Fake News, Telugu
 

ఫిబ్రవరి 2న (1835) భారతదేశాన్ని పొగుడుతూ బ్రిటిష్ పార్లమెంటుకి లార్డ్ మెకాలే ఉత్తరం రాయలేదు

1

భారతదేశాన్ని పొగుడుతూ, ఎలా ఆక్రమించాలో చెపుతూ ఫిబ్రవరి 2న (1835) బ్రిటిష్ పార్లమెంటుకి లార్డ్ మెకాలే ఉత్తరం రాసాడంటూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : భారతదేశాన్ని పొగుడుతూ లార్డ్ మెకాలే ఫిబ్రవరి 2న (1835) బ్రిటిష్ పార్లమెంటుకి ఉత్తరం రాసాడు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వ్యాఖ్యలు లార్డ్ మెకాలే అన్నట్టుగా కానీ, ఉత్తరంలో రాసినట్టుగా కానీ ఎక్కడా కూడా సమాచారం లేదు. పోస్టులో చెప్పిన తేదీలో తను ఇచ్చిన ‘Minute on Education’ లో కూడా ఆ వ్యాఖ్యలు లేవు. పోస్ట్ లోని వ్యాఖ్యలు లార్డ్ మెకాలే చేయలేదని ఇంతకుముందే వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ కూడా చుడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో పెట్టిన ఫోటోని సరిగ్గా చూస్తే, తెలుగులో ఏమో ఫిబ్రవరి 2న (1835) బ్రిటిష్ పార్లమెంటుకి రాసిన ఉత్తరంలో లార్డ్ మెకాలే ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంటుంది, కానీ ఇంగ్లీషులో ఏమో ఫిబ్రవరి 2న (1835) బ్రిటిష్ పార్లమెంటులో లార్డ్ మెకాలే చేసిన ప్రసంగంలో ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంటుంది. ఇంగ్లీషులో చెప్పినట్టుగా బ్రిటిష్ పార్లమెంటులో లార్డ్ మెకాలే ఆ వ్యాఖ్యలు చేసాడని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా 2014 లో ఒక ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ కింద ఒకరు కామెంట్ చేస్తూ  ఫిబ్రవరి 2న లార్డ్ మెకాలే ఇండియా లోనే ఉన్నారని, ఆ రోజున లార్డ్ మెకాలే ఇచ్చిన ‘Minute on Education’ లింక్ ని పోస్ట్ చేసాడు. ‘Minute on Education’ లో పోస్ట్ లోని వ్యాఖ్యలు లేనట్టుగా చుడవొచ్చు. అంతేకాదు, భారతదేశం యొక్క విద్యావ్యవస్థ కంటే యూరోప్ విద్యావ్యవస్థ చాలా గొప్పదని లార్డ్ మెకాలే వ్యాఖ్యలు చేసినట్టుగా చూడవొచ్చు.

భారతదేశం గురించి 1933 లో లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలను ‘Speeches by Lord Macaulay: With His Minute on Indian Education’ అనే పుస్తకంలో చదవొచ్చు. ఆ ప్రసంగంలో తను చేసిన వ్యాఖ్యలు, పోస్ట్ లోని వ్యాఖ్యలకు వ్యతిరేఖంగా ఉన్నట్టు చూడవొచ్చు.  

భారతదేశంలో ఇంగ్లీషు విద్యావ్యవస్థ పెట్టాలంటూ లార్డ్ మెకాలే చాలా వ్యాఖ్యలు చేసాడు, కానీ పోస్ట్ లోని వ్యాఖ్యలు మాత్రం లార్డ్ మెకాలే చేయలేదంటూ వివిధ వార్తాసంస్థలు (The Hindu, The Wire, The Quint)  కూడా  ఆర్టికల్స్ ప్రచురించినట్టుగా చూడవొచ్చు. పోస్ట్ లోని వ్యాఖ్యలే ఆఫ్రికా మీద లార్డ్ మెకాలే చేసినట్టు కూడా ప్రచారమవుతున్నట్టు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ఫిబ్రవరి 2న (1835) భారతదేశాన్ని పొగుడుతూ బ్రిటిష్ పార్లమెంటుకి లార్డ్ మెకాలే ఉత్తరం రాయలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll