Fake News, Telugu
 

రామసేతు మానవ నిర్మితమా లేక సహజసిద్ధమైనదా అనే దానిపై ఇస్రో ఎలాంటి ప్రకటన చేయలేదు

0

ఇటీవల ఇస్రోకు (ISRO) చెందిన హైదరాబాద్‌, జోధ్‌పూర్‌ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌ల (NRSC) శాస్త్రవేత్తలు రామసేతు/ఆడమ్స్ బ్రిడ్జ్‌పై తమ పరిశోధన ఫలితాలను ఒక సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించారు. ఆడమ్స్ బ్రిడ్జికు సంబంధించిన కొన్ని మ్యాప్‌లను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రామసేతు మానవ నిర్మితమని ఇస్రో ప్రకటించింది అని అర్ధం వచ్చేలా పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్లు ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రామసేతు మానవ నిర్మితమని ఇస్రో ప్రకటించింది.

ఫాక్ట్(నిజం): రామసేతు/ఆడమ్స్ బ్రిడ్జి మానవ నిర్మితమా లేక సహజసిద్ధమైనదా అనే దానిపై ఇస్రో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల హైదరాబాద్‌, జోధ్‌పూర్‌లోని ఇస్రో(ISRO) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC) శాస్త్రవేత్తలు ఆడమ్స్ బ్రిడ్జ్‌పై తమ పరిశోధన ఫలితాలను ఒక సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ జర్నల్‌లో ఆడమ్స్ బ్రిడ్జికు సంబంధించిన కొన్ని మ్యాప్‌లను విడుదల చేశారు. వాస్తవంగా, ఈ పరిశోధనలో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ వంతెనను ఆడమ్స్ బ్రిడ్జ్‌ అనే సంబోధించారు. అంతేకాకుండా, ఇస్రో శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో ఈ వంతెన ఎలా ఏర్పడింది అనే అంశంపై ఎలాంటి వ్యాఖలు చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల హైదరాబాద్‌, జోధ్‌పూర్‌లోని ఇస్రో(ISRO) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC) శాస్త్రవేత్తలు ఆడమ్స్ బ్రిడ్జ్‌పై (రామసేతు) తమ పరిశోధన ఫలితాలను ఒక సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ జర్నల్‌లో దీనికి సంబంధించిన కొన్ని మ్యాప్‌లను కూడా విడుదల చేశారు. వాస్తవంగా, ఈ పరిశోధనలో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ వంతెనను ఆడమ్స్ బ్రిడ్జ్‌ అనే సంబోధించారు. అంతేకాకుండా, ఇస్రో శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో ఈ వంతెన ఎలా ఏర్పడింది అనే అంశంపై ఎలాంటి వ్యాఖలు చేయలేదు. ఈ ఆడమ్స్ బ్రిడ్జ్‌ను హిందూ పురాణాల ప్రకారం ‘రామసేతు’ అని పిలుస్తారని, అలాగే పర్షియన్ నావికులు ‘సేతు బంధై’ అని పిలిచారని, ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు యూరోపియన్ నావిగేటర్లు ఈ వంతెనను ఆడమ్స్ బ్రిడ్జ్‌ అని సంబోధించారు అని ఈ జర్నల్‌లో పేర్కొన్నారు.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఐస్‌శాట్‌-2 (ICESat-2) ఉపగ్రహం డేటా సాయంతో రామసేతు/ ఆడమ్స్ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఇందుకోసం అక్టోబరు 2018 నుంచి అక్టోబరు 2023 మధ్య ఆరేళ్ల పాటు నాసా ఐస్‌శాట్-2 సేకరించిన డేటాను విశ్లేషించినట్టు తెలిపారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలో మీటర్ల మేర ఉంటుందని అంచనా వేశారు. అలాగే, దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు ఈ జర్నల్‌లో పేర్కొన్నారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ(సౌత్ ఈస్ట్) దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య(నార్త్ వెస్ట్) దిశ వరకు విస్తరించి ఉంది అని నిర్ధారించారు. ఈ వంతెన సున్నపురాతిని కలిగి ఉన్నట్లు, అలాగే  ప్రస్తుతం వంతెన 99.98 శాతం నీటిలో మునిగిందని ఇస్రో శాస్త్రవేత్తలు ఈ జర్నల్‌లో చెప్పుకొచ్చారు.  

ఈ వంతెన మానవ నిర్మితమా లేక ప్రకృతిలో వచ్చిన మార్పుల వల్ల సహజంగా ఏర్పడిందా అనే దానిపై ఏళ్ల తరబడి చర్చ జరుగుతోంది. రామసేతు/ఆడమ్స్ బ్రిడ్జ్‌ ఉనికి సంబంధించి గతంలో కూడా పలు పరిశోధనలు జరిగాయి. కానీ, ఈ వంతెన మానవ నిర్మితమా లేక సహజ సిద్దంగా ఏర్పడిందా అనే విషయంలో స్పష్టత రాలేదు. ఇప్పుడు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో ఈ వంతెన ఎలా ఏర్పడింది అనే అంశంపై ఎలాంటి వ్యాఖలు చేయలేదు.

తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖ వెబ్‌సైట్ ప్రకారం, రామేశ్వరం ఆలయ రికార్డులు ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామసేతు 1480 AD వరకు సముద్ర మట్టానికి పైన ఉన్నట్లు సూచిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ వంతెన సముద్రంలో మునిగిపోయింది అని తెలుస్తుంది.

2023లో ఓ మీడియా సంస్థతో ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ “మేము ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆడమ్స్ వంతెన లేదా రామసేతును వీక్షించవచ్చు, కానీ అది మానవ నిర్మితమైనదా లేదా సహజమైనదైనా అని నిర్థారించడం కోసం మాకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు అటువంటి ఇతర విభాగాల నుండి నిపుణులు కావాలి” అని అన్నారు.

మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి 2007లో రామసేతు/ఆడమ్స్ బ్రిడ్జిని జాతీయ వారసత్వ ప్రదేశంగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. సేతు సముద్రం ప్రాజెక్టు రామసేతు/ఆడమ్స్ వంతెనపై ప్రభావం చూపుతుందని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. ఈ పిటిషన్ సుప్రీం కోర్టులో ఇంకా పెండింగ్ లోనే ఉంది (ఇక్కడ).

జనవరి 2023లో రామసేతు/ఆడమ్స్ బ్రిడ్జ్‌కి సంబంధించిన పలు కేసులతో పాటు సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్ట్ విచారించింది. ఈ విచారణ సందర్భంగా, రామసేతును జాతీయ వారసత్వ ప్రదేశంగా చేర్చేందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కసరత్తు చేస్తోందని భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.

అలాగే మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి 2022లో రామసేతును జాతీయ వారసత్వ ప్రదేశంగా ప్రకటించడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారా? లేదా అని రాజ్యసభలో ప్రశ్న అడగగా, అప్పటి కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సమాధానం ఇస్తూ “ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, కావున దీనిపై వ్యాఖ్యానించలేమని” చెప్పారు.

చివరగా, రామసేతు/ఆడమ్స్ బ్రిడ్జి మానవ నిర్మితమా లేక సహజసిద్ధమైనదా అనే దానిపై ఇస్రో ఎలాంటి ప్రకటన చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll