పూరీ, ఐస్ క్రీం, పండ్లు, పనీర్, మిల్క్ షేక్ మొదలైన ఆహార పదార్థాలు ఉన్న ప్లేట్‌ని పట్టుకుని ఉన్న ఒక పాఠశాల విద్యార్థి ఫోటో సోషల్ మీడియాలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్ధులకు ఇస్తున్న ఆహార పదార్థాలు అని షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: మధ్యాహ్న భోజన పథకం కింద ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో వడ్డించే ఆహార పదార్థాల ఫోటో.
ఫ్యాక్ట్ (నిజం): మధ్యాహ్న భోజన పథకం యొక్క ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటులో ఇచ్చిన మెనూలో ఫొటోలో ఉన్న పదార్థాలు లేవు. నవభారత్ టైమ్స్ కథనం ప్రకారం, గ్రామ సర్పంచ్ అమిత్ మరియు స్కూల్ టీచర్లు కలిసి దాతల సహకారంతో కొన్ని సందర్భాలలో విద్యార్ధులకు ప్రత్యేక విందుని ఏర్పాటు చేస్తారు. 30 ఆగస్టు 2022 నాడు ఏర్పాటు చేసిన విందులో భాగంగా వైరల్ అవుతున్న ఫొటోలోని పదార్ధాలకు విద్యార్ధులకు వడ్డించినట్లు, అమిత్ ఫేస్బుక్ పోస్టు ద్వారా స్పష్టం చేశారు. కావున, ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఫోటోలోని బ్యాక్‌గ్రౌండ్ గమనించగా అది,” ప్రాథమిక పాఠశాల, మలక్ పురా. జిల్లా- జలౌన్” అని తెలిసింది. అయితే, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారిక మధ్యాహ్న భోజన వెబ్‌సైట్‌లోని మెనూలో ఇచ్చిన పదార్థాల లిస్ట్ ఫొటోలో కనిపించే పదార్థాలు భిన్నంగా ఉన్నాయి.
సంబంధిత కీవర్డ్లతో ఇంటర్నెట్లో వెతకగా ఇదే విషయంపై 01 సెప్టెంబర్ 2022న నవభారత్ టైమ్స్ ప్రచురించిన ఒక కథనం లభించింది.
ఈ కథనం ప్రకారం, ఉత్తర ప్రదేశ్‌లోని మలక్‌పురాలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాధారణంగా పెట్టే మధ్యాహ్న భోజనంతో పాటు, పన్నీర్, పూరీ, రసగుల్లా, స్వీట్లు, ఖీర్, ఐస్ క్రీమ్, పండ్లు మొదలైన పదార్ధాలను కూడా దాతల పుట్టినరోజులు మరియు ఎంపిక చేసిన సందర్భాలలో వడ్డిస్తారు. ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ అమిత్, దాతల సమిష్టి కృషి వల్ల ఇది సాధ్యమైంది. మలక్‌పురా మరియు గులాబ్‌పురా పాఠశాలలో సుమారు 90 మంది విద్యార్థులు ఇటువంటి ఆహారాన్ని అందిస్తున్నారని అమిత్ చెప్పారు. వైరల్ అవుతున్న ఫోటో గురించి గ్రామ సర్పంచ్ యొక్క ఫేస్ బుక్ పోస్టును ఇక్కడ చూడవచ్చు.
“మలక్‌పురా గ్రామ పంచాయత్‌కు చెందిన స్కూల్ ఫొటోలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు విద్యార్ధులకు ఇచ్చిన విందుకు సంబంధించినవి. ఈ కార్యక్రమం మా గ్రామంలో జులై 2022 నుంచి జరుగుతుంది. . ముందుగా ప్రారంభించిన యాడ్-ఆన్ మధ్యాహ్న భోజన కార్యక్రమం 14 ఫిబ్రవరి 2022 నుండి కొనసాగుతుంది. ఇది పూర్తిగా పారదర్శకమైన ప్రక్రియ. బహుశా రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమం మొదట మన పాఠశాలల్లో అమలు అవుతుంది. ఇదంతా ప్రజల సహకారంతోనే సాధ్యం” అని తన పోస్టులో అమిత్ పేర్కొన్నారు. 31 ఆగస్టు 2022 న అమిత్ చేసిన అసలు పోస్టును ఇక్కడ చూడవచ్చు.
“జన్మదిన శుభాకాంక్షలు సౌరభ్ భయ్యా” అని రాసి ఉన్న బోర్డును విద్యార్థులు పట్టుకున్న ఫోటోను కూడా ఇక్కడ చూడవచ్చు. ఆరోజు సౌరభ్ అనే దాత పుట్టినరోజు.
అమిత్ ఫేస్బుక్ టైమ్-లైన్ లో ఇటువంటి సందర్భాలకు చెందిన మరిన్ని ఫొటోలను మేము కనుగొన్నాము. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు
చివరిగా, వైరల్ అవుతున్న ఫొటోలోని ఆహార పదార్థాలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మధ్యాన్న భోజన పథకం కింద ఏర్పాటు చేయలేదు. గ్రామ సర్పంచ్ మరియు టీచర్లు కలిసి దాతల సహకారంతో కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఈ విందుని ఏర్పాటు చేస్తున్నారు.