Fake News, Telugu
 

2023లో, ప్రొఫెసర్ సి. ఆర్. రావు 102 ఏళ్ల వయస్సులో స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ అవార్డుగా పరిగణించబడే ఇంటర్నేషల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డును అందుకున్నారు

0

ఇటీవలే, 2025 సంవత్సరానికి గానూ ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాలు (Nobel Prize) ప్రకటించబడ్డాయి. ఈ నేపథ్యంలో, “కర్ణాటక ప్రొఫెసర్‌ శ్రీ సి. రాధాకృష్ణ రావు 102 ఏళ్ల వయసులో నోబెల్ అవార్డు….. ఇప్పుడు, 102 ఏళ్ల వయసులో గణాంక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు”  అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్ర (స్టాటిస్టిక్స్) ప్రొఫెసర్ సి. రాధాకృష్ణ రావుకు 2025 సంవత్సరానికి గానూ గణాంక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

ఫాక్ట్(నిజం): 2023లో, ప్రపంచ ప్రఖ్యాత గణాంక శాస్త్ర నిపుణుడు, భారతీయ అమెరికన్ కల్యంపూడి రాధాకృష్ణరావు (సి. ఆర్. రావు) 102 ఏళ్ల సంవత్సరాల వయసులో స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ అవార్డుగా భావించే ఇంటర్నేషల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డును అందుకున్నారు. సి. ఆర్. రావు 22 ఆగస్టు 2023న మరణించారు. ఆయన భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ (1968), పద్మవిభూషణ్ (2001)లను కూడా అందుకున్నారు. నోబెల్ బహుమతిని గణాంక శాస్త్ర (స్టాటిస్టిక్స్) రంగంలో ఇవ్వరు. ప్రస్తుతం, నోబెల్ బహుమతులు కేవలం ఆరు విభాగాలలో మాత్రమే ఇవ్వబడుతున్నాయి: భౌతిక శాస్త్రం (ఫిజిక్స్), రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ), వైద్యశాస్త్రం (మెడిసిన్), సాహిత్యం (లిటరేచర్), శాంతి (పీస్), ఆర్థికశాస్త్రం (ఎకనమిక్స్). కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల, 2025 నోబెల్ బహుమతి విజేతలను 06 అక్టోబర్ 06 మరియు 13 అక్టోబర్ 2025 మధ్య ప్రకటించారు (ఇక్కడ, ఇక్కడ). భౌతిక శాస్త్రంలో, జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్. డెవోరెట్ & జాన్ ఎం. మార్టినిస్‌లకు; రసాయన శాస్త్రంలో, సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్ & ఒమర్ ఎం. యాఘికి; వైద్యశాస్త్రంలో, మేరీ ఇ. బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్ & షిమోన్ సకాగుచి; సాహిత్యం విభాగంలో లాస్జ్లో క్రాస్జ్నాహోర్కైకి, శాంతి విభాగంలో మరియా కొరినా మచాడోకు; ఆర్థిక శాస్త్ర విభాగంలో, జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్ & పీటర్ హోవిట్ లకు నోబెల్ బహుమతులను నోబెల్ కమిటీ ప్రకటించింది (ఇక్కడ , ఇక్కడ).

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నోబెల్ బహుమతిని గణాంక శాస్త్ర (స్టాటిస్టిక్స్) రంగంలో ఇవ్వరు. ప్రస్తుతం, నోబెల్ బహుమతులు కేవలం ఆరు విభాగాలలో మాత్రమే ఇవ్వబడుతున్నాయి: భౌతిక శాస్త్రం (ఫిజిక్స్), రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ), వైద్యశాస్త్రం (మెడిసిన్), సాహిత్యం (లిటరేచర్), శాంతి (పీస్), ఆర్థిక శాస్త్రం (ఎకనమిక్స్). 1901 నుంచి ప్రతి సంవత్సరం భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యం, శాంతి, అనే ఐదు రంగాల్లో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు అత్యున్నత నోబెల్ బహుమతులు అందజేస్తున్నారు. అలాగే, 1969 నుంచి నోబెల్ గౌరవార్థం బ్యాంక్ ఆఫ్ స్వీడెన్ సౌజన్యంతో ఆర్థిక శాస్త్రం (ఎకనమిక్స్)లో కూడా నోబెల్ బహుమతి ప్రకటిస్తున్నారు (1968 లో చేర్చి, 1969 నుండి ప్రకటిస్తున్నారు).

అయితే, 2023లో, ప్రపంచ ప్రఖ్యాత గణాంక శాస్త్ర నిపుణుడు, భారతీయ అమెరికన్ కల్యంపూడి రాధాకృష్ణరావు (సి. ఆర్. రావు) 102 ఏళ్ల సంవత్సరాల వయసులో స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ అవార్డుగా భావించే ఇంటర్నేషల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డును అందుకున్నారు (ఇక్కడఇక్కడఇక్కడ, & ఇక్కడ).

ప్రొఫెసర్ సి.ఆర్.రావు 10 సెప్టెంబర్ 1920న  కర్ణాటకలోని బళ్లారి జిల్లా హడగళిలోని తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలలో చదువుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా యూనివర్సిటీలో ఎంఏ స్టాటిస్టిక్స్ చేశారు, 1948లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కళాశాల నుండి పిహెచ్‌డి పూర్తి చేశారు. సి.ఆర్.రావు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేశారు. పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడి, అక్కడ  పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలలో మరో 25 సంవత్సరాలు పనిచేశారు. ఆయన భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ (1968), పద్మవిభూషణ్ (2001)లను కూడా అందుకున్నారు. సి.ఆర్.రావు (102) 22 ఆగస్టు 2023న మరణించారు (ఇక్కడఇక్కడఇక్కడ, & ఇక్కడ).

చివరగా, 2023లో, భారతీయ అమెరికన్ కల్యంపూడి రాధాకృష్ణరావు (సి. ఆర్. రావు) 102 ఏళ్ల వయస్సులో స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ అవార్డుగా పరిగణించబడే ఇంటర్నేషల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డును అందుకున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll