Fake News, Telugu
 

ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు కడియం శ్రీహరి బీఆర్ఎస్‌లోనే ఉన్నారు, కాంగ్రెస్‌లో చేరలేదు

0

తెలంగాణలో ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి అసెంబ్లీలో విమర్శిస్తున్నారంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

A screenshot of a video  Description automatically generated
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి.

ఫాక్ట్: ఈ వీడియో 14 ఫిబ్రవరి 2024 నాటిది. అప్పటికి కడియం శ్రీహరి ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. 31 మార్చి 2024న కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన ప్రకటించారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ వీడియోలో ఉన్న కడియం శ్రీహరి ఉపన్యాసం గురించి ఇంటర్నెట్లో వెతకగా 14 ఫిబ్రవరి 2024న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు (ఇక్కడ & ఇక్కడ) గుర్తించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా జరిగిన చర్చలో కడియం శ్రీహరి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తగిన సొమ్ముని బడ్జెట్‌లో కేటాయించలేని, ఆరు గ్యారెంటీల వల్ల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వాటిని అమలు చేయట్లేదని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించిన అసెంబ్లీ కార్యకలాపాల అధికారిక నివేదికను ఇక్కడ చూడవచ్చు.

అయితే ఈ వ్యాఖ్యలు చేసే సమయానికి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. 31 మార్చి 2024న కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్యతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రకటించారు.

A group of people standing together  Description automatically generated

దీన్ని బట్టి వైరల్ వీడియోలోని వ్యాఖ్యలు కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చేసినవని నిర్ధారించవచ్చు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ తరపున గెలిచి పార్టీ  ఫిరాయించిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై ఉన్న అనర్హత పిటిషన్లపై స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు వేసిన కేసులో తెలంగాణ హైకోర్టు 22 నవంబర్ 2024న తీర్పు వెల్లడించింది.

చివరిగా, ఆరు గ్యారెంటీల అమలుపై కడియం శ్రీహరి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని విమర్శించినప్పుడు ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్‌లో చేరలేదు.

Share.

About Author

Comments are closed.

scroll