Fake News, Telugu
 

NRCపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, పోస్టులో ఇచ్చిన సమాచారం అవాస్తవం

0

ఆగస్టు 31న పౌరసత్వ సవరణ చట్టం, 2019 పై సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నాయి కాబట్టి దానికి మద్దతుగా బీజేపీ ఆధారాలు సేకరిస్తోందని, అందువలన 8866288662, 7766277742, 7272569933, 9977885467 నంబర్ల నుంచి ఫోన్ వస్తే తిరిగి చేయవద్దు అని, అలా చేసిన వారి పేరు నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ (NRC) లో చేర్చబడుతుందని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: 8866288662, 7766277742, 7272569933, 9977885467 నంబర్లకు మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్ళ పేర్లు నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ (NRC)లో చేర్చబడతాయి.

ఫాక్ట్: NRCపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మార్చి 2023లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం, 2019కి ప్రజల మద్దతును కోరుతూ 8866288662 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సిందిగా బీజేపీ కోరింది. అయితే, 8866288662 ప్రస్తుతం మనుగడలో లేదు. మిస్డ్ కాల్ ఇచ్చిన వారి పేరు NRCలో చేర్చబడుతుందని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. 7766277742, 7272569933 నెంబర్లు కూడా మనుగడలో లేవు. కావున పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పు.

ముందుగా ఇదే సారాంశంతో ఉన్న పోస్టులు జనవరి 2020 నుంచి ఎటువంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్లు గుర్తించాం. వైరల్ పోస్టులో ఇవ్వబడిన మొదటి నెంబర్ 8866288662గురించి ఇంటర్నెట్లో వెతకగా, 2019-20లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో నిరసనలు జరుగుతున్న నేపధ్యంలో అప్పటికే రాష్ట్రపతి ఆమోదం పొందిన ఈ చట్టానికి ప్రజల మద్దతును కోరుతూ 8866288662 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సిందిగా బీజేపీ కోరింది.

అయితే ఈ నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇచ్చే కార్యక్రమం ద్వారా కేవలం ఎంత మంది ప్రజల మద్దతు ఉందో తెలుస్తుంది కానీ మిస్డ్ కాల్ ఇచ్చిన వారి పేరు NRCలో చేర్చబడుతుందని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. అయితే ఈ నెంబర్ ప్రస్తుతం మనుగడలో లేదు.

పైగా, జనవరి 2020 నుంచి అమలులోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, 2019పై ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి నిబంధనలను రూపొందించలేదు. అలాగే, దేశవ్యాప్త NRCపై కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మార్చి 2023లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు స్పష్టం చేసింది.

ఇక పోస్టులో ఇవ్వబడిన 7766277742, 7272569933 నెంబర్లకుఫోన్ చేయగా అవి మనుగడలో లేవని తెలిసింది. 9977885467 నెంబర్‌కు ఫోన్ చేయగా ఎటువంటి స్పందన లేదు.

చివరిగా, పోస్టులో చెప్పబడిన లేదా వేరే ఏదైనా నంబర్లకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఎన్‌ఆర్‌సీలో పేరు నమోదు అవుతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll