Fake News, Telugu
 

భిక్షాటన చేసేవారికి డబ్బులు ఇవ్వడం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు

0

నగదు భిక్షాటన నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. బిచ్చగాళ్లకు ఆహారం ఇవ్వండి కానీ ఒక్క రూపాయి కూడా నగదు రూపంలో ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం సూచించిందని చెప్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఇలా చేయడం వల్ల రాష్ట్ర స్థాయిలో బిచ్చగాళ్ల ముఠాలు విడిపోతాయి, పిల్లల అపహరణ దానంతటదే ఆగిపోతుందని కూడా చెప్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:  నగదు భిక్షాటన నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఫాక్ట్(నిజం): నగదు భిక్షాటన నిలిపివేయాలని, భిక్షాటన చేసే వారికి డబ్బులు ఇవ్వొద్దని ప్రజలను కోరుతూ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. పలు స్వచ్ఛంద సంస్థలు ఇదే అంశాన్ని ప్రచారం చేస్తున్నాయి. బహుశా  సామాజిక కార్యకర్తలు నిర్వహిస్తున్న ఈ ఉద్యమాన్ని ప్రభుత్వ కార్యక్రమం అని తప్పుగా అనుకొని ఉండొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కేంద్ర ప్రభుత్వం ఇలా నగదు భిక్షాటన నిలిపివేయాలని, భిక్షాటన చేసే వారికి డబ్బులు ఇవ్వొద్దని ప్రజలను కోరుతూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేసి ఉంటె, మీడియా ఈ వార్తను రిపోర్ట్ చేసి ఉండేది, కానీ మాకు అలాంటి వార్తా కథనాలేవి కనిపించలేదు.

ఐతే గతంలో బెంగళూరులోని ఒక సామాజిక కార్యకర్త ఇలా భిక్షాటన చేసే వారికి డబ్బులు ఇవ్వొద్దన్న అన్న అంశంపై ప్రజలలో అవగాహనా కల్పిస్తూ  ప్రచారం  చేస్తున్నట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేశాయి. మరికొందరితో కలిసి ఇతను ‘బెంగళూర్ హుడుగారు’ అనే సంస్థ ద్వారా  ‘బెగ్గర్ ఫ్రీ భారత్’ అనే ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాడు.

మానవ అక్రమ రవాణా మరియు పిల్లల కిడ్నాప్‌లను అరికట్టాలంటే భిక్షాటన చేసేవారికి డబ్బులు ఇవ్వవద్దని కోరుతూ ఈ సంస్థ ప్రచారం చేస్తుంది. వివిధ ట్రాఫిక్ జంక్షన్లలో బిచ్చగాళ్లను మోహరించడం వెనుక ఒక మాఫియా ఉందని, బిచ్చగాళ్లకు డబ్బు ఇచ్చి ఈ మాఫియాను బలోపేతం చేయవద్దని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

ఈ సామజిక కార్యకర్త ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఇతను నిర్వహిస్తున్న ఈ ఉద్యమాన్ని కార్యక్రమాన్నీ మీడియా కూడా రిపోర్ట్ చేసింది. ఐతే ప్రభుత్వం మాత్రం ఇలాంటి పిలుపు ఇచ్చినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. బహుశా బెంగళూరు సామాజిక కార్యకర్త నిర్వహిస్తున్న ఈ ఉద్యమాన్ని ప్రభుత్వ కార్యక్రమం అని తప్పుగా అనుకొని ఉండొచ్చు.

చాలా రాష్ట్రాలలో భిక్షాటన నిర్వరించేందుకు చట్టాలు అమలులో ఉన్నాయి. కానీ ఈ చట్టాలు భిక్షాటన నివారించలేక పోతున్నాయి . ఈ చట్టాల అమలుకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు 2018లో ఢిల్లీ హైకోర్టు భిక్షాటనను నేరంగా పరిగణించవద్దని తీర్పును ఇచ్చింది. ప్రభుత్వం ప్రజలు బ్రతకడానికి కావలసిన కనీస అవసరాలను కూడా అందించలేకపోతుందని, అందుకే చాలా మంది భిక్షాటన చేస్తున్నారని  అభిప్రాయపడింది. ప్రభుత్వాలు ఈ సమస్య యొక్క మూలా కారణాలు వెతికి వాటిపై పని చేయాలనీ సూచించింది.

ఇదే అంశం మీద 2021లో సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భిక్షాటన అనేది పేదరికం మరియు సామాజిక-ఆర్థిక సమస్య అని చెబుతూ, COVID-19 మహమ్మారి మధ్య బహిరంగ ప్రదేశాలు మరియు వీధుల్లో భిక్షాటన చేయడాన్ని నిరోధించాలనే ప్రార్థనను సుప్రీంకోర్టు అప్పట్లో తిరస్కరించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది.

చివరగా, నగదు భిక్షాటన నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll