన్ 2020 న ‘80 ఏళ్ళ’ వయసు రూల్ ను ‘65 ఏళ్ళ’ కు మారుస్తూ మరియు కోవిడ్- 19 క్వారంటైన్ లో ఉన్నవారికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తూ కొత్త రూల్స్ (‘Conduct of Elections (Amendment) Rules, 2020’) ని తీసుకొని వచ్చారు. కానీ, బీహార్ ఎన్నికల్లో మరియు రానున్న కొద్ది సమయం వరకు ఇతర ఎన్నికల్లో కూడా ‘65 ఏళ్ళ’ రూల్ వర్తించదు అని, 80 ఏళ్ళు పై బడిన ఓటర్లకు మాత్రం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అందిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపినట్టు ఇక్కడ చదవొచ్చు.
బీహార్ ఫేస్-1 ఎన్నికల్లో 52 వేల మందికి పైగా 80 ఏళ్ళు పై బడిన ఓటర్లు మరియు వికలాంగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం తీసుకునట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
దుబ్బాక – ఉపఎన్నిక:
దుబ్బాక నియోజికవర్గంలో 80 ఏళ్ళు పై బడిన ఓటర్లు 1089 మంది, వికలాంగులు 469 మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం తీసుకున్నారని, రెండు విడతలుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు తెలిపినట్టు ‘ఈనాడు’ వార్త పత్రికలో చదవొచ్చు. అంతేకాదు, పోస్టల్ బ్యాలెట్ తీసుకునే క్రమంలో BLOలగా బాధ్యతలు నిర్వహిస్తున్న అంగన్వాడీలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహిస్తున్నారని, వారి పై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు కూడా ఈనాడు పత్రికలో రాసారు.
చివరగా, 80 ఏళ్ళు పై బడినవారు, వికలాంగులు, కోవిడ్- 19 క్వారంటైన్ లో ఉన్నవారు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యం పొందవొచ్చు. ఈ రూల్ అన్నీ రాష్ట్రాల్లో వర్తిస్తుంది.