Fake News, Telugu
 

హిందూ ధర్మం ముప్పులో ఉందని, ఇలాగే కొనసాగితే మరో యాభై ఏళ్లు కూడా అది మనుగడ సాధించలేదని న్యాయవాది దుష్యంత్ దవే అనలేదు

0

హిందూ ధర్మం ముప్పులో లేదని కొందరు అంటారు, కానీ అది తప్పుడు ప్రచారం, ఒకప్పుడు హిందూ ధర్మం చాలా ప్రాంతాల్లో ఉండేది, ఇప్పుడు అది మన దేశంలో మాత్రమే ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే, మరో 50 సంవత్సరాలు కూడా హిందుత్వం మనుగడ సాగించలేదని న్యాయవాది దుష్యంత్ దవే అన్నారని చెప్తున్న పోస్ట్ (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: హిందూ ధర్మం ముప్పులో లేదని కొందరు అంటారు, కానీ అది తప్పుడు ప్రచారం. ఒకప్పుడు హిందూ ధర్మం చాలా ప్రాంతాల్లో ఉండేది, ఇప్పుడు అది మన దేశంలో మాత్రమే ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే, మరో 50 సంవత్సరాలు కూడా హిందుత్వం మనుగడ సాగించలేదని న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు. 

ఫ్యాక్ట్(నిజం): దుష్యంత్ దవే ఈ వ్యాఖ్యలు చేయలేదు. హిందూ ధర్మానికి అసలు ఎలాంటి ముప్పు లేదని ఇటీవల ఆయన ‘The Wire’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, అడ్వకేట్ దుష్యంత్ దవే ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

అయితే, ఈ సెర్చ్ ద్వారా ఆయన ఇటీవల, ది వైర్ (The Wire) మీడియా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హిందూ ధర్మానికి ఎటువంటి ముప్పు లేదని చెప్పారని మాకు తెలిసింది. అంటే వైరల్ క్లెయిములో చెప్పినట్లు హిందూ ధర్మానికి ఎలాంటి ముప్పు లేదని, అది వేలాది సంవత్సరాలుగా మనుగడలో ఉంది అని కొందరు అంటున్నారు, కానీ అది తప్పుడు ప్రచారం అని ఆయన అనలేదు. 

దానికి విరుద్ధంగా 5000 వేల సంవత్సరాలుగా హిందూ ధర్మం మనుగడలో ఉంది, ఇస్లాం, క్రైస్తవ్యం, జైనిజం, బుద్ధిజం, తదితర మతాలు వచ్చినప్పటికీ మన దేశం, హిందూ ధర్మాన్ని ఏం చేయలేకపోయాయని, అలాగే ఈరోజున మన దేశానికి, మన ధర్మానికి ఎటువంటి ముప్పు లేదని ఆయన చెప్పారు.

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) బీఆర్ గవాయ్‌పై సుప్రీం కోర్టులో ఒక న్యాయవాది బూటు విసిరి, దాడి చేయడానికి ప్రయత్నించిన సంఘటన గురించి ది వైర్ వారితో మాట్లాడుతూ, ఒక న్యాయవాది ఇలా చేయడం న్యాయవాద వృత్తికే సిగ్గుచేటు అని అన్నారు. అలాగే, CJI పైన దాడికి యత్నం చేసిన రాకేష్ కిషోర్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) అనే న్యాయవాదిని కొందరు భారత దేశంలో జరుగుతున్న ధర్మ యుద్ధం యొక్క యోధుడిలా చూస్తున్నారని తనను ప్రశ్నలు అడుగుతున్న జర్నలిస్ట్ ఆర్ఫా ఖానుం అన్నారు

కొన్ని వారాల క్రితం, ఖజురాహోలో విరిగిపోయిన ఒక విష్ణు భగవానుడి విగ్రహాన్ని తిరిగి కట్టించాలని ఒకరు సుప్రీంకోర్టులో వేసిన ఒక పిటిషన్ గురించి మాట్లాడుతూ “మీరు విష్ణువు భక్తులని అంటున్నారు. కాబట్టి, మీరు వెళ్లి ప్రార్థన చేయండి. కోర్టులకు కాకుండా దైవాన్నే అడిగి చూడండి” అని CJI గవాయి అన్నారు. అలా అనడం సనాతన ధర్మానికి అవమానం అని, దీన్ని హిందుస్థాన్ సహించదని అంటూ ఈ వ్యక్తి (CJI పైన దాడి యత్నం చేసిన రాకేష్ కిషోర్) వచ్చాడని, ఆ తర్వాత CJI పైన హింసను ప్రేరేపిస్తూ చాలా మంది యూట్యూబర్లు వీడియోలు చేశారని ఖానుం చెప్పారు

దీనికి ఆయన స్పందిస్తూ, “చూడండి, ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు దేశంలో వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారింది. మతం పేరుతో సమాజంలో అసహనం పెరుగుతుంది, ఇది చాలా దురదృష్టకరం” అని అన్నారు. దేశంలో ఈ వాతావరణం తన ప్రకారం ఎల్.కె. అద్వానీ రథయాత్ర ప్రారంభించినప్పుడు మొదలైందని చెప్తూ ఇది ప్రధాని మోదీ ప్రధాన మంత్రి అయ్యాక గరిష్ట స్థాయికి చేరుకుందని ఆయన అన్నారు

గత 11 సంవత్సరాలలో పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోందని అన్నారు. మనం హిందూ ధర్మాన్ని ఏదో ఒక విధంగా రక్షించాలి అనే మానసిక స్థితి వచ్చేసింది అని ఆయన చెప్పారు.  “హిందూ మతం ఎవరి నుంచి ప్రమాదంలో ఉందో నాకు అర్థం కావడం లేదు. 5000 సంవత్సరాలుగా ఈ ధర్మాన్ని ఎవరూ కదిలించలేక పోయారు. జైన మతం వచ్చింది, ఈ దేశంలో. బౌద్ధమతం వచ్చింది, ఇస్లాం వచ్చింది, క్రైస్తవ మతం వచ్చింది, సిక్కు మతం వచ్చింది, జొరాస్ట్రియనిజం కూడా ఒక సమయంలో వచ్చింది 5000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం. యే ధర్మం కూడా ఈ సుందర ధర్మాన్ని నాశనం చేయలేక పోయాయి, దానిని కదిలించలేక పోయింది.  కాబట్టి నేడు ఈ దేశానికి, దేశ ధర్మానికి  ఎలాంటి ముప్పు లేదు. మనం ఈ విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు.” అని అన్నారు. ఈ వాక్యాలు దుష్యంత్ దవే ఈ వీడియోలో 7:13 మార్క్ దగ్గర అన్నారు.  

అదనంగా, ఈ క్లెయిమ్ గురించి మేము ఇంటర్నెట్‌లో వెతుకుతున్న సమయంలో, దుష్యంత్ దవే చేసిన ఈ వ్యాఖలకు ‘X’ ద్వారా స్పందిస్తూ, హిందూ ధర్మానికి ఎలాంటి ముప్పు లేదనడంలో నిజం లేదని కొందరు పోస్ట్ చేశారు (ఇక్కడ, ఇక్కడ).  వీరి పోస్టులలో వైరల్ కైయిములో దుష్యంత్ దవేకు ఆపాదిస్తున్న విషయాలు ఉన్నాయి. 

ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుండి ఆగ్నేయాసియా వరకు, ఇండోనేషియా నుంచి కంబోడియా వరకు హిందూ సంస్కృతి, సంస్కృతులతో రాజ్యాలు ఉండేవని, నేడు అది భారతదేశానికి, అది కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది.  ఇదే వేగంతో తగ్గుతూ వస్తే, మరో 50 సంవత్సరాలు కూడా హిందుత్వం మనుగడ సాగించలేదని ఈ పోస్టుల్లో వీరు పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు దుష్యంత్ దవే చేశారని చెప్తూ వైరల్ పోస్టు ద్వారా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  

చివరగా, హిందూ ధర్మం ముప్పులో ఉందని, ఇలాగే కొనసాగితే మరో యాభై ఏళ్లు కూడా అది మనుగడ సాధించలేదని న్యాయవాది దుష్యంత్ దవే అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll