Fake News, Telugu
 

హైదరాబాద్ ఆలయంలో జరిగిన వేడుక వీడియోను 100 కోట్ల ఖర్చుతో అలంకరించిన మధ్యప్రదేశ్ లోని లక్ష్మి దేవి ఆలయం అని షేర్ చేస్తున్నారు

0

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లాలో లక్ష్మి పూజ సందర్బంగా 100 కోట్లు ఖర్చు చేసి అలంకరించిన లక్ష్మి దేవి ఆలయం, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: లక్ష్మి పూజ సందర్బంగా 100 కోట్లు ఖర్చు చేసి అలంకరించిన మధ్యప్రదేశ్ లోని లక్ష్మి దేవి ఆలయం వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో లోని ఆ అలంకరణతో ఉన్న దేవాలయం హైదరాబాద్ లోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయం అని విశ్లేషణలో తెలిసింది. వైకుంఠ ఏకాదశి పండగ సందర్బంగా ఆలయాన్ని ఇలా అలంకరించారు. పోస్టులో చూపిస్తున్న ఆ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షోట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియో ఒక యూట్యూబ్ ఛానల్లో దొరికింది. అలంకరించబడి ఉన్న వీడియో లోని ఆ ఆలయం హైదరాబాద్ లోని శ్రీ రంగనాధ స్వామి దేవాలయం అని వివరణలో తెలిపారు. వైకుంఠ ఏకాదశి పండగ సందర్భంగా ఆలయాన్ని ఇలా అలంకరించారు అని అందులో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా మరింత అధికారిక సమాచారం కోసం వెతకగా, పోస్టులోని అవే దృశ్యాలతో కూడిన వీడియో ‘ETV Telangana’ న్యూస్ ఛానల్ వారు ‘6 జనవరి 2020’ నాడు తమ అధికారిక యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేసిన వీడియో లభించింది. జియాగూడలోని శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో జరుపుకున్న వైకుంఠ ఏకాదశి వేడుకలకి సంబంధించిన వీడియో అని అందులో తెలిపారు.

జియాగూడలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి వేడుకను చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. రంగనాథ స్వామి ఆలయంలో చేసిన ఆ వేడుకలకు సంబంధించిన పాత వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, హైదరాబాద్ లోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయాన్ని చూపిస్తూ 100 కోట్ల ఖర్చుతో అలంకరించిన మధ్యప్రదేశ్ లోని లక్ష్మి దేవి ఆలయం అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll