సినీనటుడు, జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పేరు గల ఇతర అభ్యర్ధులను వైఎస్సార్సీపీ పోటిలో పెట్టింది అని చెప్తూ ఉన్న పోస్ట్ (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పేరుతో జనసేన అధ్యక్షుడు కాకుండా ఇతర అభ్యర్ధులు కూడా పోటీ చేస్తున్నారు .
ఫాక్ట్(నిజం): 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి మొత్తం 23 మంది అభ్యర్ధులు 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్లలో రెండు నామినేషన్లను ఎలక్షన్ కమిషన్ నామినేషన్ల పరిశీలనలో తిరస్కరించింది. ఈ నామినేషన్లు పరిశీలించగా పవన్ కళ్యాణ్ పేరుతో జనసేన అధ్యక్షుడు మాత్రమే పోటీ చేస్తున్నట్లు, ఆయన 04 సెట్ల నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా వెలువరిచిన 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల మరియు 2024 లోక్సభ నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని అన్ని అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులు నామినేషన్ల దాఖలు చేయడానికి 25 ఏప్రిల్ 2024 చివరి తేది. నామినేషన్ల పరిశీలన చివర తేది 26 ఏప్రిల్ 2024 , నామినేషన్ల ఉపసంహరణ చివర తేది 29 ఏప్రిల్ 2024. అలాగే ఏపీలోని అన్నీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు 13 మే 2024న పోలింగ్ జరగనుంది.
వైరల్ పోస్టులో తెలిపినట్టుగా, 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పేరుతో జనసేన అధ్యక్షుడు కాకుండా అదే పేరు గల ఇతర అభ్యర్ధులు కూడా పోటీలో ఉన్నారా? అనే సమాచారం కోసం మేము ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా వెబ్సైట్లో వెతకగా, పిఠాపురం నియోజకవర్గం నుంచి మొత్తం 23 మంది అభ్యర్ధులు 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది. ఈ నామినేషన్లలో రెండు నామినేషన్లను ఎలక్షన్ కమిషన్ నామినేషన్ల పరిశీలనలో తిరస్కరించినట్లు తెలిసింది. ఈ నామినేషన్లు పరిశీలించగా పవన్ కళ్యాణ్ పేరుతో జనసేన అధ్యక్షుడు మాత్రమే పోటీ చేస్తున్నట్లు, ఆయన 04 సెట్ల నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిసింది.

చివరగా, 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పేరుతో జనసేన అధ్యక్షుడు మాత్రమే పోటీ చేస్తున్నారు.