కొడుకు ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ రాలేదనే ఆవేదనతో షారుఖ్ ఖాన్ ముఖం ఎలా భాధతో నిండిపోయిందో చూడండి, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఈ ఫోటోలో షారుఖ్ ఖాన్ ముఖం భాధతో ఎర్రబడిపోయి ఉండటాన్ని మనం చూడవచ్చు. డ్రగ్స్ కేసు వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ని 02 అక్టోబర్ 2021 నాడు అరెస్ట్ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా NCB అధికారులు షారుఖ్ ఖాన్ ఇళ్లు ‘మన్నత్’ని కూడా సోదా చేసారు. ఆర్యన్ ఖాన్ ఫైల్ చేసిన పలు బెయిల్ పిటిషన్లని ముంబై నార్కోటిక్స్ స్పెషల్ కోర్టు’ కొట్టిపారేసిన నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కొడుకు ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ రాలేదని షారుఖ్ ఖాన్ ఆవేదన చెందుతున్న దృశ్యం.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. షారుఖ్ ఖాన్ 2017లో ఆలియా భట్ పుట్టినరోజు వేడుకలకి హాజరయినప్పుడు తీసిన ఫోటోని మార్ఫ్ చేసి ఈ ఫోటోని రూపొందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘India Today’ న్యూస్ సంస్థ 16 మర్చి 2017 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 2017లో బాలీవుడ్ నటి ఆలియా భట్ పుట్టినరోజు వేడుకకు షారుఖ్ ఖాన్ హాజరయినప్పుడు తీసిన ఫోటో అని ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసిన ఒరిజినల్ ఫోటోలో షారుఖ్ ఖాన్ ముఖం బాధతో ఎర్రబడినట్టు కనిపించట్లేదు.
ఈ ఫోటోని ఇదే వివరణతో పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. షారుఖ్ ఖాన్ ఆలియా భట్ పుట్టినరోజు వేడుకకు హాజరయినప్పుడు తీసిన లైవ్ వీడియోని ఇక్కడ చూడవచ్చు.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తన కొడుకు ఆర్యన్ ఖాన్‌ని, షారుఖ్ ఖాన్ 21 అక్టోబర్ 2021 నాడు ఆర్థర్ రోడ్ జైలులో కలుసుకున్నారు. షారుఖ్ ఖాన్ ఆర్యన్ ఖాన్‌ని కలుసుకొని బయటికివస్తున్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ఆర్యన్ ఖాన్ అరెస్టుకి సంబందించినది కాదు అని చెప్పవచ్చు.
చివరగా, మార్ఫ్ చేసిన ఫోటోని కొడుకు ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ రాలేదని షారుఖ్ ఖాన్ ఆవేదన చెందుతున్న దృశ్యమంటూ షేర్ చేస్తున్నారు.