Fake News, Telugu
 

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ 50% రాయితీతో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించే అవకాశాన్ని కల్పిస్తూ గోషామహల్‌లో ఎటువంటి లోక్ అదాలత్ నిర్వహించట్లేదు

0

దసరా పండగ సందర్భంగా 50% రాయితీతో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించే ఆఫర్ ఒకటి హైదరాబాద్ పోలీస్ ప్రవేశపెట్టిందని, అక్టోబర్ 4 నుంచి 7వ తేదీ గోషామహల్ స్టేడియంలో నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా ఈ ఆఫర్ కింద పెండింగ్ చలాన్లను చెల్లించొచ్చని చెప్తున ఒక న్యూస్ పేపర్ క్లిప్ ని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్  అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దసరా పండగ సందర్భంగా 50% రాయితీతో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించే అవకాశాన్ని హైదరాబాద్ పోలీస్ కల్పిస్తోంది.

ఫాక్ట్ (నిజం): ప్రస్తుతం (అక్టోబర్ 4-7, 2021) హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ 50% రాయితీతో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించే అవకాశాన్ని కల్పిస్తూ గోషామహల్‌లో ఎటువంటి లోక్ అదాలత్ నిర్వహించట్లేదు. ఇదే విషయం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్పష్టం చేసింది. ఈ వివరణను పలు వార్తా సంస్థలు ప్రచురించాయి కూడా. ఐతే గతంలో పలు సందర్భాలలో హైదరాబాద్ పోలీస్ ఇలాంటి ఒక ఆఫర్ ఇస్తూ లోక్ అదాలత్ నిర్వహించినప్పటికీ ప్రస్తుతం అటువంటి కార్యక్రమం ఏది కూడా నిర్వహించట్లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ రోజు (04 సెప్టెంబర్ 2021) ఈనాడు పేపర్‌లోని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎడిషన్‌లో ఇలాంటి వార్తే ఒకటి ప్రచురితమైంది, ఈ నేపథ్యంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యుండవచ్చు. ఐతే ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ ఈ విషయానికి సంబంధించి వివరణ ఇస్తూ ‘అక్టోబర్ 4-7 మధ్యలో ట్రాఫిక్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్న ఈ వార్తలో నిజంలేదని, ప్రజలు ఈ వార్తని నమ్మవద్దని, ఈ ఫేక్ వార్తని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేదా ఫార్వార్డ్ చేసినా, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని’ ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసారు.

హైదరాబాద్ పోలీస్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వైరల్ అయిన ఈనాడు క్లిప్‌ని షేర్ చేసి, ఈ వార్త ఫేక్ అని స్పష్టం చేసారు.

ఐతే, గతంలో పలు సందర్భాలలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఇలాంటి లోక్ అదాలత్‌లను నిర్వహించింది. 2016లో మరియు 2017లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ గోషామహల్‌లో లోక్ అదాలత్ నిర్వహించి, 50% రాయితీతో పెండింగ్చె చలాన్లు చెల్లించే అవకాశం కల్పించింది.

ఇదే వివరాలతో ఇప్పుడు కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అదే సదుపాయాన్ని కల్పిస్తునట్టు వార్త వైరల్ అవుతోంది కానీ ప్రస్తుతానికి తాము అటువంటి లోక్ అదాలత్ ఏది కూడా నిర్వహించట్లేదని హైదరాబాద్ పోలీస్ స్పష్టం చేయడంతో ఈ వార్తలో నిజం లేదని అర్ధం చేసుకోవచ్చు. పోలీస్ వివరణను పలు వార్తా సంస్థలు ప్రచురిస్తూ రాసిన కథనాలు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ 50% రాయితీతో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించే అవకాశాన్ని కల్పిస్తూ గోషామహల్‌లో ఎటువంటి లోక్ అదాలత్ నిర్వహించట్లేదు.

Share.

About Author

Comments are closed.

scroll