కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (పిసి ఘోష్) కమిషన్ తేల్చిందని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిరాధార ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను అరెస్టు చేయాలని చూస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో “కేసీఆర్‌ని ముట్టుకుంటే.. తెలంగాణ తగలబడిపోద్ది అని రేవంత్ సర్కార్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను టచ్ (అరెస్టు) చేస్తే తెలంగాణ తగలబడిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఫాక్ట్(నిజం): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని చెప్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను అరెస్టు చేస్తే తెలంగాణ తగలబడిపోతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత T. జీవన్ రెడ్డి వ్యాఖ్యానించలేదు. నిజానికి, ఈ వ్యాఖ్యలు చేసింది ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత ఆశన్నగారి జీవన్‌రెడ్డి. మాతో (Factly) కాంగ్రెస్ సీనియర్ నేత T. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తాను ఇలాంటి వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, ఈ వార్తలు ఫేక్ అని స్పష్టం చేశారు. అలాగే ఈ తప్పుడు వార్తలపై తాను, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశామని కూడా ఆయన అన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని చెప్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను అరెస్టు చేస్తే తెలంగాణ తగలబడిపోతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత T.జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత T. జీవన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, ఖచ్చితంగా పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్టు చేసి ఉండేవి. అలాగే మేము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత T.జీవన్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) కూడా పరిశీలించాము, అక్కడ కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఎలాంటి పోస్ట్‌లు చేయలేదు.
ఈ క్రమంలోనే, “కేసీఆర్‌ను టచ్ చేస్తే… తెలంగాణ అగ్నిగుండమే : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి” అనే శీర్షికతో 05 ఆగస్ట్ 2025న తెలుగు మీడియా సంస్థ ‘సూర్య’ ప్రచురించిన వార్తా కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కక్ష పెంచుకున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిరాధారమైన నిందలు మోపి ఆయనను అరెస్టు చేసి రాక్షస ఆనందం పొందే కుట్ర చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు,ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ అగ్ని గుండంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. కాళేశ్వరం కమిషన్ కాంగ్రెస్ కక్ష సాధింపు మిషన్ అని జీవన్ రెడ్డి 04 ఆగస్ట్ 2025న విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ను అరెస్టు చేస్తే తెలంగాణ తగలబడిపోతుందని బీఆర్‌ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే A. జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారని పలు వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). తదుపరి మేము ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన పత్రికా ప్రకటనను కూడా మేము కనుగొన్నాము.

అలాగే, ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే T. జీవన్ రెడ్డిని సంప్రదించగా, మాతో (Factly) ఆయన మాట్లాడుతూ, తాను ఇలాంటి వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, ఈ వార్తలు ఫేక్ అని స్పష్టం చేశారు. అలాగే ఈ తప్పుడు వార్తలపై తాను, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశామని కూడా ఆయన అన్నారు.
ఈ వైరల్ పోస్టులలో కొన్ని ‘Hans India’ వార్తా కథనాన్ని కూడా షేర్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ). అయితే, కేసీఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండంలా మారుతుందని బీఆర్‌ఎస్ నాయకుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రిపోర్ట్ చేస్తూ ‘హాన్స్ ఇండియా’ పొరపాటున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి ఫోటోను ప్రచురించి ఉండవచ్చు (ఇక్కడ, ఇక్కడ).
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయని భావిస్తూ, 14 మార్చి 2024న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ దాదాపు 15 నెలల పాటు విచారణ నిర్వహించింది. విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్, నీటిపారుదల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసి విచారించింది. ఈ విచారణకు కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, పలువురు అధికారులు హాజరయ్యారు. 31 జూలై 2025న, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని, కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి సమగ్ర చర్చ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 04 ఆగస్ట్ 2025న వెల్లడించారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
చివరగా, “కేసీఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ తగలబడిపోతుంది” అని వ్యాఖ్యానించింది బీఆర్‌ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి.