జై శ్రీ రామ్ అంటే తప్పు బట్టిన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఒక బహిరంగ సభలో నమాజ్ చదువుతున్న దృశ్యాలంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కొలకత్తా విక్టోరియ మెమోరియల్ లో జరిగిన నేతాజీ 125వ జన్మదిన వేడుకలో జై శ్రీరామ్ నినాదాలు చేసి తనని అవమానించారని, మమత బెనర్జీ నిరసన తెలుపుతూ ఆ బహిరంగ సభలో స్పీచ్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఈ నేపధ్యంలో షేర్ అవుతున్న పోస్టులోని వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: జై శ్రీ రామ్ నినాదాలు తప్పు బట్టిన మమతా బెనర్జీ, ఒక బహిరంగ సభలో ముస్లిం ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ‘మాతి ఉత్సవ్ 2018’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చిన స్పీచ్ కి సంబంధించినది. మాతి పథకం ద్వార అందరు రైతులకు లబ్ది చేకూరాలని, మమతా బెనర్జీ తన స్పీచ్ లో వివిధ మతాల దేవతలకు ప్రార్థనలు చేసారు. మమతా బెనర్జీ తన స్పీచ్ లో ఇస్లాం ప్రార్థన చేసిన దృశ్యాలని మాత్రమే ఎడిట్ చేసి ఇలా షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
పోస్టులో షేర్ చేసిన వీడియోని ఇదే క్లెయిమ్ తో పశ్చిమ బెంగాల్ భారతీయ జనత పార్టీ (BJP) తమ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. BJP ట్వీట్ చేసిన ఈ వీడియో యొక్క పూర్తి వెర్షన్ వీడియోని, ఒక జర్నలిస్ట్ ఈ ట్వీట్ కి రిప్లై గా షేర్ చేసారు. 2018లో జరిగిన మాతి ఉత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివిధ మతాల దేవతలకు ప్రార్థన చేసినట్టు ఈ ట్వీట్ లో తెలిపారు. మమతా బెనర్జీ ఇస్లాం ప్రార్థన చేస్తున్న దృశ్యాలను మాత్రమే ఎడిట్ చేసి BJP తప్పుగా ప్రచారం చేస్తునట్టు తన ట్వీట్ లో తెలిపారు.
ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ‘మాతి ఉత్సవ్ 2018’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మమతా బెనర్జీ స్పీచ్ యొక్క పూర్తి వీడియోని త్రినముల్ కాంగ్రెస్ పార్టీ తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. 02 జనవరి 2018 నాడు పశ్చిమ బెంగాల్ లోని పుర్భ బర్ధమాన్ జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో, మాతి పథకం ద్వార అందరు రైతులకి లబ్ది చేకూరాలని మమతా బెనర్జీ వివిధ మతాల ప్రార్థనలు చేసారు. ఆ దృశ్యాలని వీడియో లోని 21.33 నిమిషాల తర్వాత నుంచి చూడవచ్చు.
మమతా బెనర్జీ తన స్పీచ్ లో ఇస్లాం ప్రార్థనతో పాటు, హిందూవుల దేవత అయిన దుర్గా మాతకి అలాగే, సిక్కు మత ప్రార్థనలు చేసారు. అయితే, 21.58 నుండి 22.14 నిమిషాల వ్యవధిలో మమతా బెనర్జీ ఇస్లాం ప్రార్థన చేస్తున్న దృశ్యాలని మాత్రమే ఈ వీడియోలో చూపిస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు. ‘మాతి ఉత్సవ్ 2018’ ప్రారంబోత్సవ కార్యక్రమానికి సంబంధించి త్రినముల్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, 2018లో మమతా బెనర్జీ వివిధ మతాల దేవతలకు ప్రార్థన చేస్తున్న వీడియోలోని ఒక భాగాన్ని ఎడిట్ చేసి, హిందూ నినాదాలు వ్యతిరేకించిన మమతా బెనర్జీ బహిరంగ సభలో ఇస్లాం ప్రార్థనలు చేస్తున్నారని షేర్ చేస్తున్నారు.