Fake News, Telugu
 

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రధాని మోదీ పాలనను ప్రశంసిస్తూ ఈ ప్రకటన చేయలేదు

0

భారతదేశ మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నరేంద్ర మోదీ పాలనపై ఇటీవల ప్రశంసలు కురిపించారు అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది.  కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతిభా పాటిల్, భారతదేశాన్ని మంచి దేశంగా మార్చగల ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ అని, “ప్రధాని మోదీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు,” అని అన్నట్లు సోషల్ మీడియాలో చెప్తున్నారు. అసలు ఇందులో ఎంత వాస్తవం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పాలనను ప్రశంసించారు.

ఫాక్ట్(నిజం): మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రధాని నరేంద్ర మోదీ పాలనను ప్రశంసిస్తూ బహిరంగ ప్రకటన చేసినట్లు ఎటువంటి వార్తా కథనాలు, లేదా ప్రెస్ రీలీజ్ ఇంటర్నెట్లో లేదు. పోస్ట్‌లో షేర్ చేయబడిన ఈ సందేశం కనీసం 2018 నుండి సోషల్ మీడియాలో ప్రచారం చేయబడుతోంది. ప్రతిభా పాటిల్ కార్యాలయం ‘ది క్వింట్’ న్యూస్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ సందేశం నకిలీదని స్పష్టం చేసింది. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

ప్రధాని నరేంద్ర మోదీపై దేశ మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ప్రశంసిస్తూ ఏదైనా ప్రకటన చేశారా లేదా అని తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికితే ప్రతిభా పటేల్ అలాంటి ప్రకటన చేయలేదని తెలిసింది. వైరల్ మెసేజీలో పేర్కొన్నట్లుగా ప్రతిభాపాటిల్ నరేంద్ర మోదీని పొగిడితే, వార్తా వెబ్‌సైట్‌లు ఆ సమాచారాన్ని గురించి కథనాలను కచ్చితంగా ప్రచురిస్తాయి. పోస్ట్‌లో ప్రతిభా పాటిల్‌కు ఆపాదించబడిన ప్రకటనలను రిపోర్టు చేసే వార్తా కథనాలను మాకు ఇంటర్నెట్‌లో ఎక్కడా దొరకలేదు

పోస్ట్‌లో షేర్ చేసిన ఫోటో కనీసం 2018 నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ది క్వింట్’ న్యూస్ వెబ్‌సైట్ 2018లో ఈ సందేశానికి సంబంధించి స్పష్టత కోసం ప్రతిభా పాటిల్ కార్యాలయాన్ని సంప్రదించింది. ‘ది క్వింట్’తో మాట్లాడుతూ, ప్రతిభా పాటిల్ కార్యాలయ అధికారులు “ఈ క్లెయిమ్ పూర్తిగా తప్పు. ఇది అంతకుముందు కూడా వైరల్ అయిన ఫేక్ న్యూస్,” అని అన్నారు. ప్రతిభా పాటిల్ కార్యాలయం జారీ చేసిన వివరణను ‘ది క్వింట్’ ప్రచురించిన ఫాక్ట్ చెక్ కథనంలో చూడవచ్చు. అదనంగా, బూమ్ లైవ్ వారు కూడా ప్రతిభా పాటిల్ యొక్క ప్రైవేట్ సెక్రటరీతో మాట్లాడగా, ఈ వైరల్ పోస్టులో నిజం లేదని, అబద్ధ ప్రచారం చేస్తున్నారు అని చెప్పారు. 

చివరిగా, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రధాని నరేంద్ర మోదీ పాలనను ప్రశంసిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll