Fake News, Telugu
 

IRCTC వ్యక్తిగత అకౌంట్ ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల కోసం టికెట్లను బుక్ చేసుకోవచ్చు

0

రైల్వే రిజర్వేషన్లకు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయని, ఈ రూల్స్ ప్రకారం IRCTC ఐడీపై ఇతరులకు రైల్వే టికెట్లు బుక్ చేస్తే 3 ఏండ్లు జైలు శిక్ష, రూ.10వేల జరిమానాకు అర్హులు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. IRCTC అకౌంట్ ద్వారా కేవలం తమ ఇంటి పేరు ఉన్న వారికి, రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్ బుక్ చేయాలి, అలా కాకుండా వేరే వ్యక్తులకు చేస్తే శిక్షార్హులు అంటూ చెప్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కొత్త రూల్స్ ప్రకారం IRCTC ఐడీపై ఇతరులకు రైల్వే టికెట్లు బుక్ చేస్తే 3 ఏండ్లు జైలు శిక్ష /రూ. 10వేల జరిమానా.

ఫాక్ట్(నిజం): IRCTC అకౌంట్ ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల కోసం టికెట్లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఐతే వ్యక్తిగత అకౌంట్‌ల ద్వారా బుక్ చేసిన టిక్కెట్లను వాణిజ్యపరంగా విక్రయిస్తే రైల్వే చట్టం,1989లోని సెక్షన్ 143 కింద చర్యలు ఉంటాయని IRCTC  తెలిపింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా రైల్వే టికెట్ రిజర్వేషన్లకు సంబంధించి IRCTC కొత్త రూల్స్ తీసుకొచ్చినట్టు ఎలాంటి వార్తా కథనాలు మాకు కనిపించలేదు. సాధారణంగా ఇలాంటి రూల్స్ ప్రవేశపెట్టి ఉంటే, మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కానీ మాకు అలాంటి కథనాలే కనిపించలేదు.

ప్రస్తుతం షేర్ అవుతున్న వార్తలో ఈ కొత్త రూల్స్‌కు సంబంధించి చేసిన రైల్వే చట్టం,1989లోని సెక్షన్ 143 గురించి ప్రస్తావిస్తున్నారు. ఐతే ఈ సెక్షన్ సంబంధిత రైల్వే ఉద్యోగి లేదా ఆథరైజ్డ్ ఏజెంట్‌లు మాత్రమే టికెట్‌లు విక్రయించాలని చెప్తుంది. వీరు కాకుండా ఇతరులు ఎవరైనా వాణిజ్యపరంగా ఈ టికెట్‌లను విక్రయించడాన్ని ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు.

ఐతే ఈ సెక్షన్‌లో ప్రస్తావించిన ఈ అంశాన్ని తప్పుగా అర్ధం చేసుకొని కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్‌లు బుక్ చేయాలన్న వాదన మొదలై ఉండవచ్చు. ఐతే ప్రత్యేకించి కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్‌లు బుక్ చేయాలనీ మాత్రం ఈ సెక్షన్‌లో ఎక్కడా చెప్పలేదు. కేవలం దళారీ వ్యవస్థను ప్రోత్సహించకుండా ప్రజలకు టికెట్‌లు అందుబాటులో ఉంచాలన్నదే పాయింట్ ఉద్దేశం.

ఈ వార్త వైరల్ అవ్వడంతో IRCTC దీనిపై స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం షేర్ అవుతున్న వార్తలో నిజం లేదని వాటిని నమ్మొద్దని తెలిపింది. IRCTC అకౌంట్ ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల కోసం టికెట్లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. IRCTC వ్యక్తిగత అకౌంట్ ద్వారా నెలకు 12 టికెట్లు బుక్‌ చేయవచ్చని, ఆధార్‌ అథెంటికేషన్‌ అయిన అకౌంట్‌ కలిగి ఉంటే నెలకు 24 టికెట్ల వరకు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.

ఐతే వ్యక్తిగత అకౌంట్‌ల ద్వారా బుక్ చేసిన టికెట్లను వాణిజ్యపరంగా విక్రయిస్తే రైల్వే చట్టం,1989లోని సెక్షన్ 143 కింద చర్యలు ఉంటాయని IRCTC  తెలిపింది. ప్రభుత్వ మీడియా అయిన PIB కూడా ఇదే స్పష్టం చేసింది.  ఇదిలా ఉండగా IRCTC వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం కూడా వ్యక్తిగత అకౌంట్‌ ద్వారా స్నేహితులు, కుటుంబం, బంధువుల కోసం టికెట్లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేస్తుంది.

చివరగా, IRCTC వ్యక్తిగత అకౌంట్ ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు బంధువుల కోసం టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll