Fake News, Telugu
 

ఎయిర్ ఇండియా తప్పించి ఈ పోస్టులో తెలిపిన మరే సంస్థను నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి ప్రైవేటికరణ చేయలేదు

0

నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అమ్మబడిన మరియు అమ్మబోతున్న ప్రభుత్వ రంగ సంస్థల జాబితా, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది. ప్రభుత్వ సంస్థలు BPCL, SAIL, HP, BHEL, ఎయిర్ ఇండియా, BALCO, కోల్ ఇండియా, ఎయిర్‌పొర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మొదలగు వాటిని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా ప్రైవేటీకరణ చేసిందని ఈ పోస్టులో తెలుపుతున్నారు. అంతేకాదు, ఇస్రో, ఐఐటీలు, ఐఐఎంలు, ఐసిఎస్ఈలను నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలో అమ్మబోతున్నట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.          

క్లెయిమ్: నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అమ్మబడిన మరియు అమ్మబోతున్న ప్రభుత్వ రంగ సంస్థల జాబితా.

ఫాక్ట్ (నిజం): ఎయిర్ ఇండియా మరియు నార్త్ ఈస్ట్రన్ ఎలెక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటడ్ సంస్థలు తప్పించి మరే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి ప్రైవేటికరణ చేయలేదు. బిపిసిఎల్, కోల్ ఇండియా, హెచ్‌పిసిఎల్ మొదలగు ప్రభుత్వ సంస్థలలో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికీ మెజారిటీ వాటాలు కలిగి ఉంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.     

సాధారణంగా ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించి ప్రభుత్వ ఖర్చులకు డబ్బులు అందుబాటులో తేవడానికి, ఆ సంస్థలలో ఇతరులను భాగస్వామ్యం చేయడం వల్ల పోటీతత్వాన్ని పెంపొందించి తద్వారా సంస్థ పనితీరు పెంచడానికి, సామాజిక రంగాల్లో ఖర్చు చేయడానికి కావలసిన డబ్బు సేకరించడానికి మొదలైన కారణాల వల్ల ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలు అమ్ముతుంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన పూర్తి సమాచారం డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మ్యానేజ్మెంట్ (DIPAM) మరియు ‘బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి PSU’ (BSEPSU) వెబ్సైటులలో  లభిస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మూడు విధానాలను పాటిస్తుంది. అవి మైనారిటీ డిస్ఇన్వెస్టీమెంట్, మెజరిటీ డిస్ఇన్వెస్టీమెంట్ మరియు పూర్తి డిస్ఇన్వెస్టీమెంట్ లేదా ప్రైవేటీకరణ విధానాలు. ఈ డిస్ఇన్వెస్టీమెంట్ విధానాల పూర్తి సమాచారాన్ని ఫాక్ట్‌లీ గతంలో పబ్లిష్ చేసిన ఈ ఆర్టికల్‌లో చదవచ్చు.       

పోస్టులో తెలుపుతున్న ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన వివరాల కోసం ఈ వెబ్సైటులలో వెతికితే, ఈ ప్రభుత్వ సంస్థలలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ వివరాలు BSEPSU వెబ్సైటులో లభించాయి. ఈ వెబ్సైట్లో తెలిపిన సమాచారం ప్రకారం, ఎయిర్ ఇండియా మరియు నార్త్ ఈస్ట్రన్ ఎలెక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటడ్ సంస్థలు తప్పించి మరే ప్రభుత్వ సంస్థలలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి వాటాలను అమ్మలేదని స్పష్టమయ్యింది. బిపిసిఎల్, కోల్ ఇండియా, హెచ్‌పిసిఎల్ మొదలగు ప్రభుత్వ సంస్థలలోని మైనారిటీ వాటాలను 1991లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అమ్మినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం బిపిసిఎల్ సంస్థలో 66.2 శాతం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో (SAIL) 65 శాతం, హెచ్‌పిసిఎల్‌లో 54.9 శాతం, బీహెచ్‌ఈఎల్‌లో 63.17 శాతం, భారత్ అల్యూమినియం కార్పొరేషన్ లిమిటెడ్లో (BALCO) 49 శాతం, కోల్ ఇండియా సంస్థలో 72.33 శాతం వాటాలు కలిగి ఉంది. 2022-23లో ఈ సంస్థలలో మళ్ళీ ఎటువంటి పెట్టుబడుల ఉపసంహరణ జరగలేదు.    

బిపిసిఎల్, బాల్కో సంస్థలలో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత ఎటువంటి పెట్టుబడి ఉపసంహరణలు జరగలేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలోని పలు రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరణ చేసిన మాట వాస్తవం. కానీ, బిఎస్ఎన్ఎల్, ఎయిర్‌పొర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)లో కేంద్రం తమ వాటాలను అమ్మేసిన మాటలో ఎటువంటి వాస్తవం లేదు. ఇండియన్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీలో ఒక భాగమైన ఆర్డినెన్సు ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీని ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూన్నట్టు ప్రభుత్వం 16 జూన్ 2021 నాడు ప్రకటించింది. ఈ ఆర్డినెన్సు ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీని 01 అక్టోబర్ 2021 నుండి ప్రభుత్వ పిఎస్‌యు కంపెనీలలో కలుపుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం అప్పుడు ప్రకటించింది.

Source: BSEPSU

అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం యొక్క వ్యాప్తిని మెరుగుపరచడానికి మరియు దేశంలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను పెంచడానికి, DOS అంతరిక్ష కార్యకలాపాలలో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి అడుగులు వేస్తున్నట్టు ఇస్రో 2021లో ప్రకటించింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇస్రో సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ చేయబోతున్నారనే ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. అలాగే ప్రభుత్వ అత్యున్నత విధ్యాసంస్థలు ఐఐటిలు, ఐఐఎంలని ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించలేదు. DIPAM వెబ్సైటులలో ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతున్న సంస్థల జాబితాలో ఈ విధ్యాసంస్థలు, ఇస్రోని ఎక్కడ లిస్ట్ చేయలేదు.

చివరగా, ఎయిర్ ఇండియా సంస్థ తప్పించి ఈ పోస్టులో తెలిపిన మరే సంస్థను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి ప్రైవేటికరణ చేయలేదు.    

Share.

About Author

Comments are closed.

scroll