వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు 13 ఫిబ్రవరి 2025న అరెస్ట్ చేశారు (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో ‘వంశీ అరెస్ట్ పై ఎవరూ మాట్లాడకండి అంటూ, వైసీపీ నేతలకు జగన్ ఆదేశం..’ ఇచ్చారు అని వార్త ఉన్న Way2News వారి ఒక కథనం యొక్క స్క్రీన్‌షాట్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి ఎవరూ మాట్లాడవద్దు అని వైసీపీ నేతలకు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చెప్పారు అని Way2News ఈ కథనాన్ని ప్రచురించింది.
ఫ్యాక్ట్(నిజం): Way2News వారు ఈ కథనాన్ని తాము ప్రచురించలేదు అని తమ ‘X’ అకౌంట్ ద్వారా స్పష్టం చేసారు. అలాగే వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు కూడా పలువురు స్పందించారు. కావున, పోస్టులో చేస్తున్న ఈ క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి మాట్లాడవద్దు అని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు అని చెప్తూ మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు దొరకలేదు.
అలాగే, ఈ క్రమంలో మాకు వైసీపీ అధికారిక ‘X’ అకౌంట్‌లో, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి తమ అభిప్రాయాలను పంచుకున్న కొన్ని వీడియోలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

అలాగే, 14 ఫిబ్రవరి 2025న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘X’ లో ఒక పోస్ట్ చేశారు.
ఈ ఆర్టికల్‌ను తాము పోస్ట్ చేయలేదు అని, కొంతమంది తమ న్యూస్ ఆర్టికల్ ఫార్మాట్ ఉపయోగించి ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు అని ‘X’ ద్వారా Way2News చెప్పారు.
చివరిగా, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఎవరూ మాట్లాడకండి అంటూ వైసీపీ నేతలకు జగన్ ఆదేశం ఇచ్చారు అన్న ఈ కథనాన్ని Way2News ప్రచురించలేదు.