‘ఈ రోజు ముంబై నగరంలోని బాంద్రా మసీదు ముందు వేలమంది తురకలు గుమ్మికూడి, కరోనా అల్లాహ్ వల్లన రాలేదు అంటూ వేలమంది తో సభ పెట్టారు. LOCKDOWN కేవలం హిందువులే కేనా. చట్టాల్ని గౌరవించే హిందువుల కేమో లాఠీలతో తన్నులు, వీళ్ళకి ఇలాంటి సభలు..’ అని అంటూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ముంబై లోని బాంద్రాలో మసీదు ముందు వేలమందితో కొరోనా పై సభ పెట్టిన ముస్లింలు.
ఫాక్ట్ (నిజం): వీడియోలో ఉన్నవారు లాక్ డౌన్ వల్ల ముంబైలో చిక్కుకుపోయిన వివిధ మతాలకు చెందిన వలస కార్మికులు. తమను తమ స్వస్థలానికి వెళ్ళడానికి అనుమతించాలని కోరుతూ, వారందరూ బాంద్రా రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న మసీదు ముందు గూమిగూడరు. ట్రైన్లు మొదలవుతాయని కొన్ని పుకార్లు రావడంతో బాంద్రా రైల్వే స్టేషన్ కి వారందరూ వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులోని విషయం గురించి వెతకగా, లాక్ డౌన్ వల్ల ముంబైలో చిక్కుకుపోయిన వలస కార్మికులు తమను తమ స్వస్థలానికి వెళ్ళడానికి అనుమతించాలని కోరుతూ బాంద్రా రైల్వే స్టేషన్ దగ్గర గూమిగూడారాని ‘ప్రెస్ ట్రస్ట్ అఫ్ ఇండియా’ వారి ట్వీట్ ద్వారా తెలుస్తుంది. ఇదే విషయంపై మహారాష్త్ర ముఖ్యమంత్రి ఆఫీసు వారు కూడా ట్వీట్ చేసారు. ఏప్రిల్ 14 తర్వాత ట్రైన్లు మొదలవుతాయని భావించి, వారందరూ రైల్వే స్టేషన్ దగ్గర గూమిగూడారాని ఆ ట్వీట్ లో చదవొచ్చు.
‘సాయంత్రం 4 గంటలకు బాంద్రా రైల్వే స్టేషన్ ప్రాంగణంలో సుమారు 1500 మంది గుమిగూడరు. వారిలో చాలా మంది వలస కార్మికులే. లాక్డౌన్ పొడిగింపుపై వారు అసంతృప్తితో ఉన్నారు. తమ ఇళ్లకు తిరిగి వెళ్లనివ్వండని కోరారు’, అని ముంబై పోలీసు పీఆర్ఓ డీసీపీ ప్రణయ అశోక్ తెలిపారు. కావున, పోస్టులో చెప్పినట్టు ఏదో ఒక్క మతం వారు మసీదు ముందు సభ పెట్టలేదు, ఆ ఘటనలో మత ప్రస్తావన ఎక్కడా కూడా లేదు. వారు ముంబైలో చిక్కుకుపోయిన వివిధ మతాలకు చెందిన వలస కార్మికులు. అంతేకాదు, పోస్ట్ చేసిన వీడియోని సరిగ్గా వింటే, దాంట్లోని వ్యక్తి అక్కడి ప్రజలకు సర్దిచెప్తున్నట్టు తెలుస్తుంది.
వీడియోలో వారు మసీదు ముందు ఉన్నట్టు చూడవొచ్చు. అయితే, అది బాంద్రా రైల్వే స్టేషన్ పక్కనే ఉందని గూగుల్ మాప్స్ ద్వారా తెలుస్తుంది.
అంతేకాదు, అనవసరమైన పూకర్లు పుట్టించి, ఆ ఘటనకు కారణమైన వినయ్ దూబే ని పోలీసులు అరెస్ట్ చేసారు. ట్రైన్లు మొదలవుతాయని రిపోర్ట్ చేసిన ఒక టీవీ జర్నలిస్ట్ పై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు. ఈ ఘటనకి సంబంధించిన మరిన్ని వార్తలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, తమను ఇంటికి పంపించమని బాంద్రాలో వలస కార్మికులు గూమిగూడితే, ‘కొరోనా పై సభ పెట్టిన ముస్లింలు’ అని షేర్ చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?