Fake News, Telugu
 

‘కూల్ డ్రింక్స్ ఎబోలా వైరస్ తో కలుషితం అయ్యాయి. కొద్ది రోజులు తాగవద్దు’ అని హైదరాబాద్ పోలీసులు చెప్పలేదు.

0

కూల్ డ్రింక్స్ తయారు చేసే కంపెనీ లో పనిచేసే ఒక కార్మికుడు కూల్ డ్రింక్స్ ని ఎబోలా వైరస్ తో కలుషితం చేసాడని, కావున కొద్ది రోజుల పాటు కూల్ డ్రింక్స్ తాగవద్దని హైదరబాద్ పోలీసులు తెలిపారని చెప్తూ, కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్ (దావా): కూల్ డ్రింక్స్ ఎబోలా వైరస్ తో కలుషితం అవ్వడంతో వాటిని కొద్ది రోజులు తాగవద్దని చెప్పిన హైదరాబాద్ పోలీసులు. కూల్ డ్రింక్స్ తాగి అస్వస్థకు గురైన ప్రజల ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చెప్పినట్టు కూల్ డ్రింక్స్ ఎబోలా వైరస్ తో కలుషితం అయినట్టు గానీ, కొద్ది రోజులు కూల్ డ్రింక్స్ తాగవద్దని గానీ హైదరాబాద్ పోలీసులు చెప్పలేదు. 2019 లో ఇదే మెసేజ్ వైరల్ అయినప్పుడు, అది ఒక ‘ఫేక్ న్యూస్’ అని హైదరాబాద్ పోలీసు వారు ట్వీట్ చేసారు. అంతేకాదు, పోస్ట్ లోని ఫోటోలు వివిధ సందర్భాలకు సంబంధించినవి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చాలా ఫోటోలు ఉన్నాయి. ఒక్కో ఫోటో ఎక్కడ తీసారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

ఫోటో 1:
ఈ ఫోటో ‘NDTV’ వారు 2014 లో ప్రచురించిన ఆర్టికల్ లో లభించింది. పాకిస్తాన్ లో బాంబు పేలుడు జరిగినప్పుడు తీసిన ఫోటో ఇది.

ఫోటో 2:
ఇది తెలంగాణలోని సూర్యాపేటలో ఒక కుటుంబం 2017 లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు తీసిన ఫోటో. ఆ ఘటనకి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

ఫోటో 3:
ఇదే ఫోటోని పెట్టి, ఆ ఫోటోలో ఉన్నది రోడ్డు ప్రమాదంలో మరణించినవారని 2018 లో యూపీ బీజేపీ ఎంపీ రేఖ వర్మ పోస్ట్ చేసింది.

ఫోటో 4 మరియు 5:
2020 మార్చిలో ఒక కారు నదిలో పడిపోవడం వల్ల ఈ ఫోటోల్లోని యువతి మరణించినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

ఫోటో 6 మరియు 7:
ఈ ఫోటోల్లోని యువకుడు నీళ్ళల్లో మునిగి చనిపోయాడని ఇక్కడ చదవొచ్చు.

ఫోటో 8 మరియు 9:
కూల్ డ్రింక్ బాటిల్స్ ఉన్న ఫోటో పాకిస్తాన్ కి చెందిందని FACTLY ఇంతకముందు వేరే సందర్భంలో రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవొచ్చు. కూల్ డ్రింక్ బాటిల్ లో పాము ఆకారంలో ఎదో కనిపిస్తున్న ఫోటో ఎక్కడిదో దొరకలేదు. అయితే, ఆ ఫోటో 2015 నుండి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది.


పోస్ట్ లోని ఫోటోలన్నీ వివిధ సందర్భాల్లో తీసినవి. అంతేకాదు, పోస్ట్ లోని మెసేజ్ 2019 లో వైరల్ అయినప్పుడు అది ఒక ‘ఫేక్ న్యూస్’ అని హైదరాబాద్ పోలీసు వారు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసారు. 

చివరగా, కూల్ డ్రింక్స్ ఎబోలా వైరస్ తో కలుషితం అవ్వడంతో వాటిని కొద్ది రోజులు తాగవద్దని హైదరాబాద్ పోలీసులు చెప్పలేదు. అది ఒక ఫేక్ న్యూస్.

Share.

About Author

Comments are closed.

scroll