Fake News, Telugu
 

భారత్ 1993 తర్వాత IMF నుండి లోన్ తీసుకోలేదు; UNICEF భారతీయ సంస్థల నుండి ఎన్నో ఏళ్లుగా వస్తువులు, సేవలను పొందుతోంది

0

“1981లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF)వద్ద నిధులు కోసం అభ్యర్థించింది, కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం UNICEF సంస్థకు వస్తు సేవల రూపంలో సుమారు 6 బిలియన్ డాలర్ల సహాయం అందించింది, UNICEFకు ఆరోగ్యం మరియు రేషన్ మద్దతులో 3వ అతిపెద్ద సరఫరాదారుగా భారత్ అవతరించింది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 1981లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) నుండి అప్పు తీసుకుంది, కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం UNICEF సంస్థకు వస్తు సేవల రూపంలో సుమారు 6 బిలియన్ డాలర్ల సహాయం అందించింది.

ఫాక్ట్(నిజం): డిపార్ట్మెంట్ అఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 1981- 1984 మధ్య కాలంలో భారత దేశం IMF SDR 3.9 బిలియన్ రుణాన్ని పొందింది. 1981- 1984, 1991- 1993 మధ్య కాలంలో భారత దేశం IMF దగ్గర తీసుకున్న రుణాన్ని 31 మే 2000వ తేది కల్లా తీర్చేసింది. అంతేగాక, భారత్ 1993 తర్వాత IMF నుండి లోన్ తీసుకోలేదు. 11 అక్టోబర్ 2024న UNICEF జారీ చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, 2016 నుండి 2023 వరకు, భారతీయ సంస్థలు దాదాపు $6 బిలియన్ల విలువైన వస్తువులు మరియు సేవలను UNICEFకు సరఫరా చేశాయి. దీనితో 2023లో భారతదేశం మూడవ అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది. అయితే వీటిని UNICEF ఉచితంగా పొందలేదు. UNICEF భారతదేశం/భారతీయ సంస్థలు నుంచి 2014 కంటే చాలా ముందు నుండే వస్తువులు మరియు సేవలను పొందుతుంది. ఇదే విషయం UNICEF యొక్క వివిధ సంవత్సరాల సప్లైస్ యొక్క వార్షిక నివేదికలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

1981 IMF రుణం:

ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ అఫ్ ఎకనామిక్ అఫైర్స్ వారి సమాచారం ప్రకారం 1981- 1984 మధ్య కాలంలో భారత దేశం IMF SDR 3.9 బిలియన్ రుణాన్ని పొందింది. ఇంకా 1991- 1993 మధ్య కాలంలో SDR 3.56 బిలియన్ రుణాన్ని కూడా పొందింది. ఇదే సమాచారం IMF వెబ్సైటులో కూడా చూడవచ్చు. ఐతే డిపార్ట్మెంట్ అఫ్ ఎకనామిక్ అఫైర్స్ ప్రకారం 31 మే 2000వ తేది కల్లా ఈ రుణాన్ని మొత్తం భారత దేశం తీర్చేసింది. అంతేగాక, భారత్ 1993 తర్వాత IMF నుండి లోన్ తీసుకోలేదు, దీని తరవాత నుండి భారత దేశం IMFలో కంట్రిబ్యూటర్ గా మారింది. IMF దగ్గర భారత ప్రభుత్వం ఇప్పటి వరకు పొందిన రుణాల గురించిన సమాచారం ఇక్కడ చూడొచ్చు. వివిధ సంవత్సరాలలో భారత దేశం IMF దగ్గర పొందిన రుణాల సమాచారం IMF యొక్క వివిధ వార్షిక నివేదికలో చదవొచ్చు(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

భారతదేశం 2014 తర్వాత కూడా ప్రపంచ బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల నుండి రుణాలు తీసుకుంది. ఇదే విషయాన్ని 20 జూలై 2018న లోకసభలో అడిగిన ఒక ప్రశ్నకు అప్పటి కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి తన సమాధానంలో స్పష్టం చేశారు.

ఇంతకు ముందు కూడా ప్రపంచ బ్యాంకులో భారతదేశం అప్పులు మొత్తం తీర్చేసినట్టు కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు, వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ FACTLY రాసిన ఫాక్ట్-చెక్ కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చదవొచ్చు.

UNICEFకు ఆరోగ్యం మరియు రేషన్ మద్దతులో 3వ అతిపెద్ద సరఫరాదారుగా భారత్ అవతరించింది?

ఈ వైరల్ క్లెయింకు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, 11 అక్టోబర్ 2024న UNICEF జారీ చేసిన పత్రికా ప్రకటన లభించింది. ఈ ప్రకటన ప్రకారం, 2016 నుండి 2023 వరకు, భారతీయ సంస్థలు దాదాపు $6 బిలియన్ల విలువైన వస్తువులు మరియు సేవలను UNICEFకు దాని ప్రపంచ కార్యక్రమాల కోసం సరఫరా చేశాయి, దీనితో 2023లో భారతదేశం మూడవ అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆరోగ్యం మరియు పోషకాహార అవసరాలను తీర్చడానికి అవసరమైన వ్యాక్సిన్‌లు, ఫార్మాస్యూటికల్‌లు మరియు పోషకాహార సరఫరాలు ఉన్నాయి.

అయితే UNICEF భారతదేశం/భారతీయ సంస్థలు నుంచి చాలా కాలం నుండే అనగా 2014 కంటే చాలా ముందు నుండే వస్తువులు మరియు సేవలను పొందుతోంది. ఇదే విషయం UNICEF యొక్క వివిధ సంవత్సరాల సప్లైస్ (సామాగ్రి సేకరణ) యొక్క వార్షిక నివేదికలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది (ఇక్కడ). ఈ నివేదికలలో UNICEF వివిధ దేశాల నుండి సేకరించిన సరఫరా మరియు సేవల విలువలను ప్రచురిస్తుంది. 2013 సంవత్సరానికి గాను UNICEF విడుదల చేసిన వార్షిక సప్లై(SUPPLY)  నివేదికను పరిశీలిస్తే, 2013లో, UNICEF భారతదేశం/భారతీయ సంస్థల నుండి సుమారు $676 మిలియన్ల విలువైన సరఫరాలు మరియు సేవలను పొందింది. అలాగే, 2008లో UNICEF విడుదల చేసిన వార్షిక సప్లై(SUPPLY) నివేదికను పరిశీలిస్తే, 2008లో UNICEF భారతదేశం/భారతీయ సంస్థల నుండి సుమారు $295 మిలియన్ల విలువైన సరఫరాలు మరియు సేవలను పొందింది. 2000 సంవత్సరంలో UNICEF విడుదల చేసిన వార్షిక సప్లై(SUPPLY) నివేదికను పరిశీలిస్తే, 2000లో UNICEF భారతదేశం/భారతీయ సంస్థల నుండి సుమారు $81.92 మిలియన్ల విలువైన సరఫరాలు మరియు సేవలను పొందింది. ఈ నివేదికలు కేవలం UNICEF వివిధ దేశాల నుండి సేకరించిన సరఫరా మరియు సేవల విలువలను తెలియజేస్తుంది. అంటే ఆయా దేశాలు UNICEFకు అంత మొత్తంలో ఉచిత సహాయం అందించినట్లు కాదు.

చివరగా, భారత్ 1993 తర్వాత IMF నుండి లోన్ తీసుకోలేదు. UNICEF భారతీయ సంస్థల నుండి ఎన్నో ఏళ్లుగా వస్తువులు, సేవలను పొందుతోంది, వీటిని UNICEF ఉచితంగా పొందలేదు.

Share.

About Author

Comments are closed.

scroll