Fake News, Telugu
 

ఇద్దరు ముస్లిం తల్లిదండ్రులు తమ సొంత పిల్లలను వివాహం చేసుకున్న దృశ్యాలని చెప్తూ, ఖురాన్ పఠన వేడుకలకు సంబంధించిన ఫోటోలను తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఒక వ్యక్తి ఒక బాలిక, తమ మెడలో మాలలు వేసుకున్న ఫోటో, ఒక మహిళ ఒక బాలుడితో కలిసి దిగిన ఫోటో (వీళ్ళ మెడలో పూల మాలలు ఉన్నాయి) ఉన్న కొల్లాజ్ (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి, తన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడని, అలా చేసినందుకు కోపం వచ్చి తన భార్య వారి కొడుకుని పెళ్లి చేసుకుంది అని చెప్తూ దీన్ని షేర్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఒక ముస్లిం జంట తమ సొంత పిల్లలను వివాహం చేసుకున్నప్పుడు తీసిన ఫోటోలు.

ఫ్యాక్ట్(నిజం): ఈ ఫోటోలు హఫీజ్-ఎ-ఖురాన్ అనే ఖురాన్ పఠనం వేడుకలకు సంబంధించినవి, వివాహ వేడుకలకు సంబంధించినవి కావు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఫోటో 1:

ఒక అమ్మాయితో కలిసి ఒక వ్యక్తి దిగిన ఈ ఫోటో కనీసం ఫిబ్రవరి 2016 నుండి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోటోను ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేసి చూడగా, మాకు కొన్ని పాత సోషల్ మీడియా పోస్ట్‌లు లభించాయి. ఒక తండ్రి, తన కుమార్తె ఒకేసారి హఫీజ్-ఎ-ఖురాన్ అయ్యారని (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) క్లెయిమ్ చేస్తూ ఈ ఫోటోలను ఈ పోస్టులలో షేర్ చేశారు (ఆర్కైవ్ లింక్).

ఇస్లామిక్ చర్చా పోర్టల్ అయిన ఇస్లామిక్ బోర్డ్ కూడా 2016 లో ఇలాంటి వివరణతో ఈ చిత్రాన్ని పంచుకుంది.

ఫోటో 2:

ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, ఈ ఫోటో కనీసం జనవరి 2020 నుండి ఇంటర్నెట్‌లో ఉందని మాకు తెలిసింది. 2020 నాటి ఒక పాత సోషల్ మీడియా పోస్టులో(ఆర్కైవ్ లింక్) ఉన్న వివరణ ప్రకారం, ఈ ఫోటోలో ఉన్నది తల్లి కొడుకులు. తన కొడుకు ఖురాన్ పఠనం వేడుక సందర్భంగా ఈ మహిళ, ఆమె కొడుకు కలిసి దిగిన ఫోటో ఇది. పోస్ట్ యొక్క ఉర్దూ వివరణను తెలుగులోకి తర్జుమా చేసి చూస్తే ‘ఈరోజు నా కొడుకు యొక్క ఖత్మ-ఉల్- ఖురాన్, వారి అభినందనలను పంచుకుని, దీన్ని ఎవరు షేర్ చేస్తారు?‘ అని అర్థం అని మాకు తెలిసింది.

ఆ తర్వాత, ఇదే ఫోటోను ఫిబ్రవరి 2020లో షేర్ చేస్తూ, తన భర్త చనిపోయిన తర్వాత, సౌదీలోని ఒక మహిళ తన సొంత కొడుకుని వివాహం చేసుకున్న దృశ్యాలని చెప్తూ కొందరు క్లెయిమ్ చేశారని మేము కనుగొన్నాము.   

ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం, తన భర్త తన కుమార్తెను వివాహం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఒక మహిళ  తన సొంత కొడుకును వివాహం చేసుకున్న సంఘటనకు చెందిన దృశ్యాలను ఈ ఫోటో చూపిస్తుంది. 

అంటే, గత కొన్ని సంవత్సరాలుగా, ఈ ఫోటోను వివిధ క్లెయిములతో సోషల్ మీడియా యూజర్లు ప్రచారం చేస్తూ వస్తున్నారని మనకు దీనిబట్టి అర్థం అవుతుంది.

అయితే, ఈ వాదనల్లో నిజం లేదు. ఇంటర్నెట్‌లో ఈ రెండు ఫోటోలు వేరు వేరు సమయాల్లో వేరు వేరు వ్యక్తుల ద్వారా అప్లోడ్ చేయబడ్డాయి. ఇది, ఈ రెండిటికి ఎటువంటి సంబంధం లేదు అని సూచిస్తుంది.

హఫీజ్-ఎ-ఖురాన్:

సాధారణంగా, హఫీజ్ అనేది ఖురాన్‌ను కంఠస్థం చేసే వ్యక్తులకు ఇచ్చే ఒక శీర్షిక. కాలిన్స్ డిక్షనరీ ప్రకారం హఫీజ్ అనే పదానికి అర్థం ‘ఖురాన్‌ను గుర్తుంచుకుని కంఠతా చేయడం వచ్చిన వ్యక్తికి ఇచ్చే ఒక శీర్షిక ‘అని. హఫీజ్-ఎ-ఖురాన్ అనేది ముస్లిం సమాజంలో ఒక ప్రసిద్ధ మతపరమైన వేడుక. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను గతంలో షేర్ చేశారు.

వైరల్ ఫోటోలలో ఉన్న వ్యక్తుల గుర్తింపును లేదా వారు ఎక్కడి వారు అనే విషయాలను మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ, పైన పేర్కొన్న వివరణ ప్రకారం ఈ వైరల్ ఫోటోలు ఒక ఖురాన్ పఠనం వేడుకకు సంబంధించినవి, తల్లిదండ్రులు తమ సొంత పిల్లలను వివాహం చేసుకున్న సంఘటనకు చెందినవి కావని మనకు అర్థం అవుతుంది.

చివరగా, ఖురాన్ పఠనం వేడుకలకు సంబంధించిన రెండు సంబంధం లేని ఫోటోలను, ముస్లిం తల్లిదండ్రులు తమ సొంత పిల్లలను వివాహం చేసుకున్న దృశ్యాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll