01 ఫిబ్రవరి 2025న, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26ను (Union Budget 2025) లోక్‌సభలో ప్రవేశపెట్టారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో,“మాజీ ప్రధాని మన్మోహన్ చివరి బడ్జెట్ (2014-2015) 16 లక్షల కోట్లు, కానీ 2025లో మోదీ బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ దాదాపు 50 లక్షల కోట్లు, ఈ పదేళ్లలో (2014-2025) మోదీ గారు మన దేశాన్ని ఎంత అభివృద్ధి చేశారో ఈ బడ్జెట్ చూస్తే తెలుస్తుంది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2014లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ సుమారు ₹16 లక్షల కోట్లు కాగా, 2025లో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు 50 లక్షల కోట్లు, గత పదేళ్లలో (2014-2025) మోదీ మన దేశ బడ్జెట్‌ను మూడు రెట్లు పెంచారు.
ఫాక్ట్(నిజం): 2004 నుండి 2025 మధ్య భారతదేశ బడ్జెట్‌లను మనం విశ్లేషిస్తే, 2004-2014 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని UPA ప్రభుత్వ హయాంలో మనం దేశ బడ్జెట్ దాదావు మూడు రెట్లు పెరిగింది.అదేవిధంగా, 2014-2025 మధ్య బీజీపీ నేతృత్వంలోని ప్రస్తుత NDA ప్రభుత్వ హయాంలో కూడా మనం దేశ బడ్జెట్ దాదావు మూడు రెట్లే పెరిగింది. అలాగే, వివిధ కేంద్ర బడ్జెట్‌లను మనం పరిశీలిస్తే, ప్రతి సంవత్సరం బడ్జెట్ విలువ దాదపు పెరుగుతూనే వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఎలాగైతే ప్రతీ సంవత్సరం సహజంగా దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (GDP) పెరుగుతుందో, దేశ మొత్తం బడ్జెట్ విలువ కూడా పెరుగుతూనే ఉంటుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
గతంలో ప్రవేశపెట్టిన వివిధ కేంద్ర బడ్జెట్‌లను మనం పరిశీలిస్తే, ప్రతి సంవత్సరం బడ్జెట్ విలువ దాదాపుగా పెరుగుతూనే వస్తుంది. అలాగే ఓ దేశం ఎంత అభివృద్ధి చెందింది అని చెప్పడానికి ఆ దేశ బడ్జెట్ విలువ ఒకటే కొలమానం కాదు. ఎలాగైతే ప్రతీ సంవత్సరం సహజంగా దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (GDP) పెరుగుతుందో, దేశ మొత్తం బడ్జెట్ విలువ కూడా దాదాపు పెరుగుతూనే ఉంటుంది. వివిధ సంవత్సరాల కేంద్ర బడ్జెట్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం www.indiabudget.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
2004-05 సంవత్సరానికి కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి UPA ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను డేటాను పరిశీలిస్తే, 2004-05 సంవత్సరానికి రూ. 4,77,829.04 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ మొత్తం అంతకుముందు NDA ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2004-05 సంవత్సర మధ్యంతర బడ్జెట్ (రూ. 4,57,434.35 కోట్లు) కంటే ఎక్కువ.
2004-05 నుండి 2014-15 ఆర్థిక సంవత్సరం వరకు అప్పటి UPA ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంవత్సరాల కేంద్ర బడ్జెట్‌ల డేటాను పరిశీలిస్తే, ప్రతి సంవత్సరం బడ్జెట్ విలువ మునుపటి సంవత్సరం బడ్జెట్ కంటే పెరుగుతూ రావడం మనం గమనించవచ్చు (ఇక్కడ). 2013-14 సంవత్సరానికి అప్పటి UPA ప్రవేశపెట్టిన బడ్జెట్ డేటా ప్రకారం, 2013-14 సంవత్సరానికి రూ. 16,65,297.32 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ మొత్తం అంతకుముందు ప్రవేశపెట్టిన 2012-13 సంవత్సర బడ్జెట్ (రూ. 14,90,925.29 కోట్లు) కంటే ఎక్కువ. దీన్ని బట్టి UPA ప్రభుత్వం ఉన్న పదేళ్లలో (2004 – 2014) మన దేశ బడ్జెట్ సుమారు మూడు రెట్లు పైనే పెరిగింది అని తెలుస్తుంది.
అదే విధంగా 2014-15 నుండి ఇప్పటి వరకు అనగా 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు బీజీపీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంవత్సరాల కేంద్ర బడ్జెట్‌ల డేటాను పరిశీలిస్తే, 2014-15 నుండి కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్ విలువ మునుపటి సంవత్సరం బడ్జెట్ కంటే పెరుగుతూ రావడం మనం గమనించవచ్చు. 2014-15 సంవత్సరానికి రూ. 17,94,891.96 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ మొత్తం అంతకుముందు UPA ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2014-15 సంవత్సర మధ్యంతర బడ్జెట్ (రూ. 17,63,213.96 కోట్లు) కంటే తక్కువ అయితే అంతకుముందు ప్రవేశపెట్టిన 2013-14 సంవత్సర బడ్జెట్ (రూ. 16,65,297.32 కోట్లు) కంటే ఎక్కువ. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) ఇటీవల బీజీపీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ డేటా ప్రకారం, 2025-26 సంవత్సరానికి మొత్తం రూ. 50,65,345.04 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ మొత్తం అంతకుముందు ప్రవేశపెట్టిన 2024-25 సంవత్సర బడ్జెట్ (రూ. 48,20,512.08 కోట్లు) కంటే ఎక్కువ. దీన్ని బట్టి గత పదేళ్లలో (2004 – 2014) మన దేశ బడ్జెట్ దాదపు మూడు రెట్లు పెరిగింది అని తెలుస్తుంది. 2004 నుండి 2025 మధ్య మన దేశ బడ్జెట్‌లను మనం విశ్లేషిస్తే, 2004-2014 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని UPA ప్రభుత్వ హయాంలో మనం దేశ బడ్జెట్ దాదావు మూడు రెట్లు పెరిగిందని, అదేవిధంగా 2014-2025 మధ్య బీజీపీ నేతృత్వంలోని NDA ప్రభుత్వంలో కూడా మనం దేశ బడ్జెట్ దాదావు మూడు రెట్లే పెరిగిందని స్పష్టమవుతుంది. కావున వైరల్ పోస్టులో పూర్తి సమాచారం ఇవ్వడం లేదు.

01 ఫిబ్రవరి 2025న, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మొత్తం రూ. 50,65,345 కోట్లతో 2025-26 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025 కేంద్ర బడ్జెట్ సంబంధించిన పూర్తి సమాచారం కోసం భారత ప్రభుత్వ వెబ్‌సైట్ www.indiabudget.gov.in చూడవచ్చు. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా మధ్యతరగతి ప్రజానీకానికి భారీ ఊరట లభించింది. రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే రక్షణ శాఖకు అధికంగా నిధులు కేటాయించబడ్డాయి. 2025 బడ్జెట్‌ను పరిశీలిస్తే, శాఖల వారీగా కేటాయింపులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- రక్షణ శాఖకు రూ. 4,91,732 కోట్లు
- గ్రామీణాభివృద్దికి రూ. 2,66,817 కోట్లు
- హోం శాఖకు రూ. 2,33,211 కోట్లు
- వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు
- విద్యా రంగానికి రూ. 1,28,650 కోట్లు
- ఆరోగ్య రంగానికి రూ. 98,311 కోట్లు
- పట్టణాభివృద్దికి రూ. 96,777 కోట్లు
- ఐటి, టెలికం రంగానికి రూ. 95,298 కోట్లు
- విద్యుత్ రంగానికి రూ. 81,174 కోట్లు
అలాగే 2025 కేంద్ర బడ్జెట్‌లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు భారీగా నిధులు కేటాయించిందని పేర్కొంటూ ఓ పోస్టు వైరల్ కాగా, ఆ గణాంకాలు సరైనవి కావు అని చెప్తూ Factly రాసిన ఫాక్ట్-చెక్ కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, 2004-2014 మధ్య UPA ప్రభుత్వ పదేళ్ల కాలంలో, ప్రస్తుత NDA ప్రభుత్వ గత పదేళ్లలో మన దేశ బడ్జెట్ మూడు రెట్లు పెరిగింది.