Fake News, Telugu
 

హెల్ప్‌లైన్ నంబర్‘7837018555’ అనేది పంజాబ్‌లోని లూథియానా నగరంలో పోలీసులు రాత్రివేళ మహిళలకు కలిపిస్తున్న ‘ఫ్రీ రైడ్’ సదుపాయానికి సంబంధించినది, భారత దేశం మొత్తం ఈ సదుపాయం లేదు

0

ఇటీవల 09 ఆగస్ట్ 2024న కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఒక ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన నేపథ్యంలో, “రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఇంటికి/వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు వాహనం దొరకకపోతేవారు పోలీసు హెల్ప్‌లైన్ నంబర్‌లు 1091 లేదా 7837018555 లను సంప్రదించి వాహనం కోసం అభ్యర్థించవచ్చని, కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని PCR వాహనం/SHO వాహనం వచ్చి వారిని సురక్షితంగా వారి యొక్క గమ్యస్థానానికి తీసుకెళ్తాయిని, దేశవ్యాప్తంగా పోలీసులు మహిళల కోసం ఈ ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు” అని  క్లెయిమ్ చేస్తూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దేశవ్యాప్తంగా పోలీసులు రాత్రి పూట ప్రయాణించే మహిళల భద్రత కోసం ఒక ‘ఉచిత రైడ్’ స్కీమ్‌ ని ప్రారంభించారు. దాని హెల్ప్ లైన్ నంబర్లు 1091 మరియు 7837018555.

ఫాక్ట్(నిజం): 7837018555 హెల్ప్ లైన్ నెంబర్ పంజాబ్ లోని లుధియానాలో మహిళల భద్రత కోసం ప్రవేశ పెట్టిన ‘ఫ్రీ రైడ్’ స్కీంకి సంబంధించినది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లూథియానా నగరం  పరిధిలో ప్రయాణించే మహిళలు తమ ఇంటికి/గమ్యస్థానాలకు వెళ్లేందుకు వాహన దొరకకపోతే 1091 లేదా 783701855 లేదా 100కు కాల్ చేసి పోలీసుల సహాయం అభ్యర్థించవచ్చు. లూథియానా పోలీసులు ఈ స్కీంను 2019లో ప్రారంభించారు. 1091 అనేది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ద్వారా నిర్వహించబడే పాన్-ఇండియా ఉమెన్ హెల్ప్‌లైన్ నంబర్. ఈ నంబర్ కు ఆపదలో ఉన్న మహిళలు ఎవరైనా కాల్ చేసి సహాయం అభ్యర్థించవచ్చు. 1091 కాల్ చేస్తే మీరు ఉన్న రాష్ట్రంలోని ఉమెన్ సేఫ్టీ పోలీస్ వింగ్ కు మీ కాల్ ఫార్వార్డ్ చేయబడుతుంది. అలాగే పలు రాష్ట్రాలు కూడా రాత్రి పూట ప్రయాణించే మహిళల భద్రత కోసం ఇలాంటి  ‘ఉచిత రైడ్’ స్కీమ్‌ ని చేపట్టాయి. అయితే, ఇలాంటి స్కీం దేశవ్యాప్తంగా అమలులో లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ పోస్టులో పేర్కొన్నట్లు దేశవ్యాప్తంగాపోలీసులు రాత్రి పూట ప్రయాణించే మహిళల భద్రత కోసం ‘ఉచిత రైడ్’ స్కీమ్‌ ని ప్రారంభిస్తూ 1091, 7837018555 హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారా? అనే సమాచారం కోసం గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా పోస్టులో చెప్పిన హెల్ప్ లైన్ నెంబర్లు ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం లూథియానా పోలీసులు మహిళలు రాత్రివేళ  సురక్షితంగా ప్రయాణించేందుకు ‘ఉచిత రైడ్’ స్కీంను డిసెంబర్ 2019లో ప్రారంభించారని, ఎవరైనా మహిళ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణించేటప్పుడు తమ ఇంటికి చేరడానికి వాహనం దొరకకపోతే 1091, 112 లేదా, 783701855 హెల్ప్ లైన్ నెంబర్లకి డయల్ చేసి ఉచిత రైడ్ ని పొందవచ్చు అని తెలుస్తుంది.

పోస్టులో పేర్కొన్న7837018555 నంబర్ ప్రస్తుతం పనిచేస్తుందా?లేదా? అని కాల్ చేయగా, లూథియానా పోలీస్ కంట్రోల్ రూమ్ వారు స్పందిస్తూ, ఈ ఉచిత రైడ్ స్కీమ్‌ కేవలం లుధియానా నగరం పరిధిలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య  ఒంటరిగా ప్రయాణించే మహిళలు తమ ఇంటికి/మ్యస్థానాలకు వెళ్లేందుకు వాహన దొరకకపోతే 1091 లేదా 783701855 లేదా 112 లేదా 100కు కాల్ చేసి తమ సహాయం అభ్యర్థించవచ్చు అని తెలిపారు.

ఇకపోతే పోస్టులో పేర్కొన్న మరో నంబర్ 1091 నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ద్వారా నిర్వహించబడే పాన్-ఇండియా ఉమెన్ హెల్ప్‌లైన్ నంబర్. ఈ నంబర్ కు ఆపదలో ఉన్న మహిళలు ఎవరైనా కాల్ చేసి సహాయం అభ్యర్థించవచ్చు. 1091 కాల్ చేస్తే మీరు ఉన్న రాష్ట్రంలోని ఉమెన్ సేఫ్టీ పోలీస్ వింగ్ కు మీ కాల్ ఫార్వార్డ్ చేయబడుతుంది. తద్వారా సంబంధిత రాష్ట్ర పోలీసులు ఆపదలో ఉన్న మహిళలకు అవసరమైన సహాయాన్ని అందిస్తారు.

పలు రిపోర్ట్స్ ప్రకారం (ఇక్కడ, ఇక్కడ,  ఇక్కడ), ఇలాంటి ‘ఉచిత రైడ్’ స్కీమ్‌ ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా 2019లో ప్రకాశం జిల్లాలో మరియు జనవరి 2020లో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారని తెలుస్తుంది. ఈ స్కీంకు ప్రస్తుతం పని చేస్తుందా?లేదా? అని తెలుసుకోవడానికి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని సంప్రదించగా, ఈ స్కీం 2020 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉందని, ఎవరైనా మహిళలు తమ సహాయం కోసం 100, 112, 1091 లకు కాల్ చేయవచ్చని లేదా ఉమెన్ సేఫ్టీ యాప్ (దిశ యాప్)లో కూడా సంప్రదించవచ్చు అని వారు పేర్కొన్నారు.

ఇలాంటి ‘ఉచిత రైడ్’ స్కీమ్‌ ని మహారాష్ట్రలోని నాగపూర్ పోలీసులు కూడా డిసెంబర్ 2019లో ప్రారంభించారని తెలుస్తుంది. ఈ స్కీంకు ప్రస్తుతం పని చేస్తుందా?లేదా? అని తెలుసుకోవడానికి మేము నాగపూర్ పోలీసులను సంప్రదించగా, ఈ స్కీం కేవలం నాగపూర్ నగరం పరిధిలోనే అమలు అవుతుందని పేర్కొన్నారు, ఎవరైనా మహిళలు తమ సహాయం కోసం 100, 112, 1091,07122561103, 07122561222 లకు కాల్ చేయవచ్చు అని వారు పేర్కొన్నారు.

ఇకపోతే ఇలాంటి స్కీం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా?అని తెలుసుకోవడానికి తెలంగాణ పోలీసులను సంప్రదించగా, ఇలాంటి స్కీం ప్రత్యేంకంగా లేదని కాకపోతే ఆపదలో ఉన్న మహిళలు 100కు కాల్ చేస్తే తాము అవసరమైన ఎలాంటి సహాయమైనా అందిస్తామని వారు తెలిపారు. టీ-సేఫ్ (T-safe) యాప్ ను మహిళలలు ఇన్స్టాల్ చేసుకుంటే, లేదా 100కు డయల్ చేసి 8వ అంకె సెలెక్ట్ చేసిన మహిళలు యొక్క  జర్నీలను/ప్రయాణాలను పోలీసులు ట్రాక్ చేసి వారి ప్రయాణాలు సురక్షింతగా సాగేలా చూస్తాం అని తెలిపారు. దీనికి సంబంధించి తెలంగాణ పోలీసుల రూపొందించిన ఒక వాణిజ్య ప్రకటనను ఇక్కడ చూడవచ్చు. అలాగే, ఈ పోస్టు వైరల్ కాగా హైదరాబాద్ నగర పోలీసులు తమ అధికారిక X(ట్విట్టర్)లో స్పందిస్తూ, ఇలాంటి ఫ్రీ రైడ్ స్కేమ్ ఏది అమలులో లేదని స్పష్టం చేశారు.

గతంలో ఇవే నంబర్లను షేర్ చేస్తూ, కలకత్త పోలీసులు ఇలాంటి స్కీంనే ప్రవేశపెట్టారని వైరల్ అవ్వగా ఈ వార్తలో నిజంలేదని వారు తమ  సోషల్ మీడియా( ఫేస్బుక్, ట్విట్టర్) ఖాతాలలో పేర్కొన్నారు.

చివరగా,లూథియానా పోలీసులు రాత్రి వేళ  ప్రయాణించే  మహిళల రక్షణకై ప్రారంభించిన ఉచిత రైడ్ స్కీమ్‌ హెల్ప్ లైన్  నంబర్ (7837018555 ) దేశవ్యాప్తంగా పోలీసులు మహిళల కోసం ప్రారంభించిన ఉచిత రైడ్ స్కీమ్‌ హెల్ప్ లైన్ నంబర్ అంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు. 1091 అనేది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ద్వారా నిర్వహించబడే పాన్-ఇండియా ఉమెన్ హెల్ప్‌లైన్ నంబర్.

Share.

About Author

Comments are closed.

scroll