Fake News, Telugu
 

రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మను పోలీసులు బస్సులో తరలిస్తున్న ఫోటోను ఆయన ఒక సామాన్యుడిలా బస్సులో ప్రయాణించిన ఫోటో అంటూ షేర్ చేస్తున్నారు

0

మూడు నెలల క్రితం బస్సులో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ఒక సామాన్యుడిలా ప్రయాణించిన భజన్‌లాల్ శర్మ నేడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అయ్యాడు అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఒక సామాన్యుడిలా బస్సులో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణించిన ఫోటో.

ఫాక్ట్(నిజం): ఆగస్ట్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైపూర్‌లో బీజేపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న భజన్‌లాల్ శర్మను పోలీసులు అరెస్ట్ చేసి తరలించిన సందర్భంలో తీసిన ఫోటో ఇది. భజన్‌లాల్ శర్మ ఈ నిరసనలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటో మూడు నెలల క్రితందే అయినప్పటికీ, సోషల్ మీడియాలో క్లెయిమ్ చేస్తున్నట్టు ఈ ఫోటో భజన్‌లాల్ శర్మ ఒక సామాన్యుడిలా ప్రయాణించిన సందర్భంలో తీసింది కాదు. ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న భజన్‌లాల్ శర్మను పోలీసులు అరెస్ట్ చేసి బస్సులో తరలించిన సందర్భంలో తీసిన ఫోటో ఇది.

ఈ ఫోటోకు సంబంధించి మరింత సమాచారం కోసం వెతికే క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రకటించినప్పటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భజన్‌లాల్ శర్మ ఫోటోలను రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటో ఒక నిరసన కార్యక్రమంలో భజన్‌లాల్ శర్మ పాల్గొన్నప్పటిదని స్పష్టం చేసారు.

ఈ కథనంలో చెప్తున్నదాని ఆధారంగా భజన్‌లాల్ శర్మ సోషల్ మీడియా అకౌంట్లలో వెతకగా, పై కథనంలో పేర్కొన్నట్టు భజన్‌లాల్ శర్మ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు కనిపించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ ఫోటోలు మరియు ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటో ఒకే సందర్భానికి సంబంధించినవి, ఎందుకంటే వైరల్ ఫోటోలో భజన్‌లాల్ శర్మ వెనకాల నీలి రంగు కుర్తాలో ఉన్న వ్యక్తిని ఈ ఫోటోలలో కూడా చూడవచ్చు.

ఐతే ఈ ఫోటోలను షేర్ చేస్తూ భజన్‌లాల్ శర్మ అందించిన వివరాల ప్రకారం, ఈ ఫోటోలు ఆగస్ట్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిర్వహించిన ‘నహీసాహెగ రాజస్థాన్’ అనే నిరసన కార్యక్రమానికి సంబంధించింది. రాజస్థాన్ బీజేపీ యూనిట్ నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమాన్ని వారు తమ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసారు. ఈ వీడియోలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. ఈ నిరసనను రిపోర్ట్ చేసిన వార్తా కథనం ఇక్కడ చూడవచ్చు. దీన్నిబట్టి  భజన్‌లాల్ శర్మ నిరసనలో పాల్గొన్న ఫోటోను అతను సామాన్యుడిలా ప్రయాణించాడని తప్పుగా షేర్ చేసినట్టు స్పష్టమవుతుంది.

చివరగా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మను పోలీసులు బస్సులో తరలిస్తున్న ఫోటోను ఆయన ఒక సామాన్యుడిలా బస్సులో ప్రయాణించిన ఫోటో అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll