Fake News, Telugu
 

ఉనికిలో లేని వార్తా పత్రికల పేర్లతో ఫేక్ న్యూస్ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు

0

11 నవంబర్ 2025న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, సోషల్ మీడియాలో రెండు న్యూస్ క్లిప్పింగులు (ఇక్కడ, ఇక్కడ) షేర్ చేయబడుతున్నాయి. మన ప్రభాత వెలుగు, వార్త వెలుగు అనే రెండు వేరు వేరు పత్రికల్లో ప్రచురించిన వార్తా కథనాల క్లిప్పింగులు ఇవి (ఇక్కడ, ఇక్కడ). ‘మన ప్రభాత వెలుగు’ పేరు మీద ఉన్న క్లిప్పులో, హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం మాజీ సర్పంచ్ నవ్య, బీఆర్ఎస్ పార్టీలో అందరూ కామాంధులే ఉన్నారని, జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరు ఓటు వేయకండి అని అన్నారు అని చెప్తున్న వార్త, 28 అక్టోబర్ 2025న ప్రచురించినట్టు ఉంది.

‘వార్త వెలుగు’ న్యూస్ క్లిప్పింగులో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు దారులు (బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ)) కేసీఆర్‌ను క్షమించమని కోరారని చెప్తున్న వార్త 04 నవంబర్ 2025 ప్రచురించినట్టు ఉంది. ఈ రెండు క్లిప్పింగుల క్రింది భాగంలో ఆ వార్తా పత్రికల వెబ్సైట్ల లింకులు కూడా ఉన్నాయి. అసలు ఈ క్లెయిమ్‌ల వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూaద్దాం.

ఈ క్లెయిమ్‌ల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్లు మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘మన ప్రభాత వెలుగు’, ‘వార్త వెలుగు’ అనే రెండు వార్తా పత్రికల్లో వచ్చిన నిజమైన కథనాలకు చెందిన న్యూస్ క్లిప్పింగులు ఇవి. ‘బీఆర్ఎస్ పార్టీలో అందరూ కామాంధులే అని సర్పంచ్ నవ్య అన్నారని ‘మన ప్రభాత వెలుగు’ కథనాన్ని ప్రచురించింది. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు దారులలో ఆరుగురు, తమను ఆ పార్టీలోకి తిరిగి చేర్చుకోమని కోరుతూ కేసీఆర్‌కు ఒక లేక రాశారని ‘వార్త వెలుగు’ కథనాన్ని ప్రచురించింది.

ఫ్యాక్ట్(నిజం): ‘మన ప్రభాత వెలుగు’, ‘వార్త వెలుగు’ పేర్లతో ఎటువంటి వార్తా పత్రికలు లేవు. ఈ రెండు క్లిప్పింగులు ఎడిట్ చేసి తయారు చేసిన గ్రాఫిక్‌లు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్స్ తప్పు

క్లిప్పింగ్ 1:

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, సర్పంచ్ నవ్య ఇటీవల ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్తున్న ఎటువంటి వార్తా కథనాలు మాకు లభించలేదు. గతంలో తను బీఆర్ఎస్ యొక్క స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టీ.రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసారు (ఇక్కడ, ఇక్కడ).

ఇక వైరల్ అవుతున్న ఈ క్లిప్పింగ్‌ను మేము పరిశీలించగా, ‘ప్రభాత వెలుగు’ (www.v6velugu.com), తెలుగు దినపత్రిక లోగోను మార్ఫ్ చేసి ‘‘మన ప్రభాత వెలుగు’’ అని మార్చి దీన్ని తయారు చేశారు అని మేము గుర్తించాము.

అలాగే, ఈ క్లిప్పింగ్‌లో ఉన్న www.manavelugu.com అనే వెబ్సైటుకు వెళ్లి మేము చూడగా, అది వ్యవసాయ ఉత్పత్తులను అమ్మే ఈ-కామర్స్ వెబ్సైట్ ‘https://gonefarmers.com/’కు మమ్మల్ని రీ-డైరెక్ట్ (redirect) చేసింది. 

స్థానిక ఈ-పేపర్లను పబ్లిష్ చేసే ‘Readwhere’ & ‘Magzter’ వంటి వెబ్సైట్లలో కూడా ‘మన వెలుగు’ పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదు.

క్లిప్పింగ్ 2 :

క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుదారులలో అరుగురు, ఆ పార్టీలోకి వారిని తిరిగి చేర్చుకోమని కోరుతూ కేసీఆర్‌కు ఒక లేక రాశారని చెప్తూ మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు.

ఇక ఈ క్లిప్పింగ్‌ను పరిశీలించగా ‘ప్రభాత వెలుగు ’(www.v6velugu.com) తెలుగు దినపత్రిక  లోగోను మార్ఫ్ చేసి ‘వార్త వెలుగు’ అని మార్చి, ఎడిట్ చేసి, ఈ క్లిప్పింగును తయారు చేశారని మేము గుర్తించాము. 

ఇక ఈ న్యూస్ క్లిప్పింగ్ కింద భాగంలో ఉన్న ఈ-పేపర్ లింక్ ‘https://epaper.varthavelugu.com/c’ను మేము విజిట్ చేయగా, అసలు ఈ వెబ్సైటు మనుగడలో లేదని మాకు తెలిసింది.

గతంలో కూడా ప్రముఖ దినపత్రికల పేర్లను అనుకరిస్తూ నకిలీ పేపర్ క్లిప్పింగ్స్ వైరల్ అయినప్పుడు Factly ప్రచురించిన ఫాక్ట్-చెక్ కథనాలను ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ‘మన ప్రభాత వెలుగు’, ‘వార్త వెలుగు’ పేర్లతో వైరల్ అవుతున్న ఈ రెండు న్యూస్ క్లిప్పింగులు ఫేక్. ప్రముఖ వార్తా పత్రిక ‘ప్రభాత వెలుగు’ లోగోలా కనిపించేలా ఎడిట్ చేసిన లోగోలు వాడి, ఈ ఫేక్ వార్తా కథనాలను తయారు చేశారు.

Share.

About Author

Comments are closed.

scroll