Fake News, Telugu
 

మహాబల్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అస్సాం ప్రభుత్వం 3,000 బిఘాల భూమిని కేటాయించడంపై గౌహతి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది

0

“అస్సాం రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గౌహతి హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సిమెంట్‌ ఫ్యాక్టరీ కోసం అదానీ గ్రూపునకు 1860 ఎకరాల (3000 బిఘాలు) భూమిని అప్పగించాలని నిర్ణయించిన అస్సాం బీజేపీ సర్కారు తీరుపై షాక్‌కు గురైంది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు 3000 బిఘాల భూమిని కేటాయించడంపై గౌహతి హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఫాక్ట్(నిజం): అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు 3000 బిఘాల భూమిని కేటాయించడంపై గౌహతి హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు. షెడ్యూల్డ్ ప్రాంతంమైనా దిమా హసావో జిల్లాలో మహాబల్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అస్సాం ప్రభుత్వం 3,000 బిఘాల భూమిని కేటాయించడంపై గౌహతి హైకోర్టు 12 ఆగస్టు 2025న అసంతృప్తి వ్యక్తం చేసింది. అదానీ గ్రూప్‌కు మహాబల్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఎటువంటి సంబంధం లేదు. మహాబల్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీ JK లక్ష్మీ సిమెంట్/ Jk గ్రూపుకు చెందింది. అయితే, ఇదే దీమా హసావో జిల్లాలో అదానీకి చెందిన సిమెంట్ ప్లాంట్‌కు 9,000 బిఘాల భూమిని అప్పగించాలనే ప్రభుత్వం నిర్ణయంపై పలువురు షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ (NCST)ని ఆశ్రయించారని పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు 3000 బిఘాల భూమిని కేటాయించడంపై గౌహతి హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, అస్సాంలోని ఒక గిరిజన జిల్లాలో ప్రైవేట్ కంపెనీకి 3,000 బిఘాలు కేటాయించడంపై గౌహతి హైకోర్టు విచారణ చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేసిందని పలు మీడియా సంస్థలు ప్రచురించిన వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, షెడ్యూల్డ్ ప్రాంతంమైనా దిమా హసావో జిల్లాలో మహాబల్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అస్సాం ప్రభుత్వం 3,000 బిఘాల భూమిని కేటాయించడంపై గౌహతి హైకోర్టు 12 ఆగస్టు 2025న అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ కథనాల ప్రకారం, అక్టోబర్‌ 2025లో అస్సాం ప్రభుత్వం దిమా హసావో జిల్లాలో కోల్‌కతాకు చెందిన మహాబల్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కి 2,000 బిఘాల భూమిని కేటాయించింది. ఒక నెల తర్వాత, అనగా నవంబర్ 2025లో మరో 1,000 బిఘాలు కేటాయించింది. దిమా హసావో అస్సాంలోని గిరిజన మెజారిటీ కొండ జిల్లా, ఈ ప్రాంతం రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద నిబంధనల ద్వారా నిర్వహించబడుతుంది, దిమా హసావో జిల్లాలో పరిపాలన నార్త్ కాచర్ హిల్స్ అటానమస్ కౌన్సిల్ (NCHAC) అనే స్వయంప్రతిపత్తి మండలి ద్వారా నిర్వహించబడుతుంది.

ఈ భూ కేటాయింపుకు సంబంధించి గౌహతి హైకోర్టులో దాఖలు చేయబడిన రెండు పిటిషన్లను (WP(C)/467/2025, WP(C)/337/2025) 12 ఆగస్ట్ 2025న  విచారించిన జస్టిస్ సంజయ్ కుమార్ మేధితో కూడిన ధర్మాసనం, విచారణ సందర్భంగా, “3,000 బిఘాలు!… ఏం జరుగుతోంది? 3,000 బిఘాలు ఒక ప్రైవేట్ కంపెనీకి కేటాయించబడ్డాయి?… ఇది ఎలాంటి నిర్ణయం? ఇది ఏదో ఒక రకమైన జోకానా లేదా మరేదైనా? మీ అవసరం సమస్య కాదు…ప్రజా ప్రయోజనం సమస్య.” అని మౌఖికంగా వ్యాఖ్యానించారు. ఈ కేసు తదుపరి విచారణను 01 సెప్టెంబర్ 2025కి వాయిదా వేశారు. ఈ కేసులో 12 ఆగస్ట్ 2025న ఇచ్చిన తీర్పులో కానీ దాఖలైన రెండు పిటిషన్లలలో ఎక్కడ అదానీ గురించి ఎటువంటి ప్రస్తావనలేదు (ఇక్కడ, ఇక్కడ).

తదుపరి అదానీ గ్రూప్‌కు మహాబల్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఏదైనా సంబంధం ఉందా అని వెతకగా, మహాబల్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీ JK లక్ష్మీ సిమెంట్/ Jk గ్రూపుకు చెందిన కంపెనీ అని తెలిసింది. ఫిబ్రవరి 2024లో JK గ్రూప్‌కు చెందిన JK లక్ష్మీ సిమెంట్ మహాబల్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసింది.

అస్సాం ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు 3000 బిఘాల భూమిని కేటాయించిందనే వార్తలో నిజం లేదని, అదానీ గ్రూప్‌కు మహాబల్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఏ విధమైన సంబంధం లేదని పేర్కొంటూ అదానీ గ్రూప్ 18 ఆగస్టు 2025న ఒక మీడియా ప్రకటన విడుదల చేసింది.

ఫిబ్రవరి 2025లో జరిగిన అడ్వాంటేజ్ అస్సాం 2.0లో, అదానీ గ్రూప్ అస్సాంలో వివిధ రంగాలలో ₹50,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం జూలై 2025లో ₹10,000 కోట్ల పెట్టుబడి కోసం అంబుజా సిమెంట్స్ లిమిటెడ్‌తో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో దిమా హసావో జిల్లాలోని ఉమ్రాంగ్సోతో సహా హోజై, రంగియాలలో మూడు సిమెంట్ తయారీ యూనిట్ల స్థాపన కూడా ఉంది.

దీమా హసావో జిల్లాలోని ఉమ్రాంగ్సోలో అదానీకి చెందిన సిమెంట్ ప్లాంట్‌కు 9,000 బిఘాల భూమిని అప్పగించాలనే ప్రభుత్వం నిర్ణయంపై పలువురు షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ (NCST)ని ఆశ్రయించారని పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

చివరగా, షెడ్యూల్డ్ ప్రాంతంమైనా దిమా హసావో జిల్లాలో మహాబల్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అస్సాం ప్రభుత్వం 3,000 బిఘాల భూమిని కేటాయించడంపై గౌహతి హైకోర్టు 12 ఆగస్టు 2025న అసంతృప్తి వ్యక్తం చేసింది. అదానీ గ్రూప్‌కు మహాబల్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఎటువంటి సంబంధం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll