GST శ్లాబ్ రేట్లు కొనుగోలు చేసిన వస్తువుల బిల్ మొత్తం ఆధారంగా మారుతాయని, బిగ్ బజార్, డి-మార్ట్, స్పెన్సర్ మరియు ఇతర మాల్స్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు ప్రతి బిల్లును 1000 రూపాయలకు విడివిడిగా తీసుకోవాలని సూచిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని GST కౌన్సిల్ ఇటీవల పలు వస్తు సేవలకు సంబంధించి GST రేట్లను సవరణ చేసిన నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కొనుగోలు వస్తువుల బిల్ మొత్తం ఆధారంగా GST రేట్లు మారుతుంటాయి.
ఫాక్ట్ (నిజం): GST రేట్లు అనేవి కొనుగోలు చేసిన వస్తువు విభాగం ఆధారంగా మారుతూ ఉంటాయి. ఏ వస్తు సేవలపై ఎంత GST విధించాలనేది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని GST కౌన్సిల్ నిర్ణయిస్తుంది. GST రేట్లు కొనుగోలు చేసిన వస్తువుల బిల్ మొత్తం ఆధారంగా నిర్ణయించబడదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్లో వెతికితే, షాపింగ్ మాల్స్‌లో బిల్ మొత్తం ఆధారంగా GST రేట్లను విధిస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని డి-మార్ట్ సంస్థ 2017లో ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా స్పష్టం చేసినట్టు తెలిసింది. GST రేట్లు ప్రతి ఒక్క వస్తువుపై విధిస్తారని, కేంద్ర ప్రభుత్వంలోని టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు విధించిన నిబంధనల ప్రకారం ఈ వస్తువుల రేట్లను నిర్ణయిస్తారని డి-మార్ట్ తమ ఫేస్‌బుక్ పోస్టులో స్పష్టం చేసింది. GST రేట్లు బిల్ మొత్తం విలువ ఆధారంగా నిర్ణయించబడదని డి-మార్ట్ సంస్థ స్పష్టం చేసింది.
వస్తు సేవలపై దేశమంతా ఒకేలా విధించే పరోక్ష పన్నును వస్తు సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ – GST) అంటారు. ఆహారం, బట్టలు, ఎలక్ట్రానిక్స్, రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువులు, రవాణా, ప్రయాణం మొదలగు సేవలను కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులు తప్పనిసరిగా GST భరించవలిసి ఉంటుంది. మద్యం, పెట్రోలియం మొదలగు కొన్ని ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వం GST పరిధిలోకి తీసుకురాలేదు. 01 జూలై 2017 నాడు GST ప్రారంభమైనప్పటి నుండి ఇటువంటి అనేకమైన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. GST రేట్లు అనేవి ప్రతి వస్తువుకు, ఆ వస్తువు విభాగం ఆధారంగా నిర్ణయిస్తారు. కొనుగోలు చేసిన వస్తువుల బిల్ మొత్తం ఆధారంగా GSTని నిర్ణయించరు. ప్రస్తుతం వివిధ వస్తువుల మీద, సేవల మీద విధించే GST రేట్ వివరాలు కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైటులో చూడొచ్చు.
చివరగా, GST రేట్లు కొనుగోలు చేసిన వస్తువు లేదా సేవల విభాగం ఆధారంగా మారుతాయి, బిల్ మొత్తం ఆధారంగా GSTని నిర్ణయించరు.