బీజేపీ ఎంపీ, ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ ‘పెట్రోల్‌పై వసూలు చేసే పన్నులలో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వాలకు 64% వాటా చెందుతుండగా, కేవలం 36% వాటా మత్రమే కేంద్రానికి చెందుతుందని’ అన్న వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పెట్రోల్‌పై వసూలు చేసే పన్నులలో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వాల వాటా 64% కాగా, కేవలం 36% వాటా మత్రమే కేంద్రానిది – బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా.
ఫాక్ట్ (నిజం): లీటర్ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో రూ. 32.9 వసూలు చేస్తుండగా, ఇందులో కేవలం కేవలం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే రూ. 1.40 మాత్రమే డివిజబుల్ పూల్ లోకి (రాష్ట్రాలకు పంచే పూల్) వస్తుంది, అంటే కేవలం 4.26% మాత్రమే. నికరంగా కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై వసూలు చేసే మొత్తం పన్నులలో (రూ. 32.90 పైసలలో) సెస్, సర్ చార్జి, బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో వాటా కలుపుకొని రూ. 32.33 పైసలు అనగా 98.3% కేంద్రానిదే కాగా, కేవలం 1.7% మాత్రమే రాష్ట్రాల వాటా కింద అన్ని రాష్ట్రాలకు పంచుతారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
24 మార్చ్ 2021న రాజ్యసభలో జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ పెట్రోల్ పై వసూలు చేసే పన్నుల్లో నికరంగా 64% వాటా రాష్ట్రాలకు చెందుతుందని, కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం 36% అని వ్యాఖ్యానించాడు.
పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం విదించే పన్నులు:
పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ క్రింద లిస్ట్ చేసిన నాలుగు విధాలుగా ఎక్సయిజ్ డ్యూటీని వసూలు చేస్తోంది.
- బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ (BED) – లీటర్ పెట్రోలుపై రూ. 1.40
- స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (SAED) – లీటర్ పెట్రోలుపై రూ.11
- అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్) (AED) – లీటర్ పెట్రోలుపై రూ. 18
- అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్ (AIDC) – లీటర్ పెట్రోలుపై రూ. 2.50
ఐతే ఈ నాలుగింటిలో స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీని (SAED) 2002 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశపెట్టారు. ఐతే ఈ ఆక్ట్ లో SAEDని సర్ ఛార్జి రూపంలో వసూలు చేస్తారని, ఇలా వసూలు చేసింది ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వానికే చెందుతుందని ఆ చట్టంలో స్పష్టంగా పేర్కొనారు. దీన్నిబట్టి, SAED డివిజబుల్ పూల్ లోకి రాదని, ఇందులో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదని అర్ధంచేసుకోవచ్చు.
ఇక పెట్రోలుపై అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీని (AED) 1998 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశపెట్టారు, దీనినే రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అని కూడా అంటారు. ఐతే ఈ ఆక్ట్ లో అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసేది కేవలం కేంద్ర ప్రభుత్వానికే చెందుతుందని, ఇందులో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదని స్పష్టంగా పేర్కొన్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం సెస్ మరియు సర్ ఛార్జి రూపంలో వసూలు చేసే దానిని రాష్టాలకు పంచరు.
అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ని 2021-22 బడ్జెట్ లో ప్రవేశపెట్టారు, ఈ సెస్ కింద వసూలు చేసేది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే చెందుతుంది.
23 మార్చ్ 2021న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో మాట్లాడుతూ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ అనేది డివిజబుల్ పూల్ లోకి రానప్పటికీ అంతిమంగా వ్యవసాయ వసతులు అభివృద్ధి చేయడానికి ఇవి రాష్ట్రాలకే వెళ్తాయని అంది. 2021-22 బడ్జెట్ చర్చ సందర్బంగా సెస్, సర్ ఛార్జి రూపంలో వసూలు చేసే మొత్తం రాష్ట్రాలకు పంచే డివిజబుల్ పూల్ లోకి రాదు అని లోక్ సభ, రాజ్య సభ రెండిట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసారు.
చివరగా మిగిలింది బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ, దీనిని సెంట్రల్ ఎక్సయిజ్ టారిఫ్ ఆక్ట్, 1985 ద్వారా ప్రవేశపెట్టారు. కేవలం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసేది మాత్రమే డివిజబుల్ పూల్ లోకి వస్తుంది, తద్వారా ఇందులో రాష్ట్రాలకు వాటా ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పైన నాలుగు రూపాలలో విధించే ఎక్సయిజ్ డ్యూటీలో కేవలం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసేదాంట్లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది. అంటే రూ. 32.9ల కేంద్ర పన్నులో కేవలం 4.26% (రూ. 1.40 పైసలు) మాత్రమే డివిజబుల్ పూల్ లోకి వస్తుంది.
15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో వసూలు చేసే దాంట్లో రాష్ట్రాలకు 41% వాటా, మిగిలిన 59% కేంద్రానికి కేటాయించింది (కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి). అంటే కేవలం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే రూ. 1.40 పైసలు మాత్రమే డివిజబుల్ పూల్ లోకి వస్తాయి కాబట్టి, ఇందులో 41% అనగా రూ. 0.57 పైసలు మాత్రమే రాష్ట్రాలకు పంచుతారు ( పైగా ఈ రూ. 0.57 పైసలలో 15వ ఫైనాన్స్ కమిషన్ సూచనల మేరకు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిష్పత్తిలో వాటా ఉంటుంది). మిగిలిన 59% అంటే రూ. 0.83 పైసలు మొత్తం కేంద్రానివే.
ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం తెలంగాణకు ఈ 41% లో 2.13% వాటా కేటాయించింది. సింపుల్ గా చెప్పాలంటే బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో అన్ని రాష్ట్రాలు పంచుకోవాల్సిన 41% అనగా 57 పైసలలోతెలంగాణకి 2.13% అనగా రూ 0.01 వాటా చెందుతుంది.
క్లుప్తంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై వసూలు చేసే మొత్తం పన్నులలో (రూ. 32.90 పైసలలో) సెస్, సర్ చార్జి మరియు బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో వాటా కలుపుకొని రూ. 32.33 పైసలు అనగా 98.3% కేంద్రానిదే కాగా, కేవలం 1.7% మాత్రమే రాష్ట్రాల వాటా కింద అన్ని రాష్ట్రాలకు పంచుతారు.
స్టేట్ VAT:
ఇకపోతే పెట్రోలియం ఉత్పతుల పై ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విధంగా టాక్స్ విధిస్తుంది. ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై 35.20% VAT విదిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 31% VAT + రూ.4/ltr VAT + రూ.1/ltr రోడ్ డెవలప్మెంట్ సెస్ విధిస్తుంది,
ఉదాహరణకి కేవలం ఒక్క తెలంగాణని పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్ లో 03 జులై 2021 రోజున HP బంక్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.89 పైసలుగా ఉంది. ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర పన్నులు మొత్తం విలువ రూ. 59.67 కాగా, ఈ మొత్తంలో కేంద్ర ఎక్సయిజ్ డ్యూటీ (బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో కేంద్ర వాటా + స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ + రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ + అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్) రూపంలో రూ. 32.33 కేంద్ర ఖజానాలోకి వెళ్తాయి. స్టేట్ VAT (35.2%) కింద రూ. 26.77 + ఎక్సయిజ్ డ్యూటీలో రాష్ట్ర వాటా కింద రూ. 0.01 పైసలు మొత్తం కలుపుకొని రూ. 26.78 తెలంగాణ ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయి. అంటే హైదరాబాద్ లో మనం కొనే లీటర్ పెట్రోల్ పై వసూలు చేసే పన్నుల్లో 44.88%(రూ. 26.78) రాష్ట్ర వాటా కాగా కేంద్ర వాటా 54.17% (రూ. 32.33). మిగిలిన 0.95% (రూ. 0.56, బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో తెలంగాణా రాష్ట్ర వాటా తీసేసిన తరవాత మిగిలింది) ఇతర రాష్ట్రాలకు పంచుతారు.
చివరగా, పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఎక్సయిజ్ డ్యూటీలో నికరంగా 98.3% వాటా కేంద్రానిది కాగా, కేవలం 1.7% మాత్రమే రాష్ట్రాలకు పంచుతారు.